Agriculture

ఏపీ జలవనరుల విస్తరణపై తెలంగాణా ఫిర్యాదు

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కొన్ని కాలువలను ఆధునికీకరించడం, సామర్థ్యం పెంచడం వంటి పనులు చేపడుతోందని, వాటిని నిలువరించడానికి చర్యలు తీసుకోవాలని తెలంగాణ ప్రభుత్వం కృష్ణా నదీ యాజమాన్య బోర్డును కోరింది. ఈ మేరకు తెలంగాణ నీటిపారుదల శాఖ ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌ మురళీధర్‌ కృష్ణా నదీ యాజమాన్యబోర్డు కార్యదర్శికి తాజాగా లేఖ రాశారు. లేఖలో ఏమని పేర్కొన్నారంటే…
* పోతిరెడ్డిపాడు నుంచి ఆమోదం లేకుండానే 35వేల క్యూసెక్కుల నీటిని అదనంగా తీసుకొనేలా ఎస్కేప్‌ ఛానల్‌, నిప్పులవాగు, గాలేరు, కుందూ నది విస్తరణ పనులు చేపట్టేలా ఏపీ జారీ చేసిన ఉత్తర్వుపై చర్య తీసుకోవాలని ఈ ఏడాది ఆగస్టులో లేఖ రాశాం. ఇప్పుడు మళ్లీ కొత్త పనులను చేపట్టింది.
* కర్నూలు జిల్లాలో తుంగభద్ర నది కుడివైపు గుండ్రేవుల వద్ద పులకుర్తి ఎత్తిపోతల పథకం సర్వే మొదలుకొని నిర్మాణం, 15 సంవత్సరాల నిర్వహణకు గత నెల 16న ఏపీ ఉత్తర్వు జారీ చేసింది. తుంగభద్ర నీరు శ్రీశైలానికి రాకుండా ఈ పథకం ద్వారా మళ్లించనున్నారు.
* గుంటూరు జిల్లా దుర్గి వద్ద నాగార్జునసాగర్‌ కుడికాలువపై బుగ్గవాగు బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌ సామర్థ్యాన్ని 3.463 టీఎంసీల నుంచి ఏడు టీఎంసీలకు పెంచేందుకు పరిశీలన, డీపీఆర్‌ తయారీకి గత నెల 20న మరో ఉత్తర్వును ఆంధ్రప్రదేశ్‌ జారీ చేసింది. దీనివల్ల కేటాయించిన నీటికంటే ఎక్కువ వాడుకొనే అవకాశం ఉంది.
* నాగార్జునసాగర్‌ కుడి, ఎడమ కాలువల కింద ఆంధ్రప్రదేశ్‌కు చేసిన కేటాయింపులపై ఇప్పటికే తెలంగాణ బ్రిజేశ్‌కుమార్‌ ట్రైబ్యునల్‌ దృష్టికి తీసుకెళ్లింది. నాగార్జునసాగర్‌ కుడి కాలువ అవసరాలకు గోదావరి జలాలను వినియోగించుకోవచ్చు. పై ప్రాజెక్టులన్నీ ఆంధ్రప్రదేశ్‌ 2014 తర్వాత బోర్డు, అపెక్స్‌ కౌన్సిల్‌ అనుమతి లేకుండా, పునర్విభజన చట్టానికి వ్యతిరేకంగా చేపడుతుంది. ఈ పనులను నిలిపివేసేలా బోర్డు చర్యలు తీసుకోవాలి.