DailyDose

దుబ్బాక ఫలితాలపై బెట్టింగ్ జోరు-తాజావార్తలు

Breaking News - Betting On High Rise On Dubbaka Result

* దుబ్బాక ఉప ఎన్నికల ఫలితాలపై జోరుగా బెట్టింగ్లు…దుబ్బాక ఉపఎన్నిక ఫలితాలు…బరిలో ఉన్న పార్టీలకే కాదు…పందేలువేస్తున్న బెట్టింగ్‌రాయుళ్లను టెన్షన్‌ పెడుతున్నాయి.ఆ ప్రాంతం ఈ ప్రాంతం అని లేకుండా అన్ని ప్రాంతాలలో దుబ్బాక ఫలితాలపై జోరుగా పందేలు జరుగుతున్నాయి. ప్రచారం, పోలింగ్‌‌, పోలింగ్‌ తర్వాత పరిస్థితులను అంచనా వేస్తూ బెట్టింగ్‌లు మారుస్తున్నారు. దుబ్బాక ఫలితంపై పందేల హీట్‌!పందాలు కాసే వారి చేతులు ఓ పట్టాన ఊరుకోవు. అది ఎన్నికలైనా….మరొకటైనా….ఏదో ఒక పందెం కాయాలని చూస్తారు బెట్టింగ్‌ రాయుళ్లు.ఇలాంటి వారికి తెలుగు రాష్ట్రాల్లో  కొన్ని ప్రాంతాలు చాలా ప్రసిద్ధి.ఇప్పుడు వారి దృష్టి అంతా దుబ్బాకపై పడింది. ఎన్నడూ లేని విధంగా ఉపఎన్నిక పోరు సాగడం…పోలింగ్‌కు వారం ముందు నుంచీ జరిగిన పరిణామాలు రాజకీయ వాతావరణాన్ని హీటెక్కించడంతో పందాల హీట్‌ పెరిగింది. 

* మూడోదశ ఎన్నికలకు బిహార్‌ సిద్ధమైంది. తుది దశలో భాగంగా శనివారం నాడు రాష్ట్రంలోని 78 అసెంబ్లీ స్థానాల్లో ఎన్నికలు జరుగనున్నాయి. 2.34కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఈ దశలో మొత్తం 1204 మంది అభ్యర్థులు పోటీలో ఉండగా, అసెంబ్లీ స్పీకర్‌తో పాటు మరో 12మంది మంత్రులు కూడా మరోసారి తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.

* అమెరికా అధ్యక్ష ఎన్నికలు.. ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు ఎక్కడ చూసినా దీని గురించే చర్చ. ఈ ఎన్నికల్లో పలువురు పోలింగ్‌ కేంద్రానికి వచ్చి ఓటు వేయగా.. మరికొంతమంది మెయిల్‌ ఇన్‌ బ్యాలెట్‌ పద్ధతిని ఎంచుకున్నారు. అయితే ఈ ఎన్నికల్లో అంతరిక్షం నుంచి కూడా ఓటు వేయొచ్చనే విషయం మీకు తెలుసా?. అవును.. పెరిగిన సాంకేతికత నేపథ్యంలో అంతరిక్షం నుంచి కూడా ఓటు వేసేందుకు ఇక్కడి చట్టాలు అనుమతిస్తున్నాయి. నాసా వ్యోమగామి కేట్‌ రూబిన్స్‌ తన ఓటును అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్‌ఎస్‌) పోలింగ్‌ బూత్‌ నుంచి ఉపయోగించుకున్నారు. భార రహిత స్థితిలో ఆమె ఓటు వేయడం ఇది రెండోసారి కావడం విశేషం. 2016లో ఆమె ఐఎస్‌ఎస్‌లో ఉన్నప్పుడు కూడా ఇలాగే తన ఓటు హక్కు వినియోగించుకున్నారు.

