Politics

మీది బురద రాజకీయం

మీది బురద రాజకీయం

వరద సాయం పంపిణీని కొంతమంది రాజకీయం చేస్తున్నారని తెలంగాణ ఐటీ, పురపాలకశాఖ మంత్రి కేటీఆర్‌ మండిపడ్డారు. తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ… విజ్ఞతతో వ్యవహరించాల్సిన సమయంలో భాజపా, కాంగ్రెస్‌ నేతలు బురద రాజకీయం చేస్తున్నారని విమర్శించారు.

‘‘మేమంతా ప్రజల కష్టాలు పరిష్కరిస్తుంటే.. వారు దుబ్బాకలో ఓట్ల వేటలో ఉన్నారు. సైదాబాద్‌లో భాజపా కార్యకర్త ఇంటికెళ్లి అధికారులు సాయం అందించారు. సాయం అందుకున్న భాజపా కార్యకర్తలు కూడా ధర్నాలో పాల్గొంటున్నారు. హైదరాబాద్‌ వరదలపై ప్రధాని మోదీకి సీఎం కేసీఆర్‌ లేఖ రాసినా ఇప్పటి వరకు స్పందన లేదు. కర్ణాటక, గుజరాత్‌ విషయంలో మాత్రం ప్రధాని మోదీ తక్షణమే స్పందించారు. కర్ణాటక సీఎం లేఖ రాసిన నాలుగు రోజుల్లోనే రూ.670కోట్ల తక్షణ సాయం నిధులు విడుదల చేశారు. గుజరాత్‌కు రూ.500కోట్లు ఇచ్చారు.‌ ఈ విషయంలో హైదరాబాద్‌ చేసిన తప్పేంటి?’’ అని కేటీఆర్‌ నిలదీశారు. ‘‘ఇప్పటి వరకు 4.30లక్షల కుటుంబాలకు సాయం అందించాం. వారి వివరాలన్నీ మాదగ్గర ఉన్నాయి. ఆషామాషీగా వరద సాయం పంపిణీ చేయలేదు… బాధితులను గుర్తించిన తర్వాతే పకడ్బందీగా పరిహారం అందించాం. బేషజాలకు పోకుండా ఎవరు నష్టపోతే వారికి పరిహారం ఇచ్చి ప్రజలకు అండగా ఉన్నాం. తక్షణ సాయం కింద పెద్ద ఎత్తున సాయం చేసిన ప్రభుత్వం ఏదైనా ఉందా?’’ అని ఆయన ప్రశ్నించారు.

‘‘దుబ్బాక ఉపఎన్నికలో కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్ కూడా రాదు. నాలాలపై 28వేల ఆక్రమణలు ఉన్నాయని కిర్లోస్కర్ కమిటీ స్పష్టంగా తెలిపింది. 350 బస్తీ దవాఖానాలు, 11వేల టాయిలెట్స్ కట్టించాం. ఇవన్నీ చూసికూడా దిగజారుడు రాజకీయం చేస్తున్నారు. ఈ ప్రభుత్వం ప్రజలది. వరద బాధితులందరినీ ఆదుకుంటాం. అవసరమైతే మరో రూ.100కోట్లు కేటాయిస్తాం. ప్రజలెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. హైదరాబాద్ చుట్టుపక్కల 22 మున్సిపాలిటీల పరిధిలోని ప్రజలకు సాయం అందించాం. పంట సాయానికి సంబంధించిన నివేదిక రాగానే సాయంపై సీఎం కేసీఆర్‌ నిర్ణయం తీసుకుంటారు. దశాబ్దాలుగా చెరువులు, నాలాలు కబ్జాకు గురయ్యాయి. రాబోయే మూడేళ్ళలో ఆక్రమణలు పూర్తిగా తొలగిస్తాం’’ అని కేటీఆర్ తెలిపారు.