DailyDose

హైదరాబాద్‌లో ఆకాశవంతెనలు-తాజావార్తలు

హైదరాబాద్‌లో ఆకాశవంతెనలు-తాజావార్తలు

* తెలంగాణలో పట్టభద్రుల ఎన్నికల ఓటరు నమోదు గడువు పొడిగించాలన్నపిటిషన్‌పై హైకోర్టు విచారణ జరిగింది. ఓటరు నమోదు గడువును డిసెంబర్ 7 వరకు పొడిగించాలని పిటిషనర్ పేర్కొన్నారు. నవంబర్‌ 7లోగా దరఖాస్తులు స్వీకరించాలని చట్టంలో ఉందని ఈసీ న్యాయవాది తెలిపారు. విపత్తులు, వరదలు వచ్చి ప్రజల ప్రాణాలు పోతున్నా తేదీలు మార్చకూడదా? అని హైకోర్టు పేర్కొంది. పిటిషన్‌పై అభిప్రాయాలు తెలపాలని ఈసీని కోరిన హైకోర్టు..విచారణ రేపటికి వాయిదా వేసింది.

* నగరవాసుల ప్రయాణాన్ని సురక్షితం చేయడంతో పాటు పాదచారుల నడక సాఫీగా సాగేలా హైదరాబాద్‌ మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్‌ఎండీఏ) సరికొత్త ఆలోచనలతో ముందుకెళ్తోంది. ఓవైపు రద్దీ ప్రాంతాల్లో రోడ్డు ప్రమాదాలు నియంత్రిస్తూనే..మరోవైపు అక్కడి కొద్ది ఖాళీ స్థలంలోనే బస్సుల రాకపోకలకు బస్టాండ్‌లు నిరి్మంచడంతో పాటు అక్కడే ప్రయాణికులు షాపింగ్‌ చేసేందుకు వాణిజ్య భవనాలను అందుబాటులోకి తీసుకొస్తోంది. ఈ మేరకు వాహన రద్దీ అధికంగా ఉండే మెహిదీపట్నం, ఉప్పల్‌ రింగ్‌ రోడ్డు జంక్షన్‌ వద్ద స్కైవాక్‌ (బోర్డు వాక్‌)లను నిర్మించే దిశగా కార్యచరణ రూపొందించింది. రూ.59.67 కోట్ల అంచనా వ్యయంతో ఈ నిర్మాణం పూర్తయితే ఆయా ప్రాంత రూపురేఖలు కూడా మారిపోనున్నాయి.

* రిపబ్లిక్ టీవీ ఎడిటర్ ఇన్ చీఫ్ అర్నబ్ అరెస్ట్ పై కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ఫైర్ అయ్యారు. ఈ ఘటన ఎమర్జెన్సీని గుర్తు చేస్తోందని మహారాష్ట్ర ప్రభుత్వంపై తీవ్రంగా మండిపడ్డారు. ఉద్ధవ్ సర్కార్ బహిరంగంగానే అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు. పత్రికా స్వేచ్ఛపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని, అందరూ వ్యతిరేకించాలని అమిత్‌షా అన్నారు. ప్రజాస్వామ్యం సిగ్గుపడేలా కాంగ్రెస్ మిత్ర పక్షాలు వ్యవహరిస్తున్నారని, థాకరే చేసిన పని ఎమర్జెన్సీని గుర్తు చేస్తోందని షా మండిపడ్డారు. 

* ఏపీలో 829 మంది టీచర్లు, 575 మంది విద్యార్థులకు కరోనా పాజిటివ్‌ నిర్ధారణ.. నవంబర్‌ 2 నుంచి 5లోపు చేసిన పరీక్షల్లో వెల్లడి

* జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ హైదరాబాద్ మాదాపూర్ నుంచి మియాపూర్ వరకు మెట్రోలో ప్రయాణించారు.

* తెలంగాణ లో కరోనా ఉధృతి కొనసాగుతోంది. తెలంగాణ ఆరోగ్య శాఖ కరోనా బులెటిన్ ను రిలీజ్ చేసింది.ఈ బులెటిన్ ప్రకారం,కొత్తగా 1,539 కరోనా కేసులు నమోదయ్యాయి.దీంతో తెలంగాణ లో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,45,682 కి చేరింది.ఇందులో 2,25,664 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 18,656 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి.

* రెండు రోజుల క్రితం కరోనా కేసుల సంఖ్య 40వేల దిగువకు చేరడంతో, వైరస్‌ వ్యాప్తి కాస్త తగ్గుముఖం పట్టినట్లు కనిపించినా.. మరోసారి వాటిలో పెరుగుదల కనిపిస్తోంది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం..గడిచిన 24 గంటల్లో 50,210 కొత్త కేసులు నమోదయ్యాయి. రెండు రోజులుగా నిర్ధారణ పరీక్షల సంఖ్య పెరగడం, వివిధ రాష్ట్రాల్లో ఎన్నికలు, పండుగల సీజన్‌ ఈ పెరుగుదలకు కారణంగా కనిపిస్తోంది. మరోవైపు, దేశంలో క్రియాశీల కేసుల సంఖ్య 5,27,962 గా ఉండగా..ఈ రేటు6.31 శాతానికి తగ్గింది. అలాగే వైరస్ బారినపడి కోలుకున్న వారి శాతం 92.20గా ఉంది.

