Politics

తెరాస నుండి భాజపాలోకి తీగల?

తెరాస నుండి భాజపాలోకి తీగల?

గ్రేటర్ ఎన్నికలకు ముందు టీఆర్ఎస్‌కు ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి షాకివ్వనున్నారా అంటే అవుననే వార్తలు వస్తున్నాయి. పార్టీ మారేందుకు సిద్ధమవుతున్నారని కథనాలు వినపడుతున్నాయి. కారు దిగి కమలం గూటికి చేరుతున్నట్టు సమాచారం. ఈ మేరకు బీజేపీ నేతలతో ఆయన చర్చలు జరుపుతున్నారు. గత కొంతకాలంగా టీఆర్‌ఎస్‌కు దూరంగా ఉంటూ వస్తున్నారు తీగల కృష్ణారెడ్డి. మరోవైపు జీహెచ్ఎంసీ ఎన్నికల్లో సత్తా చాటేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్న బీజేపీ.. టీఆర్‌ఎస్‌ అసంతృప్తులకు గాలం వేస్తోంది. ఈ నేపథ్యంలో తీగల కృష్ణారెడ్డితో బీజేపీ సీనియర్ నేతలు చర్చలు జరిపినట్టు తెలుస్తోంది. ఇదిలా ఉంటే తీగలతో మంత్రి మల్లారెడ్డి చర్చలు జరుపుతున్నారు. 2014 ఎన్నికల్లో మహేశ్వరం నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా గెలిచిన తీగల కృష్ణారెడ్డి.. కొద్దిరోజులకే గులాబీ కండువా కప్పుకున్నారు. అయితే 2018 అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి పోటీ చేసిన ఆయన ఓటమి పాలయ్యారు. ఈ స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి సబితా ఇంద్రారెడ్డి గెలుపొందారు. అయితే ఆమె సైతం కారెక్కడంతో.. తీగలకు ఇబ్బందికర పరిస్థితులు ఎదురయ్యాయి. అయితే ఆయనకు ఎమ్మెల్సీ సీటు గ్యారంటీ అన్న భరోసా పార్టీ అగ్రనేతల నుంచి రావడంతో కాస్త శాంతించారు. కానీ ఇప్పటి వరకు ఆయనకు ఎలాంటి పదవీ దక్కకపోవడంతో పార్టీ మారడానికి సిద్ధమయ్యారని తెలుస్తోంది.