DailyDose

ఎంపీ సుజనాకు ఢిల్లీలో షాక్-తాజావార్తలు

చిరంజీవి ఎలాన్‌మస్క్‌లతో కరోనా దోబూచులాట-తాజావార్తలు

* బీజేపీ రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరికి అధికారులు షాకిచ్చారు. బ్యాంక్‌ కుంభకోణం కేసులో అతనిపై లుక్‌అవుట్‌ నోటీసులు జారీచేశారు. దీంతో అమెరికాకు బయలుదేరిన సుజనాను శుక్రవారం ఢిల్లీ ఎయిర్‌పోర్టులో అడ్డుకున్నారు. లుక్‌ అవుట్‌ నోటీసుల ఆధారంగా ఇమిగ్రేషన్‌ అధికారులు అతన్ని నిలిపివేశారు. మరోవైపు తాజా నోటీసులపై ఆయన తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. తనను అక్రమంగా అడ్డుకున్నారని, లుక్‌ఔట్‌ నోటీసులు రద్దు చేయాలని పిటిషన్‌ దాఖలు చేశారు. బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాకు రూ.322.03 కోట్ల రుణం ఎగవేతకు పాల్పడ్డ విషయం తెలిసిందే.

* అనతికాలంలోనే యావత్‌ ప్రపంచాన్ని చుట్టేసిన కొవిడ్‌ మహమ్మారిపై పోరులో భాగంగా ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో పరీక్షలను చేపడుతున్నారు. అయితే, కరోనా నిర్థారణ పరీక్షల ఫలితాలు కచ్చితంగా రాకపోవడం ప్రస్తుతం ఓ సవాల్‌గా మారింది. దీంతో కొవిడ్‌ టెస్టుల పనితీరుపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా ర్యాపిడ్‌ యాంటీజెన్‌ పరీక్షలు వైరస్‌ను కచ్చితంగా గుర్తించలేకపోతున్నట్లు ప్రపంచవ్యాప్తంగా వస్తోన్న వార్తలు వాటి విశ్వాసాన్ని మరోసారి ప్రశ్నార్థకంగా మార్చాయి. ఈ ర్యాపిడ్‌ టెస్టులపై తాజాగా టెస్లా సీఈఓ ఎలాన్‌ మస్క్‌ కూడా కీలక వ్యాఖ్యాలు చేశారు. ‘ఏదో తీవ్రమైన బోగస్‌ జరుగుతోంది. ఓకే రోజు నాలుగు సార్లు టెస్టులు చేయించుకున్నాను. వీటిలో రెండు టెస్టుల్లో నెగెటివ్‌, మరో రెండు టెస్టులు పాజివివ్‌ వచ్చాయి. ఒకే మిషిన్‌, ఒకే పరీక్ష, ఒకే నర్సు’ అంటు కరోనా టెస్టుపై ఎలాన్‌ మస్క్‌ తీవ్రంగా స్పందించారు. ఓ ల్యాబ్‌లో ర్యాపిడ్‌ యాంటీజెన్‌ టెస్టులు చేయించుకున్న అనంతరం ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ ఫలితాలు భిన్నంగా రావడంతో మరో ల్యాబ్‌లో ఆర్‌టీ-పీసీఆర్‌ టెస్టు కూడా చేయించుకున్నానని, ఆ ఫలితం కోసం వేచిచేస్తున్నట్లు మస్క్‌ ట్విటర్‌లో వెల్లడించారు. మీకు ఏమైనా కొవిడ్‌ లక్షణాలు ఉన్నాయా? అని ఓ వ్యక్తి అడిగిన ప్రశ్నకు ‘సాధారణ జలుబు’ ఉన్నట్లు ఎలాన్‌ మస్క్‌ సమాధానమిచ్చారు. అయితే, అంతగా ఇబ్బంది లేదని ఆయన స్పష్టం చేశారు. మెగాస్టార్​ చిరంజీవికి కరోనా నెగిటివ్​గా నిర్ధరణ అయ్యింది. గత ఆదివారం కరోనా సోకిన తర్వాత తనలో లక్షణాలేవి లేకపోవడం వల్ల చిరు మరోసారి పరీక్షలు చేయించుకున్నారు. వాటిలో నెగిటివ్​గా తేలింది.అయితే గతంలో చేసిన ఆర్టీ-పీసీఆర్​ టెస్ట్ సరిగ్గా​ పనిచేయకపోవడం వల్లే పొరపాటు జరిగినట్లు వైద్యులు తెలిపారని చిరు ట్వీట్​ చేశారు.

