NRI-NRT

మనం 300 కొట్టేస్తున్నాం

మనం 300 కొట్టేస్తున్నాం

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో స్పష్టమైన మెజార్టీతో గెలవబోతున్నామని డెమొక్రాటిక్‌ అభ్యర్థి జో బైడెన్‌ ఆనందం వ్యక్తం చేశారు. ట్రంప్‌పై 40 లక్షల ఓట్ల తేడాతో గెలుస్తున్నామని చెప్పారు. అగ్రరాజ్య అధ్యక్ష పీఠం ఎవరిదన్న దానిపై ఇంకా స్పష్టత రానప్పటికీ బైడెన్‌ అత్యధిక ఎలక్టోరల్‌ ఓట్లతో అధికారానికి అవసరమైన మ్యాజిక్‌ ఫిగర్‌కు అత్యంత చేరువలో నిలిచారు. కీలక రాష్ట్రమైన జార్జియా, నెవడాలోనూ డెమొక్రాటిక్‌ నేత ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఈ నేపథ్యంలో ఆయన ఎన్నికల ఫలితాలపై శుక్రవారం రాత్రి(అమెరికా కాలమానం ప్రకారం) జాతినుద్దేశించి మాట్లాడారు. ‘అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రాటిక్‌ పార్టీ గెలిచినట్లు ఇప్పుడే ప్రకటించట్లేదు. అయితే ఈ ఎన్నికల్లో స్పష్టమైన మెజార్టీతో గెలవబోతున్నామని తాజాగా వెలువడుతున్న ఫలితాలే చెబుతున్నాయి. 24 గంటల క్రితం వరకు జార్జియాలో వెనుకంజలో ఉన్న మేము ప్రస్తుతం ఆధిక్యంలో కొనసాగుతున్నాం. పెన్సిల్వేనియాలో కూడా ముందంజలో ఉన్నాం. 24ఏళ్ల తర్వాత అరిజోనాలో, 28ఏళ్ల తర్వాత జార్జియాలో గెలుస్తున్న తొలి డెమొక్రాట్స్‌ మేమే. నాలుగేళ్ల క్రితం రిపబ్లికన్ల చేతిలో ఓడిపోయిన చాలా రాష్ట్రాలు ఇప్పుడు నీలవర్ణంలోకి మారుతున్నాయి. ఈ ఎన్నికల్లో 7.4 కోట్ల ఓట్లతో విజయం సాధించబోతున్నాం. ట్రంప్‌పై 40లక్షల ఓట్లతో గెలుస్తున్నాం. 300కి పైగా ఎలక్టోరల్‌ ఓట్లు సాధించబోతున్నాం’ అని బైడెన్‌ గెలుపుపై ధీమాగా ఉన్నారు.