DailyDose

ఇసుక దోచేస్తున్నారు-తాజావార్తలు

ఇసుక దోచేస్తున్నారు-తాజావార్తలు

* టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు, మాజీ మంత్రి, చింతకాయల అయ్యన్నపాత్రుడు విలేకరుల సమావేశం వివరాలు..రాష్ట్రంలో ఉన్న నదుల్లో ఇసుక లభ్యత అవసరమైనంత ఉన్నా ఎక్కడా దొరకని పరిస్థితి…అనధికారికంగా వైఎస్సార్ సీపీ నాయకులు ఇసుకను దోచేస్తున్నారు…నర్సీపట్నం ఇసుక డిపోలో ఆరు నెలల క్రితం 2,500ల టన్నుల ఇసుక మాయమయ్యింది.స్థానిక ఎమ్మెల్యే చెప్పిన వారికల్లా ఇసుకను దోచి పెట్టడం వల్ల ఈ దుస్థితి వచ్చింది…దీనిపై గనులశాఖ అధికారులు విచారణ చేయగా 2,500 టన్నులకు లెక్కలు లేవని తేలింది..నాయకులు చేసిన అవినీతి వల్ల, దానిని ప్రోత్సహించిన ఎమ్మెల్యే వల్ల ఈ ప్రాంతంలో ఇసుక లేకుండా పోయింది.అధికారులు సహకారం వల్లే ఇదంతా జరిగిందనేది అందరికీ తెలిసిన విషయమే…దీనిని మైనింగ్ శాఖ అధికారులు, ప్రజలకు స్వయంగా చెప్పాలి.ఇసుక డిపోను వెంటనే ప్రారంభించాలి…ఇంత అవినీతి జరుగుతున్నా పట్టించుకోని ప్రభుత్వం, పూట గడుపుకోవడం కోసం ఎడ్ల బళ్లు తోలుకునే వారిని పోలీసులు అడ్డగిస్తున్నారు…దళితుల భూములు లాక్కుని చెల్లింపులు లేకుండా చేస్తున్నారు.దీనికి ప్రధాన కారణం రెవెన్యూ అధికారులకు భాగస్వామ్యముంది.దానికి తగ్గ ఆధారాలు నా దగ్గరున్నాయి… అవసరమైన సమయంలో బయట పెడతా…ఇదేకాకుండా అనధికారికంగా క్వారీలు నిర్వహిస్తున్నా రెవెన్యూ అధికారులు చూసీచూడనట్టు వ్యవహరిస్తున్నారు.

* దుబ్బాక ఉప ఎన్నిక ఫలితాల్లో కాంగ్రెస్ ప్రభావాన్ని చూపలేకపోయింది. మాణిక్కం ఠాగూర్​తో సహా రాష్ట్ర నాయకత్వం అంతా అక్కడే మోహరించినా మూడో స్థానంతోనే సరిపెట్టుకుంది. దుబ్బాక ఉప ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ మూడో స్థానానికి పరిమితమైంది. రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ మాణిక్క ఠాగూర్​తో సహా రాష్ట్ర నాయకత్వం అంతా పని విభజన చేసుకొని మరీ ప్రచారం చేశారు. కానీ అంత ప్రభావాన్ని చూపలేకపోయింది. తన స్వస్థలం ఉన్న ప్రాంతానికి సంబంధించిన ఓట్లు లెక్కించినప్పుడు…12వ రౌండ్​లో మాత్రమే 83 ఓట్ల ఆధిక్యాన్ని శ్రీనివాస్ రెడ్డి కనబరిచారు.

