Devotional

దీపావళి అంటే లక్ష్మీదేవి ఆరాధన

దీపావళి అంటే లక్ష్మీదేవి ఆరాధన

దీపావళి అంటే దీపాలు వెలిగించడం, పటాసులు పేల్చడం మాత్రమే కాదు. లక్ష్మీదేవి ఆరాధనకు దివ్యమైన సమయం కూడా. అందుకే, ప్రతి ఒక్కరూ ప్రత్యేకించి వ్యాపారస్తులంతా ఈ పండుగ వేళ ధనలక్ష్మీపూజ విధిగా జరుపుకొంటారు. సమస్త సృష్టికి స్థితికారుడు (పరిపాలకుడు) శ్రీమహావిష్ణువు అయితే, ఆయనను నడిపించే ఆ పరమాత్మ శక్తికి అసలైన చైతన్యాన్నిచ్చేది ఈ అమ్మవారు మాత్రమే. ఆమెనే లేకపోతే అసలు ఆయనే కాదు, మొత్తం జగత్తుకే చలనం ఉండదు. ‘ధనమూల మిదమ్‌ జగత్‌’ అంటే ఇదే మరి. యావత్‌ చరాచర విశ్వానికంతటికీ మూలమైన పరాశక్తి ప్రధానాంశలలో తానొకరు. కనుక, ఆమె అనుగ్రహం ఉంటే అన్నీ ఉన్నట్లే. ఒక్క ‘లక్ష్మీకటాక్షం’ లభిస్తే జీవితానికి కావలసినవన్నీ సిద్ధించినట్లే. కాకపోతే, ఆమె నిజ తత్వాన్ని గ్రహించి, ఆ మేరకు మానవీయ జీవనం గడపాలి.

**లక్ష్మీ కటాక్షం ఎప్పుడు, ఎవరికి?
లక్ష్మీ కటాక్షం అందరికీ అంత త్వరగా సిద్ధించదని వేదజ్ఞానులు అంటారు. దీనికి ఆమెను ఆరాధించే పద్ధతుల్లోని లోపాలే కారణమని వారంటారు. సశాస్త్రీయ పూజావిధానంతోపాటు భక్తి-శ్రద్ధ తప్పనిసరి. సంపదలు వున్నవారికే మరింత సిరి సమకూరుతుందని కూడా చాలామంది అంటుంటారు. ఇది నిజం కూడా. ‘లేనివారు ఎప్పటికీ లేనివారుగానే ఉండాలా?’ అన్నది మరొక పెద్ద ఫిర్యాదు. ఇలాంటి సందేహాలన్నిటికీ ‘ఆమె తత్త్వాన్ని తెలుసుకొని ఆరాధించడమే’ సమాధానంగా సనాతన ఆధ్యాత్మిక వేత్తలు సమాధానమిస్తారు. దీపావళి పండుగ వేళ మహాలక్ష్మి పని కట్టుకొని ఊరూరు, ఇల్లిల్లూ దర్శిస్తుందని కనుక, ఆమె కటాక్షసిద్ధికి ఇదొక అద్భుత సమయమనీ వారంటారు.

*భారతీయ పౌరాణిక సాహిత్యంలోని దేవతామూర్తులందరిలోకీ లక్ష్మీదేవిది అత్యంత విలక్షణమైన, వైభవోపేతమైన స్థానం. సకల సంతోషాలు, సిరిసంపదలు, సుఖసౌభాగ్యాలకు అన్నిటికీ ఆమెనే అధినేత్రి. కేవలం ధనధాన్యాలలోనేకాదు, కళలు, నైపుణ్యాలు, ప్రతిభా పాటవాలు అన్నిటిలోనూ అంతర్గతంగా ఆమె నెలకొని ఉంటుంది. శక్తి, మేధస్సు (బలం- బుద్ధి) రెండూ ఒక్కచోట ఉండవన్న మాట అబద్ధమని లక్ష్మీదేవి తత్త్వాన్నిబట్టి అర్థమవుతుంది. ‘ఆడది అవసరాన్నిబట్టి ఎంతటి పరాశక్తిగా అయినా మారగలదని ‘నరకాసుర వధ’తో ఆమె అవతారం నిరూపించింది. అసలు, ఐశ్వర్యానందంలో గడపవలసిన లక్ష్మీదేవి(సత్యభామ)కి ఎందుకీ పోరాటం? అంతటి విక్రమ పరాక్రమ ప్రదర్శనకు దారితీసిన పరిస్థితులేమిటి? ‘నరకాసురుని పుట్టుక, ఇతివృత్తంలోని పరమార్థాన్ని గ్రహిస్తే ఈ ప్రశ్నలకు సమాధానం మనకు దొరుకుతుంది. ఆమె గొప్పతనం, భక్తవాత్సల్యం, దయార్ద్రత, శక్తి సామర్థ్యాలు తెలుసుకోవడానికి ఈ దీపావళి పర్వదినాన్ని మించిన శుభసందర్భం మరొకటి ఉండదు.