* బాణసంచా నిషేధం అంశంలో తెలంగాణ ఫైర్‌ వర్క్స్‌ డీలర్స్‌ అసోసియేషన్‌కు స్వల్ప ఊరట లభించింది. బాణసంచాను నిషేధిస్తూ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సుప్రీంకోర్టు సవరించింది. గాలి నాణ్యత సూచీల ఆధారంగా టపాసుల వినియోగంపై ఆంక్షలు వర్తింపజేస్తున్నట్లు స్పష్టం చేసింది. హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాల్‌ చేస్తూ తెలంగాణ ఫైర్‌ వర్క్స్‌ డీలర్స్‌ అసోసియేషన్‌ సుప్రీంకోర్టులో అత్యవసర పిటిషన్‌ దాఖలు చేసింది. దీనిపై జస్టిస్‌ ఖాన్‌విల్కర్‌ నేతృత్వంలోని ద్విసభ్య ధర్మాసం విచారణ చేపట్టింది. ఈనెల 9న జాతీయ హరిత ట్రైబ్యునల్‌ (ఎన్జీటీ) ఇచ్చిన ఆదేశాలకు అనుగుణంగా హైకోర్టు ఆదేశాలను సవరిస్తున్నట్లు సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. తెలంగాణలో గాలి నాణ్యత ప్రమాదకరంగా ఉన్నచోట టపాసులపై నిషేధం విధించిన సుప్రీం.. గాలి నాణ్యత సాధారణంగా ఉన్నచోట రాత్రి 8 గంటల నుంచి 10 గంటల వరకు గ్రీన్‌ క్రాకర్స్‌కు అనుమతించింది. ఎన్జీటీ మార్గదర్శకాల ప్రకారమే తెలంగాణలో టపాసులపై ఆంక్షలు విధిస్తున్నట్లు సర్వోన్నత న్యాయస్థానం పేర్కొంది.

* ఆంధ్రప్రదేశ్‌లో కరోనా పరీక్షలు 90 లక్షల మార్క్‌ దాటింది. ఇప్పటివరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ 90,21,225 సాంపుల్స్‌ని పరీక్షించగా 8,51,298 కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు వైద్యారోగ్య శాఖ బులెటిన్‌ విడుదల చేసింది. గడిచిన 24 గంటల్లో 80,737 నమూనాలను పరీక్షించగా 1,593 మందికి కొవిడ్‌ నిర్ధారణ అయినట్లు వైద్యఆరోగ్యశాఖ వెల్లడించింది. ఒక్కరోజు వ్యవధిలో 10 మంది బాధితలు మృతిచెందారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనాతో మృతిచెందిన వారి సంఖ్య 6,847కి చేరింది. గడిచిన 24 గంటల్లో 2,178 మంది కొవిడ్‌ నుంచి పూర్తిగా కోలుకోగా.. ఇప్పటివరకు రాష్ట్రంలో 8,24,189 మంది కోలుకొని ఇళ్లకు వెళ్లిపోయారు. ప్రస్తుతం రాష్ట్రంలో 20,262 యాక్టివ్‌ కేసులున్నట్లు ఆరోగ్య శాఖ బులెటిన్‌లో పేర్కొంది. గడిచిన 24 గంటల్లో కృష్ణాలో ముగ్గురు, విశాఖలో ఇద్దరు కరోనాతో మృతి చెందారు. చిత్తూరు, గుంటూరు, నెల్లూరు, విజయనగరం జిల్లాల్లో ఒక్కరు చొప్పున ప్రాణాలు కోల్పోయారు.

