Health

ఇవి “మధు”మేహ నిజాలు

ఇవి “మధు”మేహ నిజాలు

ఆరోగ్యకర ఆహారంలో పండ్లు ముఖ్యమైనవి. అయితే సీతాఫలం, మామిడి, సపోటా, అరటి పండు లాంటివి తింటే వెంటనే షుగర్‌ పెరుగుతుంది. ఎందుకంటే వీటి ైగ్లెసిమిక్‌ ఇండెక్స్‌ ఎక్కువ. అంటే వీటిలో సరళమైన కార్బోహైడ్రేట్లు ఉంటాయి. యాపిల్‌ లాంటి వాటిలో సంక్లిష్ట కార్బోహైడ్రేట్లు ఉంటాయి కాబట్టి, అవి తినవచ్చు.
*ఆలుగడ్డతో షుగర్‌ పెరుగుతుందా?
కచ్చితంగా. ఎందుకంటే ఆలుగడ్డ, కందగడ్డ లాంటి వాటిలో సరళమైన కార్బొహైడ్రేట్స్‌ ఉంటాయి. కానీ పాలకూర, బీన్స్‌ లాంటి కూరగాయల్లో సంక్లిష్ట కార్బొహైడ్రేట్సే కాకుండా ఫైబర్‌ కూడా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి, ఇవి ఎక్కువగా తినాలి. మాంసాహారులు ఫైబర్‌ ఎక్కువగా ఉండే ఆకుకూరలు, దోసకాయ, బీన్స్‌, బీర్నిస్‌ లాంటివి ముందుగా తినాలని మన పెద్దలు చెప్పేది వందశాతం నిజం. నెయ్యి కూడా ఎక్కువ తినొద్దు. కానీ దీనిలో ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలుంటాయి కాబట్టి , ఒకట్రెండు చుక్కలు వేసుకోవాలి.
*చపాతీయే తినాలా?
గోధుమల్లో ఫైబర్‌ ఎక్కువ. డబ్భు అయిదు గ్రాముల అన్నాన్ని, అంతే పరిమాణంలోని గోధుమలతో పోలిస్తే 10 నుంచి 15 కేలరీలు మాత్రమే తేడా ఉంటుంది. కానీ ఫైబర్‌తో పాటు ైగ్లెసిమిక్‌ ఇండెక్స్‌ తక్కువ ఉండటం వల్ల ఇది కొంచెం నయం. అయితే చపాతీలను ఎక్కువగా తిన్నా సమస్యే. ఒక కప్పు అన్నం ఒక చపాతీతో సమానం. పంజాబ్‌, హరియాణాల్లో మొత్తం రొట్టెలే తింటారు. కానీ షుగర్‌ రాకుండా లేదు కదా. ఎక్కువ తింటే ఏదైనా ఇబ్బందే. మధ్యాహ్నం అన్నం, రాత్రికి చపాతీ తినొచ్చు.
*చేదు మంచిదా?
కాకరకాయ రసం, మెంతులు, వేప లాంటివి తీసుకుంటే షుగర్‌ కంట్రోల్‌లో ఉంటుందని అంటారు. దీనికి కారణం ఫైబరే. మెంతుల్లో కూడా ఫైబర్‌ ఉంటుంది. చేదు ఇన్సులిన్‌ ఉత్పత్తి మీద పరోక్షంగా ప్రభావం చూపిస్తుంది. 5 గ్రాముల మెంతులను చపాతీకి కలిపి తీసుకుంటే ఇన్సులిన్‌ అవసరం తగ్గుతుందని ఎన్‌ఐఎన్‌తో కలిసి మేము చేసిన అధ్యయనంలో తేలింది.
*బ్రౌన్‌ రైస్‌ తినాలా?
ఫైబర్‌ ఎక్కువ ఉన్న బియ్యం ఎప్పుడైనా మంచిదే. పాలిష్‌ చేయని బియ్యంలో ఫైబర్‌ ఎక్కువగా ఉంటుంది కాబట్టి, డయాబెటిస్‌కి కూడా ఇవి మంచివి. ఇప్పుడు మన తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం వాళ్లు తయారుచేసిన తెలంగాణ సోనాలో కార్బోహైడ్రేట్‌ చాలా తక్కువ. ఫైబర్‌ ఎక్కువ. బిర్యానీ రైస్‌ కూడా ఎక్కువ తినడం మంచిది కాదు.
*మిల్లెట్స్‌తో తగ్గుతుందా?
ఒకప్పుడు మనవాళ్లు చిరుధాన్యాలు ఎక్కువగా తినేవాళ్లు. అందుకే అప్పు డు షుగర్‌ వ్యాధి ఇంతగా లేదు. వీటిలో ఫైబర్‌ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి రక్తంలో చక్కెరలు కంట్రోల్‌ చేయడానికే కాదు.. మొత్తం శరీర ఆరోగ్యానికి కూడా ఇవి మంచివి. అందుకే రాగులు, జొన్నలు, సజ్జలు, తైదల్లాంటివి ఆహారంలో భాగం చేసుకుంటే మంచిది.