Business

జావా బైక్‌ల నూతన రికార్డు-వాణిజ్యం

Business News - JAVA Bikes Reach New Milestone At 50000

* క్లాసిక్‌ లెజెండ్‌ ప్రైవేటు లిమిటెడ్‌కు చెందిన జావా మోటార్‌ సైకిళ్ల విక్రయాలు 50వేల మార్కును దాటాయి. కేవలం ఏడాదిలోనే ఈ మార్కును దాటడం విశేషం. ఈ సమయంలో లాక్‌డౌన్‌ కూడా ఉండటం విశేషం. లాక్‌డౌన్‌ సమయంలో ఒక్క బైకును కూడా విక్రయించలేదని కంపెనీ పేర్కొంది. అంటే మిగిలిన కాలంలోనే 50 వేల బైకులను విక్రయించిందన్నమాట.

* సోషల్ మీడియా అనగానే ముందుగా గుర్తొచ్చేది ఫేస్‌బుక్‌. భారత్‌తో సహా ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది యూజర్స్‌ ఉన్న ఈ కంపెనీకి వ్యాపారపరంగా ఎదురులేదు. అలాంటి ఫేస్‌బుక్‌కు చెందిన వాట్సాప్‌లో పేమెంట్స్ ఫీచర్‌ కోసం సుమారు రెండు ఏళ్లు నుంచి ప్రయత్నిస్తున్నప్పటికీ అది అందని ద్రాక్షగా ఉండిపోయింది. ఎట్టకేలకు ఇటీవలే చట్టపరమైన అడ్డంకులను అధిగమించి వాట్సాప్‌ పేమెంట్స్‌ ఫీచర్‌ను భారత్‌లో యూజర్స్‌కి అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ మేరకు భారత జాతీయ పేమెంట్స్‌ కార్పొరేషన్‌ (ఎన్‌పీసీఐ) వాట్సాప్‌ పేమెంట్స్‌ యూపీఐ (యూపిఫైడ్ పేమెంట్స్‌ ఇంటర్‌ఫేస్‌) ద్వారా ఆర్థిక కార్యకలాపాలు నిర్వహించుకునేందుకు అనుమతులు మంజూరు చేసింది. అయితే తొలి దశలో భాగంగా 2 కోట్ల మంది వాట్సాప్‌ యూజర్లతో మాత్రమే ఈ సేవలను ప్రారంభించాలని ఎన్‌పీసీఐ స్పష్టం చేసింది. మరి వాట్సాప్‌ పేమెంట్స్‌ కోసం ఎలా రిజిష్టర్‌ చేసుకోవాలి..నగదు బదిలీ ఎలా..ట్రాన్స్‌ఫర్ లిమిట్ ఎంత..ఎక్కడెక్కడ ఇది పనిచేస్తుంది వంటి అంశాలు మీ కోసం…వాట్సాప్‌ పేమెంట్స్‌లో రిజిష్టర్‌ చేసుకోవాలనుకుంటే మీ బ్యాంక్‌ ఖాతాతో లింక్‌ అయిన్‌ ఫోన్‌ నంబర్‌, మీరు వాట్సాప్‌ కోసం ఉపయోగిస్తున్న ఫోన్ నంబర్‌ ఒకటే అయిండాలి. వాట్సాప్‌లో ఫొటోలు, వీడియోలు, డాక్యుమెంట్స్‌ పంపాడానికి ఉపయోగించే అటాచ్‌మెంట్ ఫీచర్‌ ద్వారా పేమెంట్స్‌ చెయ్యొచ్చు. ముందుగా వాట్సాప్‌ సెట్టింగ్స్‌లోకి వెళ్లి పేమెంట్స్‌ ఆప్షన్‌పై క్లిక్‌ చేస్తే మీకు బ్యాంక్‌ల జాబితా చూపిస్తుంది. అందులో మీ ఖాతా ఉన్న బ్యాంక్‌ ఎంపిక చేసుకుంటే ఎస్సెమ్మెస్‌తో వెరిఫికేషన్‌ చేయమని కోరుతుంది. ఎస్సెమ్మెస్‌ వెరిఫికేషన్‌ అయ్యాక యూపీఐ పాస్‌కోడ్ సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒక వేళ మీరు ఇప్పటికే యూపీఐ పాస్‌కోడ్ ఉపయోగిస్తుంటే దాంతోనే వాట్సాప్ పేమెంట్స్‌ చెయ్యొచ్చు. ఇతర డిజిటల్ పేమెంట్స్‌ యాప్స్‌ గూగుల్ పే, ఫోన్‌ పే, భీమ్‌ తరహాలోనే వాట్సాప్‌ పేమెంట్స్‌ కూడా యూపీఐతో పనిచేస్తుంది. దాని వల్ల వాట్సాప్‌ వ్యాలెట్‌లో నగదు నిల్వ చేసుకోవాల్సిన అవసరం ఉండదు. అలానే నగదు బదిలీ, చెల్లింపులు వాట్సాప్‌ పేమెంట్స్‌తో యూపీఐ ద్వారా డైరెక్ట్‌గా బ్యాంక్‌ ఖాతా నుంచి చెయ్యొచ్చు. ఒకే వేళ యూపీఐ పాస్‌కోడ్‌ లేకుంటే పైన పేర్కొన్న పద్ధతిలో వాట్సాప్‌ పేమెంట్స్‌ సెక్షన్‌లోకి వెళ్లి పాస్‌కోడ్ పొందవచ్చు.