* నవంబరు 3న జరిగిన అధ్యక్ష ఎన్నికలు అమెరికా చరిత్రలోనే అత్యంత భద్రమైనవి అని అగ్రరాజ్యంలో ఎన్నికలు నిర్వహించే ఎలక్షన్ టెక్నాలజీ కంపెనీలు, ఫెడరల్‌ ఉన్నతాధికారులు బలంగా చెప్పారు. ఎన్నికల ప్రక్రియలో అవకతవకలు జరిగాయని, తన ఓట్లను దొంగలించారని అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ పదేపదే వాదిస్తున్న నేపథ్యంలో ఎన్నికల సైబర్‌ సెక్యూరిటీ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ సెక్యూరిటీ ఏజెన్సీ గురువారం ఓ ప్రకటన విడుదల చేసింది. ఓట్లు డిలీట్‌ అయ్యాయని, మారిపోయాయని చెప్పేందుకు ఎటువంటి ఆధారాలు లేవని అధికారులు స్పష్టంగా చెప్పారు. అమెరికా చరిత్రలోనే అత్యంత భద్రమైన ఎన్నికలు ఇవేనని వెల్లడించారు.

* దిగుమతి చేసుకున్న ఆహార పదార్థాల్లో కరోనా వైరస్‌ ఉండటం చైనాలో మరోసారి కలకలం సృష్టించింది. భారత్‌కు చెందిన బసు ఇంటర్నేషనల్‌ కంపెనీ నుంచి దిగుమతి చేసుకున్న చేపల్లో కరోనా వైరస్‌ను గుర్తించడంతో ఆ కంపెనీ దిగుమతులను చైనా తాత్కాలికంగా నిలిపివేసినట్లు ఆంగ్ల వార్తసంస్థ రాయిటర్స్‌ వెల్లడించింది. గడ్డకట్టించిన కటిల్‌ఫిష్‌ ప్యాకేజీలోని మూడు శాంపిల్స్‌లో వైరస్‌ ఉన్నట్లు కస్టమ్స్‌ అధికారులు గుర్తించారని ఆ కథనం పేర్కొంది. దీంతో వారం పాటు దిగుమతులు నిలిపివేశారని తెలిపింది.

* తెలంగాణ కేబినెట్‌ భేటీ ప్రారంభమైంది. ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన జరుగుతున్న ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. సాదా బైనామాల చట్టసవరణ కోసం ఆర్డినెన్స్‌కు మంత్రివర్గం ఆమోదం తెలిపే అవకాశముంది. జీహెచ్‌ఎంసీ ఎన్నికలపై మంత్రివర్గంలో ప్రధానంగా చర్చించే వీలుంది. మరోవైపు సన్నరకం ధాన్యానికి బోనస్‌ ఇచ్చే అంశంపై చర్చించడంతో పాటు గవర్నర్‌ కోటాలో ముగ్గురు నామినేటెడ్‌ ఎమ్మెల్సీల పేర్లను ఈ భేటీలో ఖరారు చేయనున్నట్లు సమాచారం. భారీ వర్షాలు, వరదల వల్ల హైదరాబాద్‌లో జరిగిన నష్టాలు, జిల్లాల్లో పంట నష్టాలు, సన్నరకం ధాన్యానికి మద్దతు ధర, కరోనా నేపథ్యంలో ఆదాయాలు తగ్గినందున తీసుకోవాల్సిన చర్యలు తదితర అంశాలపైనా కేబినెట్‌ భేటీలో చర్చించనున్నట్లు తెలిసింది.

* మంత్రులు, పార్టీ ప్రధాన కార్యదర్శులతో తెరాస అధినేత, సీఎం కేసీఆర్‌ సమావేశం ముగిసింది. జీహెచ్‌ఎంసీ ఎన్నికలపై వారికి సీఎం దిశానిర్దేశం చేశారు. అందరూ బాగా కష్టపడి పనిచేయాలని.. తెరాస ప్రభుత్వ సంక్షేమ పథకాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని కేసీఆర్‌ సూచించారు. హైదరాబాద్‌ అభివృద్ధి కోసం చేపట్టిన పనులను ప్రజలకు వివరించాలన్నారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల నేపథ్యంలో డివిజన్ల వారీగా నేతలకు బాధ్యతలు అప్పగిస్తామని సీఎం స్పష్టంచేశారు. ఈ సమావేశంలో జాతీయ, రాష్ట్ర రాజకీయ అంశాలను మంత్రులు, నేతలకు కేసీఆర్ వివరించారు. దుబ్బాక ఉప ఎన్నికలో తెరాస ఓటమిపైనా నేతలతో సీఎం చర్చించినట్లు తెలిసింది. ఉప ఎన్నిక ఫలితం నేపథ్యంలో చేపట్టాల్సిన చర్యలు, కార్యక్రమాలపై నేతల అభిప్రాయాలను తెలుసుకున్నట్లు సమాచారం. దీంతో పాటు దుబ్బాకలో పార్టీ ఓటమికి గల కారణాలపై ఆయన ఆరా తీసినట్లు తెలుస్తోంది.

