Business

ఈడీ చేతికి సత్యం ఫార్మా షేర్లు-వాణిజ్యం

Satyam Ramalinga Raju's Gland Pharma Shares To Transfer ED

* దేశీయ మార్కెట్లు లాభాల్లో పయనిస్తున్నాయి. బుధవారం ఉదయం 9:50 గంటల సమయంలో సెన్సెక్స్‌ 360 పాయింట్ల లాభంతో 40,621 వద్ద కొనసాగుతుండగా.. నిఫ్టీ 96 పాయింట్లు ఎగబాకి 11,909 వద్ద ట్రేడవుతోంది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.74.37 వద్ద కొనసాగుతోంది. అమెరికా ఎన్నికల ఫలితాల సరళి డెమొక్రాటిక్‌ పార్టీ అభ్యర్థి బైడెన్‌కు అనుకూలంగా కొనసాగుతుండడం మదుపర్ల సెంటిమెంటును పెంచింది. ఆసియా మార్కెట్లు మాత్రం కొంత అప్రమత్తత వహిస్తున్నాయి. ఇన్ఫోసిస్‌, సన్‌ ఫార్మా, విప్రో, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, టెక్‌ మహీంద్రా షేర్లు లాభాల్లో కొనసాగుతుండగా.. యూపీఎల్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, పవర్‌ గ్రిడ్‌ కార్పొరేషన్‌, హిందాల్కో ఇండస్ట్రీస్‌, భారతీ ఎయిర్‌టెల్‌ షేర్లు నష్టాలు చవిచూస్తున్నాయి.

* తొలిసారిగా పబ్లిక్‌ ఇష్యూ (ఐపీఓ)కు సిద్ధమవుతున్న హైదరాబాద్‌కు చెందిన గ్లాండ్‌ ఫార్మాలో సత్యం రామలింగరాజు, ఆయన కుటుంబ సభ్యుల సంస్థలకు ఉన్న షేర్లు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) చేతికి వెళ్లిపోనున్నాయి. ఇంతకాలం ఈడీ ‘అటాచ్‌మెంట్‌’ లో ఉన్న ఈ షేర్లను ఇప్పుడు తన డీమ్యాట్‌ ఖాతాకు బదిలీ చేయాల్సిందిగా గ్లాండ్‌ ఫార్మాకు ఈడీ సూచించింది. దీన్ని అనుసరించి షేర్ల బదిలీకి కంపెనీ సిద్ధమవుతోంది.

* ఏ ప్రభుత్వ రంగ బ్యాంకు (పీఎస్‌బీ) కూడా సేవా రుసుములు పెంచలేదని ఆర్థిక శాఖ స్పష్టం చేసింది. ఒక నెలలో బ్యాంకు శాఖలో నగదు జమ, ఉపసంహరణ లావాదేవీల సంఖ్యకు సంబంధించి చేసిన మార్పులను కూడా వెనక్కి తీసుకోవాలని బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా (బీఓబీ) నిర్ణయించిందని తెలిపింది. ‘నగదు, జమ ఉపసంహరణ సేవలను నెలకు ఐదు సార్లు ఉచితంగా పొందే అవకాశం ఉండగా.. దానిని మూడు సార్లకు తగ్గిస్తూ బీఓబీ నిర్ణయం తీసుకుంది. ఈనెల 1 నుంచి ఈ మార్పులు అమల్లోకి తేవాలని అనుకుంది. కరోనా పరిణామాల రీత్యా ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని నిర్ణయం తీసుకుంద’ని ఆర్థిక శాఖ తెలిపింది. ఇతర పీఎస్‌బీలు కూడా ఇటీవలి కాలంలో సేవా రుసుము పెంచలేదని స్పష్టం చేసింది. ఆర్‌బీఐ మార్గదర్శకాల ప్రకారం.. బ్యాంకులు తాము అందిస్తున్న సేవలకు పారదర్శకత, సమంజసమైన రీతిలో విచక్షణతో ఛార్జీలను విధించేందుకు అనుమతి ఉంది. అయితే ప్రస్తుతం నెలకొన్న కరోనా పరిణామాల కారణంగా సమీప భవిష్యత్‌లో ఛార్జీలు పెంచకూడదని పీఎస్‌బీలకు తెలియజేశామని ఆర్థిక శాఖ పేర్కొంది.