* అక్టోబర్‌ నెల ప్యాసెంజర్‌ వాహనాల టోకు విక్రయాల్లో 14 శాతం వృద్ధి నమోదైనట్లు సొసైటీ ఆఫ్‌ ఇండియన్‌ ఆటోమొబైల్‌ మానుఫాక్చరర్స్‌(ఎస్‌ఐఏఎం) వెల్లడించింది. క్రితం సంవత్సరం అక్టోబర్‌లో 2,71,737 యూనిట్లను విక్రయించగా.. ఈ సారి 3,10,294 యూనిట్లు అమ్ముడయ్యాయి. ద్విచక్రవాహన టోకు విక్రయాల్లో 16.88శాతం, మోటార్‌సైకిళ్ల అమ్మకాల్లో 23.8 శాతం, స్కూటర్‌ విక్రయాల్లో 1.79 శాతం వృద్ధి నమోదైంది. ఒక్క త్రీవీలర్‌ విక్రయాలు మాత్రం 60.91 శాతం కుంగాయి. దీపావళి పండగ నేపథ్యంలో వినియోగదారుల డిమాండ్‌ను అందుకోవడానికి డీలర్లు సిద్ధమయ్యారని ఎస్‌ఐఏఎం డైరెక్టర్‌ జనరల్‌ రాజేశ్‌ మేనన్‌ తెలిపారు. ఈ నేపథ్యంలోనే టోకు విక్రయాలు పెరిగాయన్నారు.

* దేశీయ మార్కెట్లలో లాభాల జోరు కొనసాగుతోంది. సూచీలు బుధవారం సరికొత్త రికార్డులు నెలకొల్పుతున్నాయి. మార్కెట్లు వరుసగా ఎనిమిదో రోజు లాభాల్లో కొనసాగుతుండడం విశేషం. ఉదయం 9:50 గంటల సమయంలో సెన్సెక్స్‌ 407 పాయింట్ల లాభంతో 43,685 వద్ద కొనసాగుతుండగా.. నిఫ్టీ 130 పాయింట్లు ఎగబాకి 12,761 వద్ద ట్రేడవుతోంది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.73.83 వద్ద కొనసాగుతోంది. మార్కెట్లు ప్రారంభమైన కొంత సమయంలోనే సెన్సెక్స్‌ 43,688 వద్ద జీవనకాల గరిష్ఠాన్ని తాకింది. నిఫ్టీ సైతం అదే స్థాయిలో దూసుకుపోతోంది. వ్యాక్సిన్‌ త్వరలో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందన్న అంచనాలు అంతర్జాతీయంగా మార్కెట్ల సెంటిమెంటును బలపర్చింది. అలాగే, ఆర్థిక, వాహన, ఐటీ, ఫార్మా రంగ షేర్లు రాణిస్తుండడం సూచీలకు దన్నుగా నిలిచింది.