* దీపావళి వేళ బాణసంచాపై నిషేధం విధించే రాష్ట్రాల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఇప్పటికే దిల్లీ సహా పలు రాష్ట్రాలు నిషేధం ప్రకటించగా.. తాజాగా ఈ జాబితాలో కర్ణాటక చేరింది. కరోనా విజృంభణ వేళ రాష్ట్రంలో బాణసంచాపై నిషేధం విధిస్తున్నట్టు ముఖ్యమంత్రి యడియూరప్ప శుక్రవారం ప్రకటించారు. బాణసంచా కాల్చడంతో వాయు కాలుష్యం మరింతగా పెరిగి ఆరోగ్యంపై పెను ప్రభావం చూపుతుందన్న నిపుణుల సూచనల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. ఈ దీపావళికి బాణసంచాపై నిషేధం విధించే అంశంపై అధికారులతో చర్చించామని, ఈ నిర్ణయానికి సంబంధించిన ఉత్తర్వులను జారీ చేస్తున్నట్టు వెల్లడించారు.

* భారత్‌-చైనా మధ్య లద్ధాక్‌లో ఉద్రిక్త పరిస్థితిని తగ్గించేందుకు నేడు 8వ విడత కోర్‌ కమాండ్‌ స్థాయి చర్చలు మొదలయ్యాయి. వీటిని చుషూల్‌-మాల్డో పోస్టులో ఉదయం 9.30 గంటలకు మొదలు పెట్టారు. ఇటీవలే ‘14వ కోర్‌’ కమాండర్‌ అధికారిక బాధ్యతలు చేపట్టిన చేపట్టిన లెఫ్టినెంట్‌ జనరల్‌ పీజీకే మేనన్‌ భారత్‌ తరపున ఈ చర్చల్లో పాల్గొన్నారు. ఆయన బాధ్యతలు స్వీకరించడానికి ముందు జరిగిన రెండు విడతల చర్చల్లో కూడా పాల్గొన్నారు. భారత్‌ ఇక్కడ ఉద్రిక్తతలు తగ్గించుకొని.. ఇరు వర్గాలు పూర్తి స్థాయిలో బలగాల ఉపసంహరణ డిమాండ్‌కు పూర్తిగా కట్టుబడి ఉంది. మే ముందు నాటి పరిస్థితులు నెలకొనాలని భారత్‌ కోరుతోంది. ఏకపక్షంగా చైనా చేసే డిమాండ్లకు తలొగ్గకూడదని నిర్ణయించుకొంది. ఇది ఇరుపక్షాలకు ప్రయోజనకరంగా ఉండాలని భారత్‌ భావిస్తోంది.

* కరోనా వైరస్‌కు పేద, ధనిక వంటి తేడాలు ఉండవని, అది ఎవరికైనా సోకే అవకాశం ఉందని దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆందోళన వ్యక్తం చేశారు. అందుకే అందరు తప్పకుండా మాస్కులు ధరించాలని అభ్యర్థించారు. శుక్రవారం రోడ్ రీడెవలప్‌మెంట్ ప్రాజెక్టుకు సంబంధించి జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ..ప్రజలకు సూచనలు చేశారు.

* ఎన్నికల ఫలితాల హడావుడిలో ఉన్న అగ్రరాజ్యం అమెరికాను కొవిడ్‌ మహమ్మారి మళ్లీ వణికిస్తోంది. గత కొన్ని రోజులుగా అక్కడ రికార్డు స్థాయిలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. గురువారం ఈ సంఖ్య ఏకంగా లక్ష దాటడం భయాందోళనకు గురిచేస్తోంది. ఓ వైపు అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలపై ఉత్కంఠ కొనసాగుతుంటే.. మరోవైపు కరోనా పంజా విసురుతుండటం ఆందోళన కలిగిస్తోంది.

