WorldWonders

ఇందిరా పార్క్‌లో గంధపు చెట్లు మాయం

ఇందిరా పార్క్‌లో గంధపు చెట్లు మాయం

ఇందిరాపార్కు అనగానే గుర్తుకొచ్చేది ధర్నాల పార్కు అని.

ఇది భాగ్యనగరం నడిబొడ్డున ఉంది. నిత్యం వందలాది మంది వాకర్స్ ఉదయం, సాయంత్రం వాకింగ్ చేస్తుంటారు.

యువకులు కూడా ఎప్పుడూ ఆడుకుంటూ ఆ ప్రాంతం సందడిగా ఉంటుంది.

పైగా సచివాలయానికి కూతవేటు దూరంలో ఉండడంతో పోలీసులు కూడా అటు ఇటు తిరుగుతూనే ఉంటారు.

అలాంటి భద్రత కలిగిన ప్రాంతం నుంచి 13 గంధపు చెట్లు మాయమయ్యాయి.

ఈ వార్త వింటుంటే కొంచెం ఆశ్యర్యంగా అనిపించినా.. ఇది మాత్రం వాస్తవం.

ఆలస్యంగా వెలుగులోకి..

ఇందిరాపార్క్‌ నుంచి 13 గంధపు చెట్లు మాయమైనట్లు జీహెచ్‌ఎంసీ సిబ్బంది ఆలస్యంగా గుర్తించింది. ఆదివారం రాత్రి దొంగలు ఈ చెట్లు నరికి మాయం చేసినట్లు గమనించారు.

అయితే ఈ విషయాన్ని బయటకు పొక్కకుండా పోలీసులు, జీహెచ్ఎంసీ అధికారులు, సెక్యూరిటీ సిబ్బంది గోప్యంగా ఉంచారు.

జీహెచ్ఎంసీ అధికారులు మాత్రం గాంధీనగర్ పీఎస్‌లో ఫిర్యాదు చేశారు.

పార్క్‌లో ఉన్న తోటమాలీలు, సిబ్బందిని పోలీసులు విచారిస్తున్నారు.

సిబ్బందిపై అనుమానం!

అయితే ఈ చెట్ల మాయం వెనుక పార్కులో పని చేస్తున్న సిబ్బంది హస్తం ఉన్నట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. పార్టులో పని చేస్తున్న సిబ్బందే 13 గంధపు చెట్లను కట్టర్‌తో కట్ చేసినట్లుగా పోలీసులు భావిస్తున్నారు. చెట్లు నరికిన మరుసటి రోజే మాయం చేసినట్లుగా తెలుస్తోంది. గతంలోనూ పలు మార్లు గంధం చెట్లు మాయమైనట్లుగా సమాచారం.