* కర్నూలు జిల్లా నంద్యాలకు చెందిన అబ్దుల్‌ సలాం కుటుంబానికి జరిగిన అన్యాయాన్ని చూశాక రాష్ట్రంలో ఎవరికైనా భద్రత ఉందా? అనే అనుమానం కలుగుతోందని తెదేపా అధినేత చంద్రబాబు అసహనం వ్యక్తం చేశారు. అమరావతిలో చంద్రబాబు మీడియాతో మాట్లాడారు. అబ్దుల్‌ సలాం కేసులో నిందితుడికి బెయిల్‌ మంజూరు కావడంపై ఆయన స్పందించారు. సలాం కుటుంబానికి జరిగిన అన్యాయం చాలా బాధాకరమని.. వేధింపులకు గురిచేసి కుటుంబం మొత్తాన్ని బలితీసుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైల్వే పోలీసులు కేసు నమోదు చేస్తే స్థానిక పోలీసులు ఏం తెలియనట్లు నటించారన్నారు. సలాం కుటుంబసభ్యులు వీడియో విడుదల చేసేవరకు వాస్తవాలు బయటకు రాలేదని చెప్పారు. వీడియో విడుదలయ్యాక కూడా పోలీసులు సరైన రీతిలో స్పందించలేదని.. దీనిపై ట్వీట్‌ పెట్టిన తర్వాతే స్పందించారని చంద్రబాబు వెల్లడించారు. ఇలాంటి అసమర్థ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుకు కుటుంబాలు బలైపోతున్నాయనేందుకు ఇదొక ప్రత్యక్ష ఉదాహరణ అని పేర్కొన్నారు.

* బాణసంచా నిషేధం అంశంలో తెలంగాణ ఫైర్‌ వర్క్స్‌ డీలర్స్‌ అసోసియేషన్‌కు స్వల్ప ఊరట లభించింది. బాణసంచాను నిషేధిస్తూ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సుప్రీంకోర్టు సవరించింది. గాలి నాణ్యత సూచీల ఆధారంగా టపాసుల వినియోగంపై ఆంక్షలు వర్తింపజేస్తున్నట్లు స్పష్టం చేసింది. హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాల్‌ చేస్తూ తెలంగాణ ఫైర్‌ వర్క్స్‌ డీలర్స్‌ అసోసియేషన్‌ సుప్రీంకోర్టులో అత్యవసర పిటిషన్‌ దాఖలు చేసింది. దీనిపై జస్టిస్‌ ఖాన్‌విల్కర్‌ నేతృత్వంలోని ద్విసభ్య ధర్మాసం విచారణ చేపట్టింది.

* రాష్ట్రంలోని హిందువుల మనోభావాలను కాపాడటంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ఆరోపించారు. కేసీఆర్‌ ప్రభుత్వం హిందూ పండగలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. కరోనా నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా బానసంచాపై నిషేధం విధించడంపై బండి సంజయ్‌ స్పందిస్తూ ఒక ప్రకటన విడుదల చేశారు. బానసంచా నిషేధంపై రాష్ట్ర ప్రభుత్వం బలంగా తన వాదనలు వినిపించకపోవడం వల్లే ఇలా జరిగిందన్నారు. ప్రతిసారీ హిందువుల పండగలను వివాదాస్పదం చేయడం పరిపాటిగా మారిందని ఆక్షేపించారు.