* ‘ఫేక్‌ మీడియా’.. ఇది ట్రంప్‌ నోట దాదాపు ప్రతి ప్రెస్‌మీట్‌లో వినిపించే మాట. ఆయన అమెరికాలో ఫాక్స్‌న్యూస్‌, న్యూయార్క్‌ పోస్టులను తప్పితే మిగిలిన ప్రధాన మీడియా సంస్థలకు వ్యతిరేకంగా ఉంటారు. కానీ, ఈ సారి అధ్యక్ష ఎన్నికల ఫలితాల ప్రకటనలో ‘ఫాక్స్‌న్యూస్‌’ ట్రంప్‌ అభిమానులకు కోపం తెప్పించింది. వారంతా నిన్నరాత్రి అరిజోనాలోని ఫోనిక్స్‌ కౌంటింగ్‌ సెంటర్‌ వద్దకు చేరి ఫాక్స్‌ న్యూస్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అరిజోనా బైడెన్‌కు దక్కినట్లు ప్రకటించడంపై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. కానీ, ఫాక్స్‌ న్యూస్‌ మాత్రం తన నిర్ణయానికి కట్టుబడి ఉంది. దీంతో ఆ వార్తాసంస్థపై ఫిర్యాదులు వెల్లువెత్తాయి. అమెరికా ఎన్నికల ఫలితాలను ప్రకటించే క్రమంలో దాదాపు 11 ఎలక్టోరల్‌ ఓట్ల విషయంలో గందరగోళం చెలరేగింది. అమెరికాకు చెందిన వేర్వేరు ఛానల్స్‌ వేర్వేరు ఆధిక్యాలను చూపిస్తున్నాయి. అక్కడ అధికారం అందించే మేజిక్‌ ఫిగర్‌ 270. ఇప్పటికే అసోసియేటెడ్‌ ప్రెస్‌, ఫాక్స్‌ న్యూస్‌ వంటి ఛానల్స్‌ బైడెన్‌ 264 ఓట్లను సాధించినట్లు చూపిస్తున్నాయి. కానీ, న్యూయార్క్‌ టైమ్స్‌, సీఎన్‌ఎన్‌, వాషింగ్టన్‌ పోస్టు వంటి మీడియా సంస్థలు మాత్రం 253 మాత్రమే చూపిస్తున్నాయి. దీనికో కారణం ఉంది. అమెరికన్‌ మీడియా సంస్థల్లో ‘డెసిషన్‌ డెస్క్‌’ అని ఒక వ్యవస్థ ఉంది. వారు కౌంటింగ్‌ ట్రెండ్‌, గణాంకాల తీరును పరిశీలించి.. విజయానికి తగిన అవకాశాలు ఉన్నచోట్ల తమ అంచనాలను ప్రకటిస్తారు. ఆయా మీడియా సంస్థలు వాటి అంచనాలను అనుసరిస్తుంటాయి. అలానే అసోసియేటెడ్‌ ప్రెస్‌ సంస్థ ఈ సారి అరిజోనా బైడెన్‌కు అనుకూలంగా ఉన్నట్లు పేర్కొంది. దీంతో దానిని అనుసరించే సంస్థలు 264గా పేర్కొంటున్నాయి. ఫాక్స్‌ న్యూస్‌ డెసిషన్‌ డెస్క్‌ కూడా బైడెన్‌కు 264 ఓట్లు వచ్చినట్లు ప్రకటించింది. ఇది ట్రంప్‌ వర్గం ఆగ్రహానికి కారణం అయింది. ఈ డెస్క్‌లోని ఆర్నోన్‌ మిష్కిన్‌ అనే డెమొక్రాటిక్‌ మద్దతుదారు కారణంగానే ఇలా జరిగిందని ట్రంప్‌ మద్దతుదారులు ఆరోపిస్తున్నారు. కానీ, ఫాక్స్‌ న్యూస్‌ తన నిర్ణయం నుంచి వెనక్కి తగ్గలేదు.