* ప్రభుత్వ రంగ దిగ్గజ బ్యాంక్‌ స్టేట్‌ బ్యాంక్ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) భారీ లాభాలను నమోదు చేసింది. సెప్టెంబర్‌ 30తో ముగిసిన రెండో త్రైమాసికానికి రూ.5,245.88 కోట్ల మేర ఏకీకృత నికర లాభాన్ని ఆర్జించింది. గతేడాది ఇదే త్రైమాసికంలో సాధించిన రూ.3,375.40 కోట్ల లాభంతో పోలిస్తే ఈ ఆర్థిక సంవత్సరం క్యూ2లో సాధించిన లాభం 55 శాతం అధికంగా నమోదైంది. ఈ మేరకు ఎస్‌బీఐ తన రెగ్యులేటరీ ఫైలింగ్‌లో పేర్కొంది.

* బుధవారం స్టాక్‌ మార్కెట్లు భారీ ఊగిసలాటలో కొనసాగుతున్నాయి. ప్రధానంగా మదుపర్లు అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలపై దృష్టిపెట్టారు. తొలి దశలో డెమొక్రాటిక్‌ అభ్యర్థి బైడెన్ ఆధిక్యం కొనసాగుతుండడంతో పుంజుకున్న మార్కెట్లు.. క్రమంగా ఫలితాలు ఉత్కంఠగా మారుతున్న కొద్దీ ఉదయపు లాభాలను జారవిడిచాయి. ఓ దశలో 40,641 వద్ద గరిష్ఠాన్ని తాకిన సెన్సెక్స్‌ తిరిగి 40,093 వద్ద కనిష్ఠానికి చేరింది. ఇంకా అభ్యర్థి గెలుపుపై సందిగ్ధత నెలకొనడంతో సూచీలు భారీ ఊగిసలాటలో ఉన్నాయి. మధ్నాహ్నం 1:56 గంటల సమయంలో సెన్సెక్స్‌ 73 పాయింట్ల లాభంతో 40,334 వద్ద కొనసాగుతుండగా.. నిఫ్టీ 14 పాయింట్లు ఎగబాకి 11,827 వద్ద ట్రేడవుతోంది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.74.37 వద్ద కొనసాగుతోంది.

* కొవిడ్‌ పరిణామాల వల్ల ఆన్‌లైన్‌ తరగతులు తప్పనిసరి కావడంతో, అందుకు ఉపయోగపడే స్మార్ట్‌ఫోన్లను అందుబాటు ధరల్లో ఆవిష్కరించినట్లు మైక్రోమ్యాక్స్‌ ఇండియా సహ వ్యవస్థాపకుడు రాహుల్‌ శర్మ తెలిపారు. వేగవంత ఛార్జింగ్‌ కోసం సీటైప్‌ ఛార్జర్లను కూడా రూ.8,000లోపు మోడళ్లలో తొలిసారి ఆవిష్కరించినట్లు వివరించారు. మధ్యశ్రేణి, అధిక ధర మోడళ్లు మరిన్నింటిని ‘ఇన్‌ మొబైల్స్‌’ బ్రాండ్‌పై ఆవిష్కరిస్తామని వెల్లడించారు. ఇన్‌ నోట్‌1, ఇన్‌ 1బి మోడళ్లలో 4 రకాల ఫోన్లను దేశీయ విపణిలోకి విడుదల చేసిన సందర్భంగా ఆయన మాట్లాడారు.