* కరోనా కారణంగా ఇ-లెర్నింగ్‌, ఇంటి నుంచి పని(డబ్ల్యూఎఫ్‌హెచ్‌)కి ప్రాధాన్యం పెరగడంతో భారత్‌లో వ్యక్తిగత కంప్యూటర్ల(పీసీ) మార్కెట్‌ రాణించింది. 2019 జులై-సెప్టెంబరులో 31 లక్షల కంప్యూటర్లు విక్రయమవ్వగా, ఈ ఏడాది సెప్టెంబరు త్రైమాసికంలో 9.2 శాతం వృద్ధితో 34 లక్షల కంప్యూటర్లు అమ్ముడయ్యాయి. డెస్క్‌టాప్‌లు, నోట్‌బుక్‌లు, వర్క్‌స్టేషన్లు ఇందులో ఉన్నాయని పరిశోధక సంస్థ ఐడీసీ వెల్లడించింది. వాణిజ్య విభాగంలో కొన్ని ప్రభుత్వ, విద్యా ప్రాజెక్టులు మాత్రమే నమోదుకాగా.. వినియోగదారు విభాగంలో అత్యధికంగా 20 లక్షల కంప్యూటర్లు నమోదయ్యాయి. వ్యక్తిగత కొనుగోళ్లలో ఈ ఏడాది జూన్‌ త్రైమాసికంతో పోలిస్తే 167.2 శాతం; 2019-20 జులై-సెప్టెంబరుతో పోలిస్తే 41.7 శాతం వృద్ధి చోటుచేసుకోవడం విశేషం. జులై-సెప్టెంబరు ఇప్పటికే రికార్డు త్రైమాసికంగా నిలవగా.. అక్టోబరు-డిసెంబరు కూడా బలమైన త్రైమాసికంలో నమోదు కావొచ్చని ఐడీసీ అంచనా వేస్తోంది. మార్కెట్‌ వాటా విషయంలో హెచ్‌పీ 28.2 శాతంతో అగ్రగామిగా నిలవగా.. లెనోవో(21.7%), డెల్‌ టెక్నాలజీస్‌(21.3%), ఏసర్‌(9.5%), ఆసుస్‌(7.5%)లు ఆ తర్వాతి స్థానాలను దక్కించుకున్నాయి. షియోమీ, అవిటాలు కూడా అవకాశాన్ని అందిపుచ్చుకున్నప్పటికీ.. టాప్‌-5లోకి చేరలేకపోయాయి.