* ఏపీ ప్రభుత్వం కరోనా బులెటిన్‌ విడుదల చేసింది. ఒక్కరోజు వ్యవధిలో 67,910 నమూనాలను పరీక్షించగా 1,836 మందికి కొవిడ్‌ నిర్ధారణ అయింది. దీంతో రాష్ట్రంలో కరోనా సోకినవారి సంఖ్య 8,46,245కి చేరింది. 24 గంటల్లో కొవిడ్‌ చికిత్స పొందుతూ 12 మంది మృతిచెందారు. చిత్తూరు, కృష్ణా జిల్లాల్లో ముగ్గురేసి, అనంతపురం, తూర్పుగోదావరి, గుంటూరు, ప్రకాశం, విశాఖపట్నం, పశ్చిమగోదావరిలో ఒకరు చొప్పున మరణించారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనాతో మృతిచెందిన వారి సంఖ్య 6,814కి చేరింది. ఒక్కరోజులో 2,151 మంది కొవిడ్‌ నుంచి పూర్తిగా కోలుకోగా.. ప్రస్తుతం రాష్ట్రంలో 20,958 యాక్టివ్‌ కేసులున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు 87,92,935 నమూనాలను పరీక్షించినట్లు ప్రభుత్వం బులెటిన్‌లో పేర్కొంది.

* గుజరాత్‌ ఉపఎన్నికల్లో భాజపా చరిత్ర సృష్టించింది. ఎనిమిది స్థానాలకు ఉపఎన్నికలు నిర్వహించగా అన్నింటిలోనూ భాజపా తిరుగులేని విజయం సొంతం చేసుకుంది. కాగా కాంగ్రెస్‌ కనీసం ఒక్క సీటు కూడా సాధించలేకపోయింది. తాజా ఘన విజయంతో రాష్ట్ర వ్యాప్త భాజపా శ్రేణుల సంబరాలు అంబరాన్నంటాయి. ఈ సందర్భంగా గుజరాత్‌ ముఖ్యమంత్రి విజయ్‌ రూపానీ మాట్లాడుతూ.. ఉపఎన్నికల్లో భాజపా కేవలం ట్రైలర్‌ మాత్రమే చూపించిందన్నారు. రాబోయే 2022 అసెంబ్లీ ఎన్నికల్లో ఇంకా ఘన విజయం సాధిస్తామన్నారు. కాంగ్రెస్‌ నాయకుల అసత్య ప్రచారాల్ని గుజరాత్‌, బిహార్‌, మధ్యప్రదేశ్‌, యూపీ ప్రజలు తిరస్కరించారన్నారు. దేశవ్యాప్తంగా భాజపా చరిత్రాత్మక విజయాలు సాధిస్తోందని వెల్లడించారు. ప్రధాని నరేంద్రమోదీ పనితీరుకు ఈ ఫలితాలే నిదర్శనమని రూపానీ పేర్కొన్నారు. ముస్లింలు, ఆదీవాసీలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో సైతం తామే గెలిచామని రూపానీ సంతోషం వ్యక్తం చేశారు.

* బిహార్‌లో మహాగట్‌బంధన్‌ కూటమి మరోసారి విఫలమైంది. కౌంటింగ్‌ సరళిని బట్టి చూస్తే అది రెండోస్థానానికే పరిమితమైంది. ఇక భాజపా నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి విజయం దిశగా దూసుకెళ్తోంది. అయితే ఇక్కడ కాంగ్రెస్‌ ఫ్లాప్‌ షో.. తేజస్వీ యాదవ్‌ నేతృత్వంలోని కూటమి అవకాశాలను తీవ్రంగా దెబ్బతీసినట్లు విశ్లేషకులు భావిస్తున్నారు.

* బిహార్‌ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి మ్యాజిక్‌ ఫిగర్‌ దాటేసింది. రాష్ట్రంలోని మొత్తం 243 అసెంబ్లీ స్థానాల్లో ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన 122 స్థానాలను ఎన్డీయే కూటమి సాధించింది. ఆర్జేడీ నేతృత్వంలోని మహాగట్‌బంధన్ ‌(ఎంజీబీ)తో జరిగిన హోరాహోరీ పోరులో అంతిమంగా విజయాన్ని అందుకుంది. ఇప్పటివరకు ఎన్డీయే 123 స్థానాల్లో విజయం సాధించి ఒక స్థానంలో ఆధిక్యంలో కొనసాగుతుండగా.. ఎంజీబీ 108 స్థానాల్లో గెలుపొంది 3 స్థానాల్లో ఆదిక్యంలో ఉంది. మరోవైపు ఇతరులు 7 స్థానాల్లో విజయం సాధించగా.. ఎల్జేపీ కేవలం ఒక్క స్థానంతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది.

