Editorials

బ్రహ్మపుత్రపై చైనా అక్రమ ప్రాజెక్టులు

బ్రహ్మపుత్రపై చైనా అక్రమ ప్రాజెక్టులు

ఒక వైపు లద్దాఖ్‌లోని చుషూల్‌ వద్ద చర్చలు జరుగుతుండగానే.. మరో వైపు అరుణాచల్‌ ప్రదేశ్‌ వద్ద సమస్యలు సృష్టించడానికి డ్రాగన్‌ యత్నాలు చేస్తోంది. టిబెట్‌ నుంచి భారత్‌లోకి ప్రవహించే బ్రహ్మపుత్ర నదిపై ఒక భారీ డ్యామ్‌కు చైనా ప్రణాళికలు సిద్ధం చేస్తోందని సౌత్‌చైనా మార్నింగ్‌ పోస్టు పత్రిక పేర్కొంది. కచ్చితంగా భవిష్యత్తులో భారత్‌కు సమస్యలు సృష్టించాలనే ఉద్దేశంతోనే ఈ పనిచేస్తోందని పేర్కొంది.

*** భారీ ప్రాజెక్టుకు సన్నాహాలు..
టిబెట్‌లో పుట్టిన బ్రహ్మపుత్ర (యార్లుంగ్‌) నది దాదాపు 2,900 కిలోమీటర్లు ప్రవహిస్తుంది. ఇది చైనా భూభాగాలను దాటుకొని 1625 కిలోమీటర్లు ప్రయాణించి భారత్‌, బంగ్లాదేశ్‌లలో కూడా ప్రజలకు మంచినీటి అవసరాలు తీరుస్తుంది. చైనాలోని జలవిద్యుత్తులో నాలుగో వంతు ఉత్పత్తి సామర్థ్యం టిబెట్‌కు ఉన్నట్లు అంచనా వేశారు. 2010 నుంచి ఈ నది మధ్యభాగాల్లో చైనా చాలా హైడ్రోపవర్‌ ప్రాజెక్టులను నిర్మించాలని ప్రణాళికలు సిద్ధం చేసింది. కాకపోతే అప్పట్లో రెండు పంచవర్ష ప్రణాళికల్లో ఈప్లాన్‌ ముందుకు కదల్లేదు. ఈ నది మధ్య భాగంలోని పరీవాహక ప్రాంతం ఎల్‌ఏసీకి అత్యంత సమీపంలో ఉంటుంది. ఇక్కడ కనీసం 11 హైడ్రో ఎలక్ట్రిక్‌ ప్రాజెక్టుల నిర్మాణానికి ప్రణాళిక సిద్ధం చేసింది. వీటిల్లో అతిపెద్దదైన జాంగ్మూ ప్రాజెక్టు 2015 నుంచి పనిచేస్తోంది. మిగిలిన ప్రాజెక్టులు వివిధ దశల్లో ఉన్నాయి. ఇప్పుడు నది దిగువ భాగాన అరుణాచల్‌ ప్రదేశ్‌కు అత్యంత సమీపంలో ఓ ప్రాజెక్టు నిర్మించాలని నిర్ణయించింది. దీని సైజు ప్రపంచంలోనే అతిపెద్దదైన త్రీగోర్జెస్‌ డ్యామ్‌ కంటే రెట్టింపు ఉంటుందని చైనా వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం ప్రాజెక్టు నిర్మిస్తే ఎంత లాభం ఉంటుందనే అంశాన్ని పరిశీలిస్తున్నారు. ఈ ప్రాజెక్టు నిర్మాణం పూర్తయితే దిగువ భాగాలకు నీటి లభ్యతపై ఆందోళనలు వెల్లువెత్తుతున్నాయి. అంతేకాదు వరదలు వచ్చిన సమయంలో ఒక్కసారిగా గేట్లు తెరిస్తే దిగువ ప్రాంతాలు నీటిలో కొట్టుకుపోయే ప్రమాదం ఉంది. ఇప్పటికే అరుణాచల్‌ ప్రదేశ్‌ను భారత్‌ భూభాగంగా గుర్తించమని చైనా చెబుతోంది.. తాజాగా భారీ ఆనకట్ట నిర్మించి దిగువ ప్రదేశాలపై పట్టు సాధించాలని చూస్తోంది. ఈ ఆనకట్టకు బంగ్లాదేశ్‌ కూడా బాధిత దేశంగా మారే ప్రమాదం ఉంది. భారత్‌కు ఈ కొత్త డ్యామ్‌పై ఎటువంటి సమాచారం అందజేయలేదు. ఇప్పటికే చైనా చేపడుతున్న నిర్మాణాలపై భారత్‌ పలుమార్లు ఆందోళన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. నదిజలాల వివరాలకు సంబంధించిన హైడ్రోలాజికల్‌ డేటాపై ఇరు దేశాలు గతంలో సమాచారం ఇచ్చిపుచ్చుకొనేవి. 2017లో డోక్లాం వివాదం తర్వాత నుంచి చైనా సమాచారం ఇవ్వడం మానేసింది.

*** రైల్వే లైన్ల నిర్మాణం వేగవంతం..
చైనాలోని సిచువాన్‌ ప్రావిన్స్‌ నుంచి టిబెట్‌లోని లిన్‌ఝీ వరకు రైల్వే లైన్ల నిర్మాణాన్ని వేగవంతం చేయనున్నారు. ఈ ప్రాజెక్టు పనులు చురుగ్గా జరగాలని శనివారం అధ్యక్షుడు షీజిన్‌పింగ్‌ అధికారులను ఆదేశించారు. ప్రాజెక్టును 47.8 బిలియన్‌ డాలర్లతో నిర్మిస్తున్నారు. ఈ రైల్వేలైను భారత్‌లోని అరుణాచల్‌ ప్రదేశ్ సరిహద్దులకు అత్యంత సమీపం నుంచి వెళుతుంది. ఈ ప్రాంతంలో చేపట్టిన రెండో అతిపెద్ద రైల్వే ప్రాజెక్టు ఇది. ఇది చైనాకు వ్యూహాత్మకంగా అత్యంత కీలకమైన సిచువాన్‌ రాష్ట్రంలోని చెంగ్డూ నుంచి టిబెట్‌లోని లాసాకు చేరే సమయాన్ని 48 గంటల నుంచి 13 గంటలకు తగ్గించేసింది. ఈ రైల్వే లైను నిర్మాణం చైనా బలగాలను, ఆయుధాలను వేగంగా తరలించడానికి ఉపయోగించే అవకాశం ఉంది.