Sports

IPL జట్లు పెరిగితే ఇండియా క్రికెట్‌కు మేలు

Rahul Dravid Shares His Opinion On IPL Expansion

పోటీ, నాణ్యత లోపించకుండా ఐపీఎల్‌లో జట్ల సంఖ్య మరిన్ని పెరుగుతాయని జాతీయ క్రికెట్‌ అకాడమీ డైరెక్టర్‌, టీమిండియా మాజీ కెప్టెన్ రాహుల్ ద్రవిడ్‌ అన్నాడు. ప్రతిభ పరంగా చూస్తే లీగ్‌ విస్తరణకు సిద్ధంగా ఉందని తెలిపాడు. కొత్త జట్ల రాకతో అవకాశాలు కోసం ఎదురుచూస్తున్న నైపుణ్యమున్న ఆటగాళ్లకు లాభం చేకూరుతుందని పేర్కొన్నాడు. రాజస్థాన్ జట్టు సహయజమాని బడాలే రచించిన ‘ఎ న్యూ ఇన్నింగ్స్‌’ పుస్తకాన్ని వర్చువల్‌గా ఆవిష్కరిస్తూ ద్రవిడ్‌ మాట్లాడాడు. ‘‘గతంలో రంజీ ట్రోఫీకి ఎంపిక అవ్వాలంటే రాష్ట్ర సంఘూలపై ఆధారపడాల్సి ఉండేది. ప్రస్తుతం ఆటగాళ్ల ప్రతిభ తెలియజేయడానికి రాష్ట్ర సంఘాలే మార్గం కాదు. అంతేగాక లీగ్‌ వల్ల యువకులకు ఎంతో మేలు కలుగుతుంది. కోచ్‌లుగా యువ ఆటగాళ్లకు వాళ్ల ప్రయాణంలో సాయం చేస్తాం. కానీ ఆటలో ఎదుగుదల అనుభవంతోనే వస్తుంది. దేవదత్‌ పడిక్కల్‌ను చూడండి. విరాట్ కోహ్లీతో కలిసి బ్యాటింగ్‌ చేస్తూ లేదా డివిలియర్స్‌ను చూస్తూ మెరుగవుతున్నాడు. అలాగే నటరాజన్ కూడా. యార్కర్లపై ఎంతో శ్రమించాడు. ఇప్పుడు ఆ ఒక్క నైపుణ్యంతోనే భారత జట్టులో చోటు సంపాదించాడు’’ అని ద్రవిడ్‌ వెల్లడించాడు.