* కరోనా వైరస్‌ను కట్టడి చేయడంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు సాధ్యం కానిది, ప్రధాని నరేంద్ర మోదీ చేయగలిగారని భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అన్నారు. బిహార్‌లో గురువారం చివరి దశ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా దర్భంగాలో ఓ ర్యాలీలో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

* న్యూజిలాండ్ ప్రధానిగా జెసిండా ఆర్డెర్న్‌ రెండోసారి ప్రమాణస్వీకారం చేశారు. ఈసారి పూర్తి మెజారిటీ సాధించిన లేబర్‌ పార్టీ నేతగా ప్రధాని పదవిని అధిరోహించారు. వెల్లింగ్టన్‌ అధికార గృహంలో జరిగిన కార్యక్రమంలో జెసిండాతోపాటు ఇతర మంత్రులు ప్రమాణస్వీకారం చేశారు. ‘విశిష్ట ప్రతిభ, అపారమైన అనుభవం కలగలిసిన నేతలతో కలిసి పనిచేసేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. దేశం ఎలాంటి సంక్షభంలోకి వెళ్లినా నిబద్ధతలో కలిసి పనిచేసేందుకు సన్నద్ధంగా ఉంటాం’ అని ఈ సందర్భంగా న్యూజిలాండ్‌ ప్రధాని పేర్కొన్నారు.

* రాష్ట్రంలో వరద సహాయక చర్యల్లో భాగంగా బాధితులకు అందజేసిన సాయంలో పెద్ద కుంభకోణం జరిగిందని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆరోపించారు. ఈ మేరకు గవర్నర్‌ తమిళిసై సౌందర్‌రాజన్‌కు ఆయన ఫిర్యాదు చేశారు. గాంధీభవన్‌ నుంచి గవర్నర్‌తో ఫోన్‌లో మాట్లాడారు. వరదసాయంలో జరిగిన కుంభకోణంపై సమగ్ర విచారణ జరిపించాలని విజ్ఞప్తి చేశారు. వరద సహాయక చర్యల్లో తెరాస నేతలు, కార్యకర్తలు రూ.కోట్లు దోచుకున్నారని ఆరోపించారు. కోట్లాది రూపాయల ప్రజాధనం దుర్వినియోగమైందని.. బాధిత కుటుంబాలకు సహాయన్ని నగదు రూపంలో కాకుండా చెక్కుల రూపంలో అందించాలని డిమాండ్‌ చేశారు. బాధితులకు ఇచ్చే వరద సాయం రూ.10వేల నుంచి రూ.50వేలకు పెంచాలని కోరారు. నిజమైన బాధితులకు వరద సాయం అందలేదన్నారు. పార్టీశ్రేణులను ఆర్థికంగా బలోపేతం చేసి జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు తెరాస ప్రభుత్వం నగదు పంపిణీ చేసిందని ఉత్తమ్‌ ఆరోపించారు. వరదల్లో కొంతమంది మృతిచెందడంతో పాటు వేలమంది నిరాశ్రయులైనా సీఎం కేసీఆర్ కనీసం పరామర్శించకపోవడం దారుణమని ఆయన విమర్శించారు.

* గుంటూరు నగరంలోని మురుగునీటి వ్యవస్థ పనులు నిలిపివేశారని తెదేపా ఎంపీ గల్లా జయదేవ్‌ ఆరోపించారు. ఈ మేరకు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి హర్‌దీప్‌ సింగ్‌ పూరీకి ఆయన లేఖ రాశారు. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్నప్పుడు గుంటూరుకు రూ.500కోట్లు కేటాయించారని.. దాంతో పాటు అప్పటి తెదేపా ప్రభుత్వం కూడా నిధులు విడుదల చేసిందని చెప్పారు. 2019 జులై నాటికి షాపూర్‌జీ పల్లోంజీ సంస్థ 50 శాతం పనులు పూర్తి చేసిందని లేఖలో వివరించారు. వైకాపా అధికారంలోకి వచ్చాక ఆ పనులు నిలిపివేశారని.. ఈనెల 23 జిల్లా కలెక్టర్‌తో జరిగిన సమావేశంలో ఈ విషయం పూర్తిగా తెలిసిందని జయదేవ్‌ పేర్కొన్నారు. పనులు చేపట్టిన నిర్మాణ సంస్థ కూడా గుంటూరు నుంచి వెళ్లిపోయినట్లు ఆయన చెప్పారు. కేంద్రం నిధులతో చేపడుతున్న ప్రాజెక్టును నిలిపివేయడంపై వెంటనే జోక్యం చేసుకోవాలని లేఖలో కేంద్రమంత్రిని జయదేవ్‌ కోరారు.