*దేవతల తత్త్వాన్నిబట్టే వారి ఆరాధనా పద్ధతి, శైలి, విధివిధానాలు, భక్తి, పూజాపురస్కారాలు అన్నీ ఆధారపడి ఉంటాయి. ఈశ్వరునికి అభిషేకం చేస్తే సరిపోతుంది. ఎందుకంటే, మహాగరళాన్ని భద్రపరచిన ఆయన కంఠంలోని అగ్నిని నిరంతరం చల్లబరచుకోవలసి ఉంటుంది కనుక. గణపతికి గరిక సమర్పిస్తే చాలు. కారణం, ఆయన ప్రకృతి దేవుడు. ఇదే పంథాలో లక్ష్మీదేవికి ‘బంగారు హారతి’ పట్టినా తక్కువే. ఆమె ఆరాధనకు ఎంత వెచ్చిస్తే అంతకు అనేక రెట్లు మనకు తిరిగి ఇస్తుందన్న విశ్వాసం హైందవులది. అలాగని, ‘పేదవారిని ఆమె కరుణించదా?’ అంటే, ‘అలాంటిదేమీ లేదని’ వేదజ్ఞానులు అంటారు. ఉన్నంతలో లోభత్వాన్ని చూపించవద్దని భారతీయ శాస్ర్తాలు చెప్తాయి. ఉండికూడా లేనట్టు నటించడం పెద్ద ‘పాపం’. ‘ఎంత చెట్టుకు అంత గాలి’ అన్నంత సహజసిద్ధంగా మన ఆరాధనా దృష్టి ఉండాలి. జీవితంలోనే కాదు, జీవనంలోనూ మానవీయ విలువలకు ప్రాధాన్యం ఇవ్వాలి. జీవకారుణ్యాన్ని కురిపించాలి. దయార్ద్ర హృదయులం కావాలి. ఇంతటి ‘స్థిరత్వ చింతన’ను సిద్ధింపజేసుకోవడానికి లోకనీతి అవసరం. ‘మనం సంపాదిస్తున్నదంతా భగవత్‌ ప్రసాదమే’ అన్న ఆధ్యాత్మిక జ్ఞానం, స్పృహ, ధర్మచింతన దానితోనే లభిస్తుంది. ఇది ‘సమున్నత స్థితప్రజ్ఞత’కు మనల్ని చేర్చడానికి తొలిమెట్టుగా ఉపయోగపడుతుంది. అందుకే, మన సంపాదనలోంచి కొంత మొత్తాన్ని దైవకార్యాలకు, దానధర్మాలకు, సమాజ హితానికి వెచ్చించాలని భారతీయ ధార్మిక సాహిత్యం ప్రబోధిస్తున్నది. మహాలక్ష్మిది నిజంగా మహోన్నత వైభవం. ఆమె జన్మవృత్తాంతం ఒక్కటి చాలు, తన అఖండ తత్త్వాన్ని వెల్లడించేందుకు! భాగవతాది పురాణాల ప్రకారం సమస్త ఐశ్వర్యాలకూ ఆమెనే నిలువెత్తు ప్రతిరూపం.

