Politics

దుబ్బాకలో తెరాస ఆధిక్యం-బీహార్‌లో పోటాపోటీగా ఆధిక్యం

దుబ్బాకలో తెరాస ఆధిక్యం-బీహార్‌లో పోటాపోటీగా ఆధిక్యం

దుబ్బాక ఉప ఎన్నిక కౌంటింగ్‌ మొదలైంది. సిద్దిపేట ఇందూరు ఇంజినీరింగ్‌ కళాశాలలో 23 రౌండ్లలో లెక్కింపు జరుగుతుంది. మధ్యాహ్నం ఒంటి గంటలోగా ఫలితాలు వస్తాయి. దుబ్బాక ఉప ఎన్నికకు సంబంధించి ఉదయం 8 గంటలకు పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లు లెక్కిస్తారు. ఆ తర్వాత 8.30 గంటలకు ఈవీఎంల ఓట్ల లెక్కింపు మొదలవుతుంది. దుబ్బాక ఉప ఎన్నిక కౌంటింగ్‌లో ఈవీఎం ఓట్ల లెక్కింపు జరుగుతోంది. మధ్యాహ్నం ఒంటి గంట కల్లా తుది ఫలితం వచ్చే అవకాశం ఉంది.

బిహార్‌ శాసనసభ ఎన్నికల కౌంటింగ్‌ జరుగుతోంది. తొలి ఫలితాల్లో అధికార ఎన్డీయే స్వల్ప ఆధిక్యంలో ఉంది. ఎన్డీయే 34 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా, ఎంజీబీ 23 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. మరోవైపు ఎల్‌జేపీ 2, ఇతరులు రెండు స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారు. దేశవ్యాప్తంగా ఉత్కంఠగా ఎదురుచూస్తున్న బిహార్‌ ఓటరు తీర్పు నేడు వెలువడనుంది. ఉదయం 8 గంటలకు 38 జిల్లాల వ్యాప్తంగా ఏర్పాటు చేసిన 55 కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. బిహార్‌లోని 243 అసెంబ్లీ స్థానాలకు మూడు విడతల్లో ఇటీవల ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. బిహార్‌ ముఖ్యమంత్రి పీఠం యువనేత తేజస్వీ యాదవ్‌కు దక్కుతుందా? లేక ప్రస్తుత సీఎం, అధికార జేడీయూ–బీజేపీ కూటమి నేత నితీశ్‌ కుమార్‌(69)కే మళ్లీ సొంతమవుతుందా? అనే ఉత్కంఠకు నేడు తెరపడనుంది. నితీశ్‌ వయసులో సగం కంటే తక్కువగా ఉన్న రాష్ట్రీయజతాదళ్‌(ఆర్జేడీ) యువ నేత తేజస్వీయాదవ్‌(31) నేతృత్వంలోని మహాఘట్‌ బంధన్‌కు అధికారం ఖాయమని మెజారిటీ ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనా వేసిన నేపథ్యంలో ఈ ఫలితాలు సర్వత్రా ఉత్కంఠ రేపుతున్నాయి. బిహార్‌లోని వాల్మీకినగర్‌ లోక్‌సభ స్థానంతోపాటు మధ్యప్రదేశ్‌ అసెంబ్లీలోని 28 స్థానాలు, ఇతర పది రాష్ట్రాల్లోని 30 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల ఫలితాలు కూడా నేడు వెల్లడి కానున్నాయి.