Health

ప్రతిరోజు తప్పకుండా ఎండలో తిరగాలి

ప్రతిరోజు తప్పకుండా ఎండలో తిరగాలి

ఈ మధ్య చాలా సమస్యలకి డి-విటమిన్‌ లోపమే కారణం అంటున్నారు వైద్యులు. ఆ జాబితాలోకి మరో సమస్యనీ చేర్చారు కెనడా పరిశోధకులు. సాధారణంగా ఎక్కువ సమయం ఎండలో ఉండేవాళ్లకి డి-విటమిన్‌ లోపం రాదు. పైగా అలా గడిపే సమయంలో- అల్ట్రా వయొలెట్‌ బి లైట్‌ అనేది పొట్టలో మంచి బ్యాక్టీరియా పెరుగుదలకీ కారణమవుతుంది అంటున్నారు. ఇప్పటివరకూ రోగనిరోధకశక్తి లోపాలతో తలెత్తే మల్టిపుల్‌ స్ల్కెరోసిస్‌, ఇన్‌ఫ్లమేషన్‌ వంటి వాటికి జన్యులోపాలు, పర్యావరణమే కారణం అనుకుంటున్నారు. కానీ పొట్టలో ఉండే ఆరోగ్యకరమైన బ్యాక్టీరియా, డి-విటమిన్‌ల శాతం కూడా ఆయా వ్యాధుల్ని ప్రభావితం చేస్తుందని తెలుసుకున్నారు. ఇందుకోసం వీళ్లు కొందరు మహిళల్ని ఎంపికచేసి వాళ్లను వారం రోజులపాటు క్రమం తప్పకుండా కాసేపు యూవీ బి కాంతికి గురయ్యేలా చేశారట. దీనికి ముందూ తరవాతా కూడా వాళ్ల మలాన్ని పరీక్షించి పొట్టలోని బ్యాక్టీరియా రకాలనీ విటమిన్‌- డి శాతాన్నీ పరిశీలించగా- కాంతికి గురిచేసిన తరవాత వాళ్లలో డి-విటమిన్‌తోబాటు బ్యాక్టీరియా కూడా పెరిగినట్లు గుర్తించారు. కాబట్టి, విటమిన్‌-డికీ పొట్టలోని బ్యాక్టీరియాకీ సంబంధం ఉందని తేల్చి చెబుతున్నారు.