*క్షీరసాగర మథనంలోంచి ఉద్భవించిన అద్భుతాలలో లక్ష్మీదేవి ‘పుట్టుక’ ఒకటి. పాలసముద్రం చిలుకుతుంటే వచ్చిన మీగడతో బ్రహ్మదేవుడు ఆమె శరీరాన్ని చేశాడంటే ఆ మిసిమితనం, పసిడివర్ణ కాంతి వర్ణనాతీతం. పుట్టిన వెంటనే ఆ మహాతల్లికి సర్వసుగంధ ద్రవ్యాలతో దేవతాస్త్రీలు మంగళస్నానం చేయించారు. సముద్రుడు దివ్యమైన పట్టువస్ర్తాలను, వరుణుడు వైజయంతిమాలను, విశ్వకర్మ సువర్ణ అలంకారాలన్నిటినీ ఆమెకు బహుకరిస్తే, తనను వరించి వచ్చిన మహావిష్ణువు కౌస్తుభమణితోపాటు ఏకంగా తన వక్షస్థల పీఠాన్నే ఇచ్చేశాడు. వేదాలు ‘లక్ష్యాయితి లక్ష్మి’ అన్నాయి. ‘మానవాళిని సలక్షణంగా ఉద్ధరించే లక్ష్యం కలది’ అని దీనర్థం. ఇంత గొప్పనైన, అత్యంతనంత సుసంపన్నమై ‘సిరిదేవత’ కాబట్టే, మానవులతోపాటు దేవతలూ ఆమెకే పట్టాభిషేకం చేస్తున్నారు.

*సృష్టి మొదలైనప్పటి నుంచీ విశ్వపాలనలో విష్ణువుకు తోడుగా ఉండటమే లక్ష్మీదేవి అవతార లక్ష్యంగా ‘దేవీభాగవతం’ ఉద్ఘాటించింది. ఆమెనే లేకపోతే అంతటి దేవదేవుడు కూడా శక్తిహీనుడవుతాడనీ ఆ ధర్మగ్రంథం పేర్కొన్నది. పార్వతీ పరమేశ్వరుల మాదిరిగా లక్ష్మీనారాయణులు కూడా అర్ధనారీ నారాయణులు. భూదేవిని కూడా మహాలక్ష్మి అంశగానే మన శాస్ర్తాలు చెప్పాయి. ‘శ్రీసూక్తం’ ఆమెను ‘సర్వశుభ లక్షణ నిలయ, సకల సంపత్‌ ప్రదాయిని’గా అభివర్ణించింది. ఆమె బంగారు వర్ణం కలదని (హిరణ్యవర్ణాం), స్వర్ణాభరణాలు ధరించి, వెన్నెలవలె మెరిసేదని, చిరునవ్వులు చిందిస్తుందని, సుఖసంతోషాలకు, అద్భుత పరమానందానికి ఆమెనే చిరునామ అని ఆ లక్ష్మీస్తుతి ప్రామాణికంగా ప్రకటించింది.

*సకల దారిద్య్రాలను నశింపజేసే దేవదేవత మహాలక్ష్మినే అని హైందవ మతగ్రంథాలన్నీ ముక్తకంఠంతో పేర్కొన్నాయి. ఆమెను అపూర్వ సౌందర్యమూర్తిగానూ మత్స్య, విష్ణు, విష్ణుధర్మోత్తర పురాణాలు కీర్తించాయి. ఇంతేకాదు, ఆమెనే అద్భుత శక్తి సమన్విత కూడా. మహాపరాక్రమవంతురాలు. నరకాసురుని వధనే ఇందుకు నిలువెత్తు ఉదాహరణ. ధర్మపరులలో, సత్యవంతులలో, సలక్షణ సనాతన సత్సంప్రదాయ గృహాలలోను, మంగళకరమైన వస్తుసముదాయంలోనూ.. మహాలక్ష్మి స్థిరంగా కొలువై ఉంటుందని భారతీయ పౌరాణిక శాస్ర్తాలు నిర్ధారించాయి. ఇంకా యజ్ఞవాటికలు, పంటపొలాలు, తులసి, ఉసిరి వంటి పవిత్ర చెట్లలోనూ, ప్రదేశాలలోనూ ఆమెను మన మనోదృష్టితో చక్కగా దర్శించవచ్చునని వేదజ్ఞానులు చెప్తారు. లక్ష్మీదేవిని కేవలం ధనరూపంలోనే చూడరాదు. సర్వసంపదలకు అధినేత్రిగా మాత్రమే ఆమెను పరిమితం చేస్తే దాన్ని మించిన అజ్ఞానం మరొకటి ఉండదు. సకల ఐశ్వర్యాలూ ఆమె అధీనంలోనే ఉంటాయి. అందుకే, ఆమె అష్టలక్ష్మీ (ఆదిలక్ష్మి, ధైర్యలక్ష్మి, ధాన్యలక్ష్మి, గజలక్ష్మి, సంతానలక్ష్మి, విజయలక్ష్మి, విద్యాలక్ష్మి, ధనలక్ష్మి) మహావతారం!