* రాజకీయాల్లో శాశ్వత మిత్రులు.. శాశ్వత శత్రువులు ఉండరు.. అన్న నానుడికి ఈ సారి బిహార్‌ ఎన్నికలే నిలువుటద్దం. 2015 ఎన్నికల్లో ఆర్‌జేడీ, జేడీయూ, కాంగ్రెస్‌ కూటమిగా పోటీ చేశాయి. 2020 నాటికి ఆ కూటమిలోని ప్రధాన పార్టీ భాజపాతో జట్టుకట్టి ఏన్‌డీఏలో చేరింది. కానీ, ఎన్నికల ఫలితాలు వచ్చే కొద్దీ.. జేడీయూ, ఆర్‌జేడీలు బలహీనపడగా.. భాజపా పుంజుకొన్నట్లు స్పష్టమవుతోంది. గత ఎన్నికల్లో భాజపా 53 సీట్లు మాత్రమే సాధించింది. దీంతో కొన్నాళ్లు ప్రతిపక్షంలో కూర్చొంది. ఆర్‌జేడీ(80)తో కలిసి జేడీయూ(71) ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. 2017లో జేడీయూ ఆ కూటమి నుంచి బయటకు వచ్చింది. అప్పట్లో ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన నీతీశ్‌ భాజపా మద్దతు కూడగట్టారు. కొన్ని గంటల్లోనే తిరిగి ప్రమాణ స్వీకారం చేశారు. ఆ తర్వాత నుంచి చిన్నచిన్న విభేదాలు ఉన్నా.. ఎన్‌డీఏతో కొనసాగారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో భాజపా, జేడీయూ, ఎల్‌జేపీ కలిసి బరిలోకి దిగాయి. దాదాపు క్లీన్‌ స్వీప్‌ చేశాయి. కేవలం ఒక్క సీటు మాత్రమే ప్రతిపక్ష యూపీఏకు దక్కింది. ఇక ప్రధాన ప్రతిపక్షమైన ఆర్జేడీకి ఒక్కసీటు కూడా దక్కపోవడం విశేషం.

* అంతర్జాతీయ కొవిడ్‌-19 వ్యాక్సిన్‌ రేసులో ముందున్న చైనాకు ఎదురుదెబ్బ తగిలింది. ఆఖరి దశలో ఉన్న చైనా వ్యాక్సిన్‌ ‘కరోనావాక్‌’ ప్రయోగాలకు ఆటంకం కలిగింది. బ్రెజిల్‌లో జరుగుతున్న ఈ ప్రయోగాలు తీవ్ర విపరిణామాలకు దారితీయటంతో నియమాలను అనుసరించి వాటిని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్టు బ్రెజిల్‌ ఆరోగ్య శాఖ ప్రకటించింది.

* దుబ్బాక ఉపఎన్నికలో భాజపా విజయంపై తెరాస కీలకనేత, మంత్రి హరీశ్‌రావు స్పందించారు. తెరాసకు ఓటు వేసిన దుబ్బాక ప్రజలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఓటమికి బాధ్యత వహిస్తున్నానని, ఓడిపోవడానికి గల కారణాలను పూర్తి స్థాయిలో సమీక్షించుకుంటామని అన్నారు. దుబ్బాక ప్రజా సేవలో నిరంతరం పాటుపడతామని చెప్పారు. ఓడిపోయినప్పటికీ ప్రజల కష్టసుఖాల్లో పాలుపంచుకుంటామని, సీఎం నేతృత్వంలో దుబ్బాక నియోజకవర్గ అభివృద్ధికి కృషిచేస్తామని తెలిపారు. దుబ్బాక తీర్పును మంత్రి కేటీఆర్‌ కూడా అంగీకరించిన విషయం తెలిసిందే. తాము అనుకున్నట్లుగా ఫలితాలు రాలేదని, ఓటమికి గల కారణాలను పూర్తి స్థాయిలో విశ్లేషించి భవిష్యత్‌లో ముందుకు పోతామని ఆయన స్పష్టం చేశారు.

