Business

బెజవాడలో తెరుచుకున్న మల్టిప్లెక్స్‌లు-వాణిజ్యం

బెజవాడలో తెరుచుకున్న మల్టిప్లెక్స్‌లు-వాణిజ్యం

* రెండు రాష్ట్రాల మధ్య కొలిక్కివచ్చిన ఆర్టీసీ సమస్య..రేపు మంత్రి పువ్వాడ సమక్షంలో ఒప్పందం కుదుర్చుకోనున్న తెలంగాణ ఏపీ అధికారులు.

* నగరంలో మల్టీఫ్లెక్స్ థియేటర్లు  తెరచుకున్నాయి. రోజుకి మూడు షోలు ప్రదర్శించేలా ఏర్పాట్లు చేశారు. రెండు గంటలు ముందుగానే బాక్స్ ఆఫీస్‌లు తెరుచుకుంటున్నాయి. అయితే ఈ  మల్టీఫ్లెక్స్‌లు క్యాష్‌లెస్ ట్రాన్సాక్షన్, పేపర్ లెస్ టికెట్లతో నడవనున్నాయి. మల్టీఫ్లెక్స్‌లలో 50 శాతం ఆక్యుపెన్సీతో సీటింగ్ ఏర్పాట్లు చేశారు. కాగా రాష్ట్ర వ్యాప్తంగా ఇంకా 800 సింగిల్ థియేటర్లు తెరచుకోవడంలేదు. ఎప్పుడనేది ప్రశ్నార్థకంగా మిగిలింది. 

* నిర్మల సీతారామన్ పై తీవ్ర ఆరోపణలు చేసిన ఆర్థిక శాఖ మాజీ కార్యదర్శి.నిర్మలది విభిన్నమైన మనస్తత్వం అని వెల్లడి.కేంద్ర ఆర్థికమంత్రి నిర్మల సీతారామన్ పై కేంద్ర ఆర్థిక శాఖ మాజీ కార్యదర్శి సుభాష్ చంద్ర గార్గ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. మోదీ ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చిన మూడు వారాల్లోనే సుభాష్ చంద్రను ఆర్థికశాఖ నుంచి బదిలీ చేశారు. తన బదిలీని నిరసిస్తూ ఆయన స్వచ్ఛంద పదవీ విరమణ చేశారు. తాజాగా ఆయన తన అభిప్రాయాలు వెల్లడించారు. నిర్మల సీతారామన్ తనను పట్టుబట్టి బదిలీ చేయించారని ఆరోపించారు.నిర్మల సీతారామన్ కు ఆమె కంటే ముందు ఆర్థికమంత్రిగా చేసిన అరుణ్ జైట్లీకి ఎంతో తేడా ఉందని, నిర్మల వ్యక్తిత్వం భిన్నమైనదని వెల్లడించారు. తన పదవీకాలంలో నిర్మల సీతారామన్ తో ఎప్పుడూ మంచి సంబంధాలు కొనసాగించలేకపోయానని పేర్కొన్నారు. ఆమె ఆర్థికమంత్రిగా వచ్చేటప్పుడే తన పట్ల ఏవో పూర్వభావనలతో వచ్చారని సుభాష్ చంద్ర గార్గ్ తెలిపారు.”ఆమె నన్ను ఎప్పుడూ నమ్మింది లేదు. నాతో పనిచేయాలంటేనే ఆమె ఎంతో అసౌకర్యంగా భావించేవారు. ఆర్థిక రంగ అంశాలపై కీలక నిర్ణయాల నేపథ్యంలో వ్యక్తిగతంగానూ, వృత్తిపరంగానూ నిర్మలతో సంబంధాలు క్షీణించాయి. ఆమే స్వయంగా నన్ను ట్రాన్స్ ఫర్ చేయించారు. అప్పటికి ఆమె ఆర్థికమంత్రిగా బాధ్యతలు చేపట్టి నెలరోజులే” అని వివరించారు.

* ఎనిమిది నెలల తర్వాత వస్తు సేవల పన్ను(జీఎస్టీ) వసూళ్లు రూ.లక్ష కోట్ల మార్క్‌ను దాటాయి. అక్టోబర్‌ నెలలో రూ.1,05,155 కోట్లకు చేరాయి. ఫిబ్రవరి తర్వాత వసూళ్లు రూ.లక్ష కోట్లు దాటడం ఇదే మొదటిసారి. ఇందులో సీజీఎస్‌టీ వాటా రూ.19,193 కోట్లు కాగా, ఎస్‌జీఎస్‌టీ రూ.25,411 కోట్లు, ఐజీఎస్‌టీ రూ.52,540 కోట్లు. సమ్మిళిత జీఎస్‌టీ నుంచి కేంద్ర వాటా రూ.25,091 కోట్లు, రాష్ట్రాల వాటా రూ.19,427 కోట్లుగా ఉండనుంది. ఫలితంగా కేంద్రానికి మొత్తంమీద 44,285 కోట్లు, రాష్ట్రాలకు రూ.44,839 కోట్లు లభించనున్నాయి.

* కరోనా సంక్షోభాన్ని ఎదుర్కోవడంలో ప్రభుత్వ వ్యూహాలతో భారత్‌ ఉత్తమ ఫలితాలు సాధిస్తోందని ఫిక్కీ అధ్యక్షురాలు సంగీతా రెడ్డి అభిప్రాయపడ్డారు. అంతేకాకుండా ప్రభుత్వ చర్యలతో దేశ ఆర్థిక వ్యవస్థ కూడా తిరిగి పుంజుకుంటుందని ఆమె స్పష్టం చేశారు. ఇలాంటి సమయంలో మరిన్ని కఠిన నిర్ణయాలు తీసుకోవడంతో పాటు వృద్ధి అజెండాకు మరింత ఊతమివ్వాలని ఆమె సూచించారు. కరోనా వైరస్‌ సంక్షోభంతో ప్రజల ప్రాణాలు, జీవనోపాధిని సమన్వయపరుస్తూ కాపాడుకునేందుకు ప్రపంచ దేశాలు తలమునకలయ్యాయి. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఆరోగ్య, మౌలిక సదుపాయాలను పెంచేందుకు భారత్‌ కూడా కఠినంగా లాక్‌డౌన్‌ అమలుపరిచింది. అంతేకాకుండా ప్రజల ప్రాణాలు రక్షించడంపై దృష్టిసారించింది. ఈ తరహా ప్రభుత్వ వ్యూహాలు ఉత్తమ ఫలితాలిచ్చాయని సంగీతా రెడ్డి వెల్లడించింది.