* కొవిడ్‌ మహమ్మారి వ్యాప్తి దృష్ట్యా వచ్చే మూడు నెలలు రాష్ట్ర ప్రజలు జాగ్రత్తలు తీసుకుంటూ మరింత అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ ప్రజారోగ్య సంచాలకులు డా. శ్రీనివాస్‌ తెలిపారు. హైదరాబాద్‌ కోఠిలోని డైరెక్టర్‌ ఆఫ్‌ పబ్లిక్‌ హెల్త్‌ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. నవంబర్‌ నెలలో వివాహాలు చాలా ఉన్నాయని.. అయితే వచ్చే మూడు నెలల వరకు వివాహాలే కాకుండా ఇతరత్రా కార్యక్రమాలకు కూడా దూరంగా ఉండటం మంచిదని ఆయన సూచించారు. ప్రపంచ వ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్‌పై అనేక పరిశోధనలు కొనసాగుతున్నాయని.. మరో మూడు నెలల్లో వ్యాక్సిన్‌ వస్తుందని ఆశాభావంతో ఉన్నామని చెప్పారు.

* ముఖ్యమంత్రి నీతీశ్‌ కుమార్‌ వెంటే ఉంటామని బిహార్‌ మాజీ ముఖ్యమంత్రి, హిందుస్థానీ అవామ్‌ మోర్చా (హెచ్‌ఏఎం) అధ్యక్షుడు జీతన్‌రాం మాంఝీ స్పష్టం చేశారు. గతంలోనూ ఆయనతోనే ఉన్నామని, ఇకపై కూడా ఆయనతోనే ఉంటామని శుక్రవారం పేర్కొన్నారు. ‘ఒక విషయాన్ని స్పష్టం చేయాలనుకుంటున్నాం. ఎన్‌డీఏతోనే ఉంటాం. ముఖ్యమంత్రి నీతీశ్‌కుమార్‌ అధ్యక్షతనే హెచ్‌ఏఎం ఈ ఎన్నికల్లో పోటీచేసినట్లు మా నేత జీతన్‌రాం మాంఝీ గతంలోనే పేర్కొన్నారు. మేము నీతీశ్‌ వెంటే ఉన్నాం. ఆయన వెంటే ఉంటాం’ అని పార్టీ నేతలు వెల్లడించారు.

* కర్ణాటకలో ఓ సంస్థ నిర్వహించిన సీరో సర్వే ఆసక్తికర విషయాన్ని వెల్లడించింది. రాష్ట్రంలో దాదాపు సగం మంది ప్రజలు ఆగస్టు నాటికే కొవిడ్‌-19 బారిన పడి ఉంటారని తేల్చింది. ఐడీఎఫ్‌సీ ఇన్‌స్టిట్యూట్‌ అనే సంస్థ జూన్‌ 15 నుంచి ఆగస్టు 29 మధ్య ఈ సర్వే నిర్వహించింది. ఈ అధ్యయనం ఫలితాల్ని ఇంకా అధికారికంగా ప్రచురించాల్సి ఉంది. యాంటీబాడీ పరీక్షలతో పాటు ఆర్‌టీ-పీసీఆర్‌ పీరక్షా విధానాన్ని అధ్యయనంలో వినియోగించారు. మొత్తం 20 జిల్లాల్లో 9717 కుటుంబాల నుంచి నమూనాలను సేకరించారు.

* అధికార మార్పిడికి ససేమిరా అంటున్న ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ వ్యక్తిగత అభిప్రాయాలతో, వ్యవహార శైలితో తమకు సంబంధం లేదని.. ఆ పదవికి ఎన్నికైన జో బైడెన్‌ ప్రకటించారు. అధికార మార్పిడి ప్రక్రియను ఇప్పటికే ప్రారంభించామని ఆయన స్పష్టం చేశారు. జనవరి 20న అధికారాన్ని చేపట్టడానికి అనువుగా ఏర్పాట్లు చేసుకొంటున్నారు. ఈ నేపథ్యంలో బిడెన్‌ ప్రభుత్వ యంత్రాంగంలో తాజాగా మరో ముగ్గురు భారతీయ అమెరికన్లకు కీలక స్థానాలు దక్కాయి. అంతేకాకుండా.. వివిధ ఏజన్సీ రివ్యూ టీమ్స్‌ (ఏఆర్‌టీ) సమీక్షా బృందాల సభ్యులుగా ఇరవై మందికి పైగా భారతీయ అమెరికన్లను కాబోయే అధ్యక్షుడు నియమించినట్టు తెలిసింది.

