NRI-NRT

పెన్సిల్వేణియా జార్జియాలో బైడెన్ ఆధిక్యం

పెన్సిల్వేణియా జార్జియాలో బైడెన్ ఆధిక్యం

అమెరికా అధ్యక్ష ఎన్నికలు ముగిసి మూడు రోజులు గడిచింది. అయినా అధ్యక్ష పీఠం ఎక్కేది ఎవరో ఇంకా తేలట్లేదు. చాలా రాష్ట్రాల్లో ఫలితం వచ్చేసినా.. జార్జియా, పెన్సిల్వేనియా, నార్త్‌ కరోలినా, అలస్కా, నెవాడాల్లో మాత్రం ఇంకా లెక్కింపు కొనసాగుతోంది. ఇవి తేలితే గానీ తదుపరి అధ్యక్షుడు ఎవరనేదానిపై స్పష్టత రాదు. అయితే ఈ ఫలితాలు ఇప్పట్లో వచ్చేలా కన్పించట్లేదు. నార్త్‌ కరోలినా, నెవాడాలో ఇంకా బ్యాలెట్‌ ఓట్లను స్వీకరిస్తుండగా.. అలస్కాలో ఇంతవరకూ ఎర్లీ ఓటింగ్‌ లెక్కింపు ప్రారంభించలేదు. ఈ సారి ఎన్నికల్లో పోస్టల్‌ బ్యాలెట్స్‌ భారీగా పోలవడమే ఆలస్యానికి కారణమైంది. గత ఎన్నికల్లో పోస్టల్‌ బ్యాలెట్లు మొత్తం పోలైన ఓట్లలో 34శాతమే ఉన్నాయి. దీంతో అప్పటి ఎన్నికల్లో ట్రంప్‌ గెలుపు బుధవారం(ఎన్నికలు జరిగిన మరుసటి రోజుకు) నాటికి తేలింది. అయితే కొవిడ్‌ కారణంగా చాలా మంది ఎర్లీ ఓటింగ్‌కు మొగ్గుచూపగా ఈ సారి పోస్టల్‌ బ్యాలెట్ల సంఖ్య 68శాతంగా ఉంది. దీంతో కౌంటింగ్‌ ఆలస్యమవుతోంది.

*** జార్జియా(16)..
ఈ రాష్ట్రంలో ఓట్ల లెక్కింపు దాదాపు పూర్తయినట్లే కన్పిస్తోంది. అయితే ఇక్కడ ఆధిపత్యం ట్రంప్‌, బైడెన్‌ మధ్య దోబూచులాడుతోంది. ఆది నుంచి ట్రంప్‌ ఆధిక్యంలో ఉండగా.. తాజాగా బైడెన్‌ దూసుకొచ్చారు. అయితే వీరి మధ్య తేడా కేవలం 900 ఓట్లు మాత్రమే ఉండటం గమనార్హం. దీంతో ఎప్పుడేం జరుగుతుందా అనే ఉత్కంఠ కొనసాగుతోంది. మరోవైపు జార్జియాలో బైడెన్‌ గెలిస్తే.. ట్రంప్‌ అధ్యక్ష ఆశలు వదులుకోవాల్సిందే. అయితే ట్రంప్‌ గెలిస్తే మాత్రం అధ్యక్ష ఫలితం మరింత ఉత్కంఠగా మారుతుంది.

*** నెవాడా(6)..
నెవాడాలో ప్రస్తుతం బైడెన్‌ ఆధిక్యంలో ఉన్నారు. అయితే ఇక్కడ ఇంకా రెండు లక్షలకు పైగా ఓట్లు లెక్కించాల్సి ఉంది. అంతేగాక, నవంబరు 10 వరకు మెయిల్‌ బ్యాలెట్లను స్వీకరించనున్నారు. దీంతో ఇక్కడి ఫలితం ఇప్పుడప్పుడే వచ్చేలా కన్పించట్లేదు. అమెరికా కాలమానం ప్రకారం.. శుక్రవారం మధ్యాహ్నానికి నెవాడాపై అప్‌డేట్‌ వచ్చే అవకాశాలున్నాయి.

*** నార్త్‌ కరోలినా(15)..
ఈ రాష్ట్రంలో దాదాపు 95శాతం ఓట్ల లెక్కింపు పూర్తయింది. ప్రస్తుతం ట్రంప్‌పై బైడెన్‌ అత్యల్ప ఆధిక్యంలో కొనసాగుతున్నారు. అయితే ఇక్కడ కూడా నవంబరు 12 వరకు మెయిల్‌ బ్యాలెట్లను స్వీకరించనున్నారు. దీంతో అప్పటిదాకా గెలుపు ఎవరిదనేది చెప్పడం కష్టమే.

*** పెన్సిల్వేనియా(20)..
ఈ రాష్ట్రంలో ట్రంప్‌ ఆధిపత్యం ప్రదర్శిస్తున్నారు. అయితే ఇక్కడ ఫిలడెల్ఫియా, పిట్స్‌బర్గ్‌లో ఇంకా లెక్కించాల్సిన బ్యాలెట్‌ ఓట్లు చాలానే ఉన్నాయి. దీంతో ఈ ఫలితం కూడా ఆలస్యమయ్యేలా కన్పిస్తోంది.

*** అలస్కా(3)..
ఈ ఎన్నికల్లో అలస్కా ఫలితమే చివరగా వచ్చేలా కన్పిస్తోంది. రిపబ్లికన్లకు పట్టున్న ఈ రాష్ట్రంలో ట్రంప్‌ ఆధిక్యంలో కొనసాగుతున్నారు. అయితే ఇక్కడ ఇంతవరకూ అక్టోబరు 29 తర్వాత వేసిన ఎర్లీ ఓటింగ్‌ లెక్కింపును ప్రారంభించనే లేదు. ఈ లెక్కింపు పూర్తవడానికి మరో వారం రోజులు పట్టే అవకాశమున్నట్లు తెలుస్తోంది.

*** అరిజోనాపై గందరగోళం..
ఇక ఈ ఎన్నికల్లో మరో కీలక రాష్ట్రమైన అరిజోనా ఫలితంపై గందరగోళం తలెత్తింది. అమెరికాకు చెందిన వేర్వేరు మీడియా సంస్థలు విభిన్న ఆధిక్యాలను చూపిస్తున్నాయి. కొన్ని ఛానళ్లు అరిజోనా బైడెన్‌ సొంతమైనట్లు ప్రకటించాయి. దీంతో ఆయనకు వచ్చిన ఎలక్టోరల్‌ ఓట్ల సంఖ్య 264కు చేరింది. మరికొన్నింటిల్లో అరిజోనాలో ఇంకా బైడెన్‌ ఆధిక్యంలో ఉన్నట్లు కథనాలు వస్తున్నాయి. వీటిని పరిగణనలోకి తీసుకుంటే బైడెన్‌ ఓట్ల సంఖ్య 253గానే ఉంటుంది. ఈ నేపథ్యంలో జార్జియా ఫలితం కీలకంగా మారింది. ఏదేమైనా అమెరికా తదుపరి అధ్యక్షుడు ఎవరో తేలాలంటే మరికొద్ది రోజులు ఆగాల్సిందే.