* దుబ్బాక ఉపఎన్నికలో భాజపా విజయం సాధించడంపై కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్‌రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. తెరాస కోటను దుబ్బాక ప్రజలు బద్దలు కొట్టి భాజపాకు విజయం కట్టబెట్టారని చెప్పారు. భాజపా రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. భాజపా విజయంతో ప్రతి గ్రామంలోని ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారని చెప్పారు. దుబ్బాక మాదిరిగా ఎక్కడా అధికార దుర్వినియోగం జరగలేదని కిషన్‌రెడ్డి ఆక్షేపించారు. భాజపా అభ్యర్థి రఘునందన్‌రావు కుటుంబ సభ్యులను వేధించారని, ఆయన మామ ఇంటిపై దాడులు చేశారని ఆరోపించారు. భాజపా అభ్యర్థి ప్రచారానికి వెళ్తే అడుగడుగునా అడ్డుకున్నారని.. అధికారులు పక్షపాతంతో వ్యవహరించారని మండిపడ్డారు. నాయకులు, అధికారుల తీరును ప్రజలు గమనిస్తున్నారన్నారు. దుబ్బాక ప్రజలు భాజపాను చేరదీసి ఆశీర్వదించారని.. క్లిష్ట సమయంలో దేశ ప్రజలు భాజపాకు అండగా నిలిచారని కిషన్‌రెడ్డి చెప్పారు. బిహార్ వంటి రాష్ట్రంలో శాంతియుత పద్ధతిలో నిష్పక్షపాతంగా ఎన్నికలు జరిగాయన్నారు.

* బ్రిటన్ ప్రజలు తమకు కొవిడ్-19 టీకా కావాలో, వద్దో నిర్ణయించుకోగలరని ఆ దేశ ఆరోగ్య శాఖ మంత్రి మాట్‌ హాన్‌కాక్‌ మంగళవారం వెల్లడించారు. ప్రపంచమంతా టీకా కోసం ఎదురుచూస్తున్న తరుణంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అలాగే పిల్లలకు టీకాలు వేయాల్సిన అవసరం లేదని కూడా అన్నారు.

* ఫ్యాషన్‌ నుంచి పాలిటిక్స్‌ వరకు.. విషయం, వివాదం ఏదైనా సరే తన అభిప్రాయాన్ని ముక్కుసూటిగా చెప్పే కథానాయిక కంగనా రనౌత్‌. ఈ క్రమంలోనే ఆమె అనేక వివాదాల్లో చిక్కుకున్నారు. గత కొన్ని రోజులుగా ట్విటర్‌లో చాలా చురుకుగా ఉంటున్నారు. మహారాష్ట్ర ప్రభుత్వం, హత్యాచారాలు, అర్ణబ్‌ గోస్వామి అరెస్టు.. ఇలా రకరకాల అంశాలపై గళం విప్పారు. ఆమె ట్విటర్‌లో తరచూ స్పందించడం కొంతమంది అభిమానులకు నచ్చలేదు. ఒకే అంశం గురించి పదేపదే మాట్లాడుతుంటే బోరింగ్‌గా ఉందని, కాస్త మౌనంగా ఉండమని సలహాలు ఇచ్చారు. వీరిని ఉద్దేశిస్తూ కంగన ట్వీట్‌ చేశారు. ‘రోజంతా నా ట్వీట్లు తనిఖీ చేస్తూ.. విసుగు చెందామని.. మౌనంగా ఉండమని కోరిన అభిమానులు నన్ను మ్యూట్ చేయండి, అన్‌ఫాలో అవ్వడండి, లేదా బ్లాక్‌ చేయండి. అలా చేయకపోతే స్పష్టంగా మీ ఆసక్తి మొత్తం నాపై ఉన్నట్లే. నన్ను ద్వేషించే వారిలా ప్రేమించొద్దు..’ అని ఆమె పేర్కొన్నారు.