* వచ్చే ఏడాది ఐపీఎల్లో చెన్నై కెప్టెన్‌ మహేంద్రసింగ్‌ ధోనీ జట్టు పగ్గాలు ఫా డుప్లెసిస్‌‌కు అప్పగించి అతడి సారథ్యంలో కొనసాగుతాడని టీమ్‌ఇండియా బ్యాటింగ్‌ కోచ్‌ సంజయ్‌ బంగర్‌ అభిప్రాయపడ్డాడు. తాజాగా ఇర్ఫాన్‌ పఠాన్‌తో కలిసి ‘క్రికెట్‌ కనెక్టెడ్’‌ కార్యక్రమంలో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశాడు. తర్వాతి సీజన్‌లో ధోనీ కెప్టెన్సీ బాధ్యతలు ఎవరికైనా అప్పగిస్తాడా అని అడిగిన ప్రశ్నకు బంగర్‌ ఇలా స్పందించాడు. అంతకుముందు పఠాన్‌ స్పందిస్తూ ఇప్పటికైతే తానేమీ అలాంటివి ఊహించడం లేదని స్పష్టం చేశాడు.

* త్వరలోనే అందుబాటులోకి రాగలదని భావిస్తున్న కొవిడ్‌-19 వ్యాక్సిన్‌ను నిల్వ చేసేందుకు యోగి ఆదిత్యనాథ్‌ నేతృత్వంలోని ఉత్తర్‌ ప్రదేశ్‌ ప్రభుత్వం అప్పుడే సన్నద్ధమౌతోంది. రాష్ట్ర ప్రజలందరికీ కొవిడ్‌ వ్యాక్సిన్‌ను ఉచితంగా అందిచనున్నట్టు గతంలో ప్రకటించిన సంగతి తెలిసిందే. తమ రాష్ట్రానికి కరోనా టీకా ఎంత పరిమాణంలో లభించేదీ కచ్చితంగా తెలీదని.. అయితే దాని నిల్వకు తగిన మౌలిక సదుపాయాలు సిద్ధంగా ఉండటం అత్యవసరమని ఆ రాష్ట్ర ఇమ్యూనైజేషన్‌ అధికారి డాక్టర్‌ ఏపీ చతుర్వేది అభిప్రాయపడ్డారు.

* మూరత్‌ ట్రేడింగ్‌ ముందు దేశీయ మార్కెట్లు స్వల్ప లాభాలతో ముగిశాయి. అంతర్జాతీయ ప్రతికూల సంకేతాలు, లాభాల స్వీకరణతో భారీ నష్టాలతో ప్రారంభమైన సూచీలు ఆ తర్వాత క్రమంగా కోలుకున్నాయి. బ్యాంకింగ్‌ షేర్లు అండతో లాభాలను దక్కించుకున్నాయి. బ్యాంకింగ్‌ షేర్లలో కొనుగోళ్ల అండతో లాభాల్లోకి వచ్చాయి. ట్రేడింగ్‌ ముగిసే సమయానికి సెన్సెక్స్‌ 86 పాయింట్ల లాభంతో 43,443 వద్ద స్థిరపడింది. నిఫ్టీ స్వల్పంగా 29 పాయింట్లు లాభపడి 12,720 వద్ద ముగిసింది.

* అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రాటిక్‌ పార్టీ అభ్యర్థి జో బైడెన్‌ గెలుపును ఎట్టకేలకు చైనా గుర్తించింది. దాదాపు వారం రోజులు ఆచితూచి వ్యవహరించిన డ్రాగన్‌ మౌనం వీడింది. బైడెన్‌, కమలా హారిస్‌కు చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి వాంగ్‌ వెన్‌బిన్‌ శుభాకాంక్షలు తెలిపారు. ‘‘అమెరికా ప్రజల తీర్పును మేం గౌరవిస్తున్నాం. బైడెన్‌, కమలా హారిస్‌కు మా శుభాకాంక్షలు. ఎన్నికల ఫలితాల్ని అమెరికా చట్టాల ప్రకారం ధ్రువీకరిస్తారని భావిస్తున్నాం’’ అని రోజువారీ విలేకరుల సమావేశంలో వెన్‌బిన్‌ వ్యాఖ్యానించారు.