* చంద్రబాబు హయాంలో కట్టించారనే అక్కసుతోనే 2 లక్షల 62 వేల మందికి ఇళ్లు అప్పగించకుండా ముఖ్యమంత్రి జగన్‌ వేధిస్తున్నారని ఏపీ తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ధ్వజమెత్తారు. రూ. 1500 కోట్ల రూపాయల బకాయిలు సైతం నిలిపివేశారని మండిపడ్డారు. 17 నెలల పాలనలో పేదలకు ఒక్క ఇల్లు కూడా ఎందుకు నిర్మించలేకపోయారని ప్రశ్నించారు. ఇళ్ల స్థలాల పంపిణీపై వైకాపా జడ్పీటీసీలు, ఎంపీపీలే కేసులు వేశారనే దానికి ఆధారాలు ఉన్నాయని స్పష్టం చేశారు. విశాఖలో మీడియాతో మాట్లాడుతూ.. పాదయాత్రలో అన్నీ చేస్తానని చెప్పిన ముఖ్యమంత్రి అధికారంలోకి వచ్చాక హామీలను గాలికొదిలేశారని అచ్చెన్న విమర్శించారు. ఏడాదికి 5 లక్షల ఇళ్లు నిర్మించి ఇస్తామని వైకాపా మేనిఫెస్టోలో చెప్పారని, అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క హామీని కూడా జగన్‌ నెరవేర్చలేదని ఆరోపించారు. తెదేపా హయాంలో రాష్ట్రంలోని అనేక పట్టణాల్లో గేటెడ్‌ కమ్యూనిటీలో ఇళ్లు మంజూరు చేశామన్నారు. రూ.25 వేలుగా ఉన్న యూనిట్‌ విలువను రూ.50 వేలకు పెంచామన్నారు. అంతకు ముందుకు కాంగ్రెస్‌ ప్రభుత్వంలో పెండింగ్‌లో ఉన్న 4లక్షల ఇళ్లను పూర్తి చేశామని గుర్తు చేశారు.

* వచ్చే ఏడాది జరగబోయే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ పోటీ చేస్తుందని ప్రముఖ సినీనటుడు, మక్కల్‌ నీది మయ్యం (ఎంఎన్‌ఎం) అధినేత కమల్‌ హాసన్‌ వెల్లడించారు. ఈ ఎన్నికల్లో సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ మద్దతు కోరుతున్నట్టు తెలిపారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. రాజకీయ పార్టీ ఏర్పాటు చేసేందుకు కసరత్తు జరుపుతున్న రజనీకాంత్‌తో రాజకీయాలపై చర్చిస్తున్నట్టు కమల్‌ పేర్కొన్నారు. రజనీకాంత్‌ తన రాజకీయ వైఖరిపై నిర్ణయం తీసుకోవాల్సి ఉందని, అంతకంటే ముందు ఆయన ఆరోగ్యం చాలా ముఖ్యమన్నారు. తమ ఎంఎన్‌ఎం పార్టీ నిందారోపణలతో కూడిన ప్రతీకార రాజకీయాలు చేయబోదని, మార్గదర్శక రాజకీయాలకు కట్టుబడుతుందని తెలిపారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ కొనసాగుతోందన్నారు.