* కరోనా నుంచి చైనా కోలుకోవడంతో ఈ ఏడాది ‘సింగిల్స్‌ డే’ షాపింగ్‌ పండుగలో ఆ దేశ వినియోగదార్లు రూ.వేల కోట్లు కోట్లు వెచ్చిస్తారని అంచనా వేస్తున్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఆన్‌లైన్‌ షాపింగ్‌ ఫెస్టివల్‌ను ఏటా నవంబరు 11న చైనాలో జరుపుతున్న సంగతి విదితమే. చైనా ఇ-కామర్స్‌ సంస్థలు అలీబాబా, జేడీ.కామ్‌, పిన్‌డుయోడుయోలు భారీ ఆఫర్లు ఇవ్వనున్నాయి. గతేడాది అలీబాబా ఇ-కామర్స్‌ ప్లాట్‌ఫామ్స్‌ అయిన టీమాల్‌, తౌబౌలలో వినియోగదార్లు 38.4 బి. డాలర్లు (దాదాపు రూ.2.88 లక్షల కోట్లు) ఖర్చుపెట్టారు. ఈ ఏడాది ఈ పండుగను చైనా వినియోగానికి ప్రామాణికంగా పరిగణించే అవకాశం లేకపోలేదు. కరోనా నుంచి కోలుకున్న ప్రజలు ఏ విధంగా ఖర్చుపెట్టేదీ దీంతో తెలిసిపోతుందని అక్కడి విశ్లేషకులు అంటున్నారు. కరోనా కారణంగా అంతర్జాతీయ ప్రయాణాలు రద్దవడంతో ఈ సారి విదేశీ విలాసవంత బ్రాండ్లు, దిగుమతి వస్తువులపై ఆ దేశీయులు ఖర్చు పెట్టే అవకాశం కనిపిస్తోంది. 86 శాతం మంది చైనీయులు గతేడాదితో పోలిస్తే సమానంగా, లేదా అంతకంటే ఎక్కువే ఖర్చుపెట్టనున్నారని ఒక అంచనా.

* ప్రస్తుత మందగమనానికి ఆర్‌బీఐ మాజీ గవర్నర్‌లు ఉర్జిత్‌ పటేల్‌, రఘురామ్‌ రాజన్‌ చేపట్టిన బ్యాంకు ఖాతాల శుద్ధి చర్యలే కారణమని ఆరోపించడం సరికాదని ఆర్‌బీఐ మాజీ డిప్యూటీ గవర్నర్‌ విరాల్‌ ఆచార్య అభిప్రాయపడ్డారు. ప్రభుత్వ రంగ బ్యాంకింగ్‌ వ్యవస్థ భారీ ‘బ్యాడ్‌ బ్యాంక్‌’గా మారిందని, గత దశాబ్ద కాలంలో ఎటువంటి ఫలితాలను ఇవ్వకుండానే 100 బిలియన్‌ డాలర్ల (దాదాపు రూ.7.5 లక్షల కోట్లు) పన్ను చెల్లింపుదార్ల సొమ్ము బూడిద పాలైందని, అయితే దీని గురించి ఎవరూ పట్టించుకోకపోవడం శోచనీయమని ఆచార్య అన్నారు. పాత్రికేయుడు తమల్‌ బంధోపాధ్యాయ ‘పాండెమోనియం: ది గ్రేట్‌ ఇండియన్‌ బ్యాంకింగ్‌ ట్రాజెడీ’ పుస్తకం వర్చువల్‌ విడుదల సందర్భంగా ఆయన మాట్లాడారు. ‘ప్రస్తుత మందగమనానికి మాజీ గవర్నర్‌లు కారణమని ఆరోపిస్తున్న విశ్లేషకులను చూస్తే.. భారత్‌కు మంచి చేసేందుకు కృషి చేస్తున్న వారిని గుర్తించరని అనిపించింద’ని వెల్లడించారు.

* భారత్‌లో 5జీ సేవల ఆరంభానికి ఇంకా సమయం ఉందని, అయితే కొత్త టెక్నాలజీకి ప్రధాన మార్కెట్‌గా భారత్‌ మారుతుందని తైవాన్‌ చిప్‌సెట్‌ తయారీ సంస్థ మీడియాటెక్‌ సీఈఓ రిక్‌ సాయ్‌ పేర్కొన్నారు. అధునాతన 5జీ సామర్థ్యాలకు వీలుగా కంపెనీ కొత్తగా డైమిన్షిటీ 700 5జీ స్మార్ట్‌ఫోన్‌ చిప్‌సెట్‌ను విడుదల చేసింది. భారత విపణిలోని ఫోన్లకు భారీ సంఖ్యలో చిప్‌సెట్‌లను సరఫరా చేస్తున్నట్లు రిక్‌ వెల్లడించారు.