NRI-NRT

కెనడాలో 27వ అంతస్థు నుండి పడి తెలంగాణా విద్యార్థి మృతి

Toronto - Hyderabad Vanasthalipuram Telangana Student Akhil Dead In Canada Toronto-Falls From 27th Floor

హైదరాబాద్‌లోని వనస్థలిపురానికి చెందిన ఓ యువకుడు కెనడాలోని టొరంటోలో బహుళ అంతస్తుల భవనంపై నుంచి ప్రమాదవశాత్తు జారిపడి మృతి చెందాడు. కుటుంబసభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. వనస్థలిపురం ఫేజ్‌-4లో ఉంటున్న శ్రీకాంత్‌ చిన్న కుమారుడు పాణ్యం అఖిల్‌(19) కెనడాలోని టొరంటోలో హోటల్‌ మేనేజ్‌మెంట్‌ కోర్సు చేస్తున్నాడు. మొదటి సెమిస్టర్‌ పూర్తి చేసుకుని గత మార్చి 20న నగరానికి వచ్చిన ఆయన.. తిరిగి గత నెల 5న కెనడాకు వెళ్లాడు. ఈ నెల 8న తెల్లవారుజామున తను ఉంటున్న భవనంలోని 27వ అంతస్తు బాల్కనీలో ఫోన్‌లో మాట్లాడుతుండగా ప్రమాదవశాత్తు కిందపడి మృతి చెందాడు.అతని స్నేహితుల ద్వారా విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. తమ కుమారుడి మృతదేహాన్ని నగరానికి రప్పించాలని మంత్రి కేటీఆర్‌ కార్యాలయానికి అఖిల్‌ తల్లిదండ్రులు ట్వీట్‌ చేశారు. దీంతో అఖిల్‌ మృతదేహాన్ని హైదరాబాద్‌కు తీసుకొచ్చేందుకు సాయం అందిస్తామని మంత్రి కేటీఆర్‌ తెలిపారు. ఈ మేరకు అక్కడి భారతీయ రాయబార కార్యాలయంతో కేటీఆర్‌ మాట్లాడారు.