Business

పెరిగిన పసిడి ధరలు-వాణిజ్యం

పెరిగిన పసిడి ధరలు-వాణిజ్యం

* దేశీయ ఆటోమొబైల్‌ రంగ దిగ్గజం టాటా మోటార్స్ తన ఫ్లాగ్‌ షిప్‌ కార్‌ అయిన హారియర్‌లో సరికొత్త ఎడిషన్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. కామో ఎడిషిన్‌గా వ్యవహరిస్తున్న ఈ కారు ప్రారంభ ధర దిల్లీ ఎక్స్‌షోరూమ్‌లో రూ.16.50 లక్షలు. దీనిలో ఎక్స్‌టీ వేరియంట్‌ వరకు మాన్యూవల్‌ ట్రాన్స్‌మిషిన్‌తో లభిస్తాయి. ఇక జెడ్‌టీ వేరియంట్‌ నుంచి ఆటోమేటిక్‌ ట్రాన్స్‌ మిషన్‌ అందుబాటులో ఉంటుంది. ఈ హారియర్‌ స్టాండర్డ్‌ వెర్షన్‌కు మార్పులు చేసి ఈ కారును తీసుకొచ్చారు.

* ఎల్పీజీ సిలిండర్‌ బుకింగ్‌ను ఇండేన్‌ గ్యాస్‌ సులభతరం చేసింది. ఇప్పటి వరకు ఫోన్‌, ఎస్సెమ్మెస్‌, యాప్‌ లేదా వెబ్‌సైట్‌లో మాత్రమే బుకింగ్‌ చేసుకునే వెసులుబాటు ఉండగా.. ఇకపై వాట్సాప్‌ ద్వారా కూడా బుకింగ్‌ చేసుకునే వీలు కల్పిస్తోంది. ఇందుకోసం ప్రత్యేకంగా 75888 88824 నంబర్‌ను కేటాయించింది. ఈ నంబర్‌ను మీ ఫోన్‌ కాంటాక్ట్‌లో సేవ్‌ చేసుకున్నాక REFILL అని మెసేజ్‌ పంపించాల్సి ఉంటుంది. లేదంటే 77189 55555 నంబర్‌కు ఫోన్‌ చేసి కూడా ఐచ్ఛికాలను ఎంచుకుని రీఫిల్‌ను బుక్‌ చేయొచ్చు.

* దేశీయంగా బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి. దేశ రాజధానిలో పది గ్రాముల పసిడి ధర రూ.791 పెరిగి రూ.51,717కు చేరింది. నిన్నటి ట్రేడింగ్‌లో రూ.50,926 వద్ద ముగిసింది. ఇక వెండి సైతం దిల్లీలో కేజీ రూ.2,147 పెరిగింది. దీంతో కేజీ వెండి రూ.64,578కి చేరింది. అంతర్జాతీయంగా బంగారం ధర పెరగడమే పసిడి ధరలు వరుసగా మూడో రోజూ పెరగడానికి కారణమని మార్కెట్‌ నిపుణులు చెబుతున్నారు.

* దేశీయ మార్కెట్లు మరోసారి భారీ లాభాల్లో ముగిశాయి. అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాల్లో డెమొక్రాటిక్‌ అభ్యర్థి జో బైడెన్‌ గెలుపుపై ధీమాతో అమెరికన్‌ మార్కెట్లు సహా, అంతర్జాతీయ మార్కెట్లు రాణించాయి. దీంతో మన మార్కెట్లు కూడా దూసుకెళ్లాయి. రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ రిటైల్‌ విభాగంలో 2.04 శాతం వాటాను రూ.9,555 కోట్లకు సౌదీ అరేబియాకు చెందిన పబ్లిక్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ఫండ్‌(పీఐఎఫ్‌)కు విక్రయించడంతో ఆ కంపెనీ షేర్లు 3 శాతం మేర దూసుకెళ్లాయి. దీనికి తోడు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, హెచ్‌డీఎఫ్‌సీ, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, బజాజ్‌ ఫైనాన్స్‌ వంటి ఫైనాన్షియల్‌ షేర్లు ప్రధానంగా రాణించడం కలిసొచ్చింది. దీంతో మన మార్కెట్లు వరుసగా ఐదో రోజూ లాభాల్లో ముగిశాయి. నిఫ్టీ 12,200 పాయింట్ల ఎగువన ముగిసింది.