NRI-NRT

సౌదీ వీసాలపై శుభవార్త

Saudi Arabia Issues New Good News On Visas

సౌదీ ప్రభుత్వం కార్మికులు, యాజమానుల మధ్య వివాదాలను తగ్గించేందుకు అవసరమైన కీలక నిర్ణయం తీసుకున్నది. ఉద్యోగస్తులు తమ యజమాని అనుమతి లేకుండా ఎగ్జిట్, రీ-ఎంట్రీ వీసాలను అభ్యర్థించడానికి అనుమతి కల్పిస్తూ ప్రకటన జారీ చేసింది. దీని ద్వారా మార్కెట్లో పోటీ పెంచటమే కాకుండా మంచి ప్రతిభను ఆకర్షించేందుకు దోహదపడుతుందని ప్రభుత్వం భావిస్తున్నది. కింగ్ డమ్ విజన్ -2030 , నేషనల్ ట్రాన్స్ఫర్మేషన్ ప్రోగ్రామ్ కు అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నది. కొత్త సంస్కరణలు మార్చి 2021 నుంచి అమల్లోకి రావటమే కాకుండా ఇది ప్రవాస కార్మికులకు అదనపు హక్కులను కల్పిస్తుందని సౌదీ సర్కారు తెలిపింది.ఈ కొత్త ఆదేశాలతో యజమాని అనుమతి అవసరం లేకుండానే ఎగ్జిట్ , రీ-ఎంట్రీ వీసాలను అభ్యర్థించడానికి అనుమతి కల్పిస్తారు. స్మార్ట్ ఫోన్ అప్లికేషన్ ‘అబ్షర్’ ద్వారా గానీ వెబ్ పోర్టల్ ద్వారా గానే ఈ సేవలు ప్రజలకు అందుబాటులో ఉంటాయని మానవ వనరుల మంత్రిత్వ శాఖ పేర్కొన్నది. అయితే ఈ నూతన ప్రకటన పై స్థానిక యజమానులు, ప్రవాస కార్మికుల మధ్య వివాదాలు తగ్గుతాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.