NRI-NRT

అమెరికా పిల్లలకు మన అడవి హీరో కథ

అమెరికా పిల్లలకు మన అడవి హీరో కథ

పద్మశ్రీ అవార్డు గ్రహీత జాదవ్ పాయెంగ్‌కు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికాలోని ఓ ప్రముఖ స్కూల్.. ఆరో తరగతి పాఠ్యాంశాలలో జాదవ్ పాయెంగ్ జీవిత చరిత్రను చేర్చింది. వివరాల్లోకి వెళితే.. అస్సాంకు చెందిన జాదవ్ పాయెంగ్ గత నలభై సంవత్సరాలుగా పర్వావరణ కార్యకర్తగా పని చేస్తున్నారు. అస్సాంలో జోర్హాట్ పట్టణానికి 28 కిలోమీటర్ల దూరంలో ప్రపంచంలోనే అతిపెద్ద నదిముఖ ద్వీపం ఉన్న విషయం తెలిసిందే. ఈ ద్వీపంలో జాదవ్ పాయెంగ్.. 1979 నుంచి గత 42 సంవత్సరాలుగా మొక్కలు నాటుతూ అక్కడ 550 హెక్టార్ల విస్తీర్ణంతో ఓ అడవినే సృష్టించారు. ఈ నేపథ్యంలో ఆయన ఫారెస్ట్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా గుర్తింపు పొందారు.కాగా.. ఆయన కృషిని గుర్తించిన భారత ప్రభుత్వం జాదవ్ పాయెంగ్‌ను పద్మశ్రీ అవార్డుతో సత్కరించగా.. తాజాగా అమెరికాలోని బ్రిస్టల్ గ్రీన్ హిల్స్ స్కూల్ ఆయన జీవిత చరిత్రను ఆరో తరగతి కరికులంలో చేర్చింది. ఈ సందర్భంగా ఆ స్కూల్ టీచర్ నవమీ శర్మ మీడియాతో మాట్లాడుతూ.. ‘ఎకాలజీ లెస్సన్స్‌లో భాగంగా పద్మశ్రీ జాదవ్ పాయెంగ్ గురించి పిల్లలు తెలుసుకుంటున్నారు. ఒక వ్యక్తి ప్రపంచంపై సానుకూల ప్రభావాన్ని ఎలా చూపగలడో భవిష్యత్తు తరాలకు చెప్పాలనే ఉద్దేశంతోనే ఫారెస్ట్ మ్యాన్ ఆఫ్ ఇండియా జీవిత చరిత్రను పిల్లలకు బోధిస్తున్నాం’ అని చెప్పారు. కాగా.. ఈ విషయంపై అస్సాం ముఖ్యమంత్రి స్పందించి, హర్షం వ్యక్తం చేశారు.