* ఏపీ కేబినెట్‌ భేటీ ముగిసింది. అయితే ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కొత్త ఇసుక పాలసీకి ఏపీ కేబినెట్‌ ఆమోదం తెలిపింది. అన్ని రీచ్‌లను ఒకే సంస్థకు అప్పగించాలన్న సిఫార్సులకు ఆమోదం తెలిపారు. అంతేకాకుండా చిరు వ్యాపారులకు ఇచ్చే జగనన్న చేదోడు పథకానికి కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది. రాష్ట్రంలో భూముల రీసర్వే ప్రాజెక్ట్‌కు ఆమోదం తెలిపారు. దీంతో పాటుగా 6 మెడికల్‌ కాలేజీలకు ఏపీ మంత్రివర్గం ఆమోదం తెలిపింది. విజయనగరం జిల్లా గాజులరేగలో మెడికల్‌ కాలేజీ ఏర్పాటుకు 80 ఎకరాలు, పాడేరు మెడికల్‌ కాలేజీకి 35 ఎకరాలు కేటాయించారు. మచిలీపట్నం పోర్టు డీపీఆర్‌కు కేబినెట్‌ ఆమోదం తెలిపారు. ఈ నెల 24 తర్వాత అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఎస్ఈబీ పరిధిని విస్తరించాలని కేబినెట్‌ యోచిస్తున్నట్లు సమాచారం. ఎస్‌ఈబీ పరిధిలోకి ఆన్‌లైన్ గ్యాబ్లింగ్ సహా వివిధ జూదాలు, డ్రగ్స్, గంజాయిని నిరోధించే బాధ్యతలు ఎస్‌ఈబీకి అప్పగించారు.

* ఈనెల 24 తరువాత అంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు నిర్వహించాలని మంత్రి వర్గ సమావేశంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నిర్ణయం.

* డ్రగ్స్‌ కంట్రోల్‌ అడ్మినిస్ట్రేషన్ ‌డిపార్ట్‌మెంట్‌ గుంటూరు రీజియన్‌ డిప్యూటీ డైరెక్టర్‌ మోతికి వెంకట శివ సత్యనారాయణ వరప్రసాద్‌ నివాసాల్లో అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) బుధవారం సోదాలు నిర్వహించింది. ఈ వివరాలను ఏసీబీ ప్రధాన కార్యాలయం మీడియాకు విడుదల చేసింది. 1989 జనవరి 11న వరప్రసాద్‌ డ్రగ్‌ ఇన్‌స్పెక్టర్‌గా విధుల్లో చేరారు. 2011న అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా, 2018న డిప్యూటీ డైరెక్టర్‌గా పదోన్నతి పొందారు. ఆయన ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారని ఫిర్యాదు రావడంతో ఏసీబీ బుధవారం ఏకకాలంలో గుంటూరు, విజయవాడ సహా నాలుగు చోట్ల దాడులు నిర్వహించింది.

* దక్షిణ కొరియాకు చెందిన కార్ల తయారీ దిగ్గజం హ్యూందాయ్‌ దేశీయ మార్కెట్లోకి సరికొత్త ఐ20ను విడుదల చేసింది. దీని ఎక్స్‌షోరూం ప్రారంభ ధర రూ.6.80లక్షలుగా పేర్కొంది. టాప్‌ మోడల్‌ ధర రూ.11.18లక్షలు. గత మోడల్‌తో పోలిస్తే ఇది మరింత పెద్దదిగా కనిపిస్తుంది. దీని వీల్‌బేస్‌ను కూడా పెంచారు. ఈ కారు పెట్రోల్‌, డీజిల్‌ వేరియంట్లలో లభిస్తుంది. ఈ కారు మాగ్న, స్పోర్ట్స్‌, ఆస్టా, ఆస్టా ఆప్షనల్‌ రకాల్లో అందుబాటులో ఉంటుంది.

* దుబ్బాక ఉపఎన్నిక పూర్తయ్యాక కూడా భాజపా కార్యకర్తలను సీఎం కేసీఆర్‌ ఇబ్బందులు పెడుతున్నారని.. ఈ విషయంలో కేసీఆర్ తన వైఖరి మార్చుకోవాలని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ అన్నారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. సిద్దిపేటలో భాజపా కార్యకర్తలను అరెస్టు చేస్తూ వారిని ఆందోళనకు గురి చెయ్యడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పారు. అక్రమంగా అరెస్టు చేసిన కార్యకర్తలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. దుబ్బాకలో ఓటమి తప్పదనే భయంతో భాజపా శ్రేణులను ఇబ్బందులు పెడుతున్న కేసీఆర్‌ ప్రభుత్వానికి తిప్పలు తప్పవని హెచ్చరించారు. దుబ్బాక సీటు తర్వాత తన సీటుకు ఎసరోస్తుందనే భయంతోనే కేసీఆర్‌ ఇలా చేస్తున్నారని మండిపడ్డారు. ప్రజలు తిరగబడే రోజులు దగ్గరే ఉన్నాయని.. ఆ పరిస్థితి కేసీఆర్‌ ప్రభుత్వం కొనితెచ్చుకోవద్దని బండి సంజయ్‌ హితవు పలికారు.