Fashion

కుంకుమపువ్వు కథ ఇది

కుంకుమపువ్వు కథ ఇది

ప్రపంచవ్యాప్తంగా మసాలాలను ఎక్కువ పండించే దేశం భారతదేశం. 109 రకాల మసాలా దినుసుల్లో దాదాపు 75 రకాలు ఇండియాలోనే పండుతాయని ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ స్టాండర్డైజేషన్ తేల్చింది. అయితే వీటన్నింటిలో ఖరీదైనది కుంకుమపువ్వు. ఇది పండించడంలో మొదటి స్థానంలో జమ్మూ కశ్మీర్ ఉంది. అయితే కుంకుమపువ్వుకు ఎందుకు అంత డిమాండ్. అన్ని మసాలాల కన్నా దీని ధర ఎందుకు అంత ఎక్కువగా ఉంటుంది తెలుసుకుందాం..
*కుంకుమపువ్వు అద్భుతమైన, రంగు, రుచి, వాసన కలిగిన గొప్ప ఔషధం లాంటిది . ఒకరకంగా చెప్పాలంటే ఇది ఖరీదైన సుగంధ ద్రవ్యం. ఎన్నో సౌందర్యపోషకాలు కలిగిన మొక్క. కుంకుమపువ్వు మొక్క చూడ్డానికి ఉల్లి లేదా ఎర్ర లిల్లీ మొక్కలా ఉంటుంది. వర్షాకాలం చివరలో కుంకుమ దుంపలను దున్నిన భూమిలో నాటుతారు. వాతావరణంలో అధిక తేమ ఉండి, మట్టి గుల్లగా ఉన్నప్పుడు ప్రకృతిసిద్ధమైన ఎరువులతో వీటిని పండిస్తారు.
*చిన్న దుంపవేరు నుంచి ఆకులు పైకి వచ్చి వాటి మధ్యలో పూలు వస్తాయి. కాశ్మీర్‌లో పండించే కుంకుమపువ్వు మొక్కకి పైకి ఆకులు కూడా కనిపించవు. కేవలం వంగపండురంగు పువ్వు మాత్రం కనిపిస్తుంది. ముందు మొగ్గ వచ్చి పువ్వు విచ్చుకుంటుంది. అదే కుంకుమపువ్వు అనుకుంటే పొరపాటే. అందులో మూడు అండకోశాలు, రెండు కేసరాలు ఉంటాయి. కిందభాగంలో పసుపు, పైన ఎరుపురంగులో ఉండే ఈ అండకోశాలనే కుంకుమపువ్వుగా పిలుస్తారు. ఉదయాన్నే విచ్చుకునే ఈ పూలను కోసి అందులో ఎరుపురంగులో ఉండే అండకోశభాగాలను తుంచి ఎండబెడతారు. అప్పుడే అవి మంచి వాసనతో ఉంటాయి. విచ్చుకున్న పూలను కొయ్యడంలో ఒక్కపూట ఆలస్యం చేసినా అవి వెంటనే వాడిపోతాయి. అండకోశాలు రంగునీ రుచినీ కోల్పోతాయి. అందుకే, పూసిన పూలన్నింటినీ ఉదయం పదిగంటలలోపే కోసేస్తారు.
*కుంకుమపువ్వు సాగుకు కూలీలు అధికంగా కావాల్సి వస్తుంది. ఇదంతా చాలా జాగ్రత్తతో, శ్రమతో కూడుకున్న పని. కిలో కుంకుమపువ్వు కావాలంటే సుమారు లక్షన్నర పూలను సేకరించాలి. అన్నింటి నుంచీ అండకోశాలను చేత్తోనే వేరుచేయాలి. శాఫ్రాన్‌ అంత ధర పలకడానికి ఇదీ ఓ కారణమే. ఇక దీన్ని మనం తినే ఆహారంలో, చర్మం కోసం తయారుచేసే క్రీముల్లో, ఫేస్ ప్యాకుల్లో వాడతారు.ఔషధాల తయారీలోనూ కుంకుమ పువ్వును ఉపయోగిస్తారు.
*యాంటీఆక్సిడెంట్లు అధికం.
జీర్ణశక్తిని పెంచడం, రక్తప్రసరణను మెరుగుపరచడం, ఆకలిని క్రమబద్ధీకరించేందుకు పరిచేస్తాయి. దీనిలో క్యాన్సర్‌ను నివారించే కీమో-ప్రివెంటివ్‌ లక్షణాలున్నట్లు కూడా తాజా పరిశో ధనలో గుర్తించారు. స్త్రీలు గర్భంతో ఉన్నప్పుడు కుంకుమపువ్వు పాలల్లో వేసుకుని తాగితే పుట్టబోయే పిల్లలు మంచి రంగుతో పుడతారని అంటారు. అది వాస్తవమే అయినప్పటికీ కేవలం గర్భవతులే కాదు. కుంకుమ పువ్వును ఎవ్వరైనా తీసుకోవచ్చు. కుంకుమ పువ్వు తీసుకోవడం వలన ఆరోగ్యం మరింత మెరుగవుతుంది ఇలా రకరకాల ఆరోగ్య సమస్యలను దూరం చేస్తాయి. అందుకనే వీటికి డిమాండ్ ఎక్కువ.