Agriculture

యాపిల్ చెక్కతో బార్బిక్యూ అదరహో!

యాపిల్ చెక్కతో బార్బిక్యూ అదరహో!

ఎ ఫర్‌ ‘యాపిల్‌’ అంటూ మీరు మొదట నాతోనే పాఠాలు నేర్చుకోవడం మొదలుపెడతారు… నా పండ్లు తింటే డాక్టర్‌ అవసరమే ఉండదంటుంటారు… అయినా ఆ పండ్లనిచ్చే నా గురించి మాత్రం మీకు తెలీదు… ఇంకా నేనెవరన్నట్లు చూస్తారేం?నేనేనర్రా యాపిల్‌ చెట్టును… నా కబుర్లు చెప్పేందుకే ఇవాళ తీరిక చేసుకొచ్చా!
**పండంటి పిల్లలు!
గుండ్రంగా, ఎర్రగా ఉండే యాపిల్‌లు.. అదే నా పిల్లల్ని చూస్తుంటే నాకు భలేగా ముచ్చటగా ఉంటుంది! బుట్టెడు సంతానంతో నేను కళకళలాడుతూ ఉండాలంటే కచ్చితంగా చల్లటి ప్రాంతాల్లోనే ఉండాలి. అందుకే నేనెప్పుడూ శీతల ప్రాంతాల్లోనే పెరిగేస్తుంటా.
* మీ దేశంలో హిమాచల్‌ప్రదేశ్‌, కశ్మీర్‌… లాంటి ప్రాంతాల్లో మమ్మల్ని ఎక్కువగా సాగు చేస్తుంటారు. ఈ మధ్య మీ తెలుగు రాష్ట్రాల్లోనూ కాస్త చల్లగా ఉండే చోట్ల మమ్మల్ని పెంచేస్తున్నారు.
* చెబితే మీకు ఆశ్చర్యంగా అనిపిస్తుందేమోగానీ మాదీ గులాబీలదీ ఒకే జాతి. ఇంకా చెర్రీలదీనూ. అందుకే చెర్రీ పూలు, మా పూలు కాస్త ఒకేలా ఉంటాయి.
* మా చెట్లలో ప్రపంచవ్యాప్తంగా 7,500 రకాలున్నాయి. ఆ తేడాల్ని బట్టే మా పండ్లలో పచ్చ, పసుపు, ఎరుపు, కుంకుమరంగు… ఇలా రంగుల పండ్లు కాస్తుంటాయి.
* మాలో పొలాల్లో పెంచే రకాలవి ఆరు నుంచి 15 అడుగుల పొడవు పెరుగుతాయి. అడవుల్లోవి 40 అడుగుల వరకూ అయ్యేవీ ఉన్నాయి.
**మాతో చికెన్‌… యమ రుచి!
* మా చెక్క మంచి వాసనతో ఉంటుంది. ఆహార పదార్థాలకు మంచి రుచిని ఇస్తుంది. అందుకే బార్బిక్యూల్లో స్మోకీ చికెన్‌లాంటి
వంటకాలు చేసేప్పుడు మా చెక్కను ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. యాపిల్‌ ఉడ్‌ స్మోక్డ్‌ బేకన్‌ అమెరికాలో పేరొందిన వంటకం తెల్సా.
* నా పండ్లను ఎక్కువగా ఉత్పత్తి చేసే దేశం చైనా. ఆ తర్వాత స్థానాల్లో అమెరికా, టర్కీ, పోలాండ్‌, ఇటలీలున్నాయి.
* న్యూటన్‌ గురుత్వాకర్షణ శక్తిని కనుగొన్నది మా కిందేనని చెప్పుకోవడానికి నాకు కాస్త గర్వంగానే ఉంటుంది.
* ఆకురాలే కాలంలో ఏటా మేం పత్రాల్ని రాల్చేస్తాం. మళ్లీ వేసవిలో పూర్తిగా మొగ్గలు తొడిగేస్తాం. పువ్వులతో నిండిపోతాం.
* మా పువ్వుల రంగులు మాలో రకాల్ని బట్టి వేరు వేరుగా ఉంటాయి. తెలుపు, గులాబీ, పసుపు లాంటి ఆకర్షించే రంగుల్ని కలిగి ఉంటాయివి. వాటిలో కొన్ని మాత్రమే పండ్లుగా మారతాయి.
**పుట్టిందెక్కడంటే..!
* మా పుట్టిల్లు మధ్య ఆసియా అని చెబుతారు.
* మేం ఎక్కువగా ఉత్తరార్ధ గోళంలోనే ఉంటాం.
* మా విత్తనం, చెట్టు నుంచి కత్తిరించిన కొమ్మల నుంచి కొత్త మొక్కలు పుట్టుకొస్తాయి. అలా వచ్చిన మొక్కలు ఐదు నుంచి ఏడేళ్ల తర్వాత నుంచి కాయలు కాయడం మొదలెడతాయి.
* అంటార్కిటికాలో తప్ప అన్ని ఖండాల్లోనూ వాణిజ్య పంటగా మమ్మల్ని పండిస్తున్నారు.
* మా జీవితకాలం వందేళ్లు.
**ఉపయోగాలెన్నో!
* జ్ఞాపక శక్తి మెరుగవ్వడానికి నా పండు ఉపయోగపడుతుందట.
* నా పండులో ఎక్కువ స్థాయిలో బోరోన్‌ ఉంటుంది. మెదడులో ఎలక్ట్రిక్‌ యాక్టివిటీని పెంచడంలో ఇది దోహదపడుతుంది.
* చర్మం ఆరోగ్యంగా ఉండటానికి ఉపయోగపడే యాంటీ ఆక్సిడెంట్లు నా పండ్లలో ఎక్కువ. మైగ్రేన్‌ నుంచి ఉపశమనమూ లభిస్తుంది.
* ఇంకా నా చెక్క వంపులు తిరిగి ఉంటుంది. అలాంటి వంపుల ఫర్నిచర్‌ని తయారు చేసేందుకు నన్ను ఉపయోగిస్తుంటారు.