Sports

అజిత్ అగార్కార్‌కు కొత్త పదవి

అజిత్ అగార్కార్‌కు కొత్త పదవి

సెలక్టర్ల ఎంపికకు సంబంధించి బీసీసీఐ విడుదల చేసిన నోటిఫికేషన్‌ గడువు నిన్నటితో ముగిసింది. ఐదుగురు సభ్యుల సెలక‌్షన్‌ కమిటీలో ఇప్పటికే సౌత్‌జోన్‌ నుంచి ఖాళీ అయిన ఎమ్మెస్కే ప్రసాద్‌ (ఆంధ్రప్రదేశ్‌) స్థానంలో సునీల్‌ జోషి (కర్ణాటక), సెంట్రల్‌ జోన్‌లో గగన్‌ ఖోడా స్థానంలో హర్వీందర్‌ సింగ్‌లను మదన్‌లాల్‌ నేతృత్వంలోని క్రికెట్‌ అడ్వైజరీ కమిటీ (సీఏసీ) నియమించింది. మిగతా ముగ్గురు సభ్యుల ఎంపికకు కసరత్తు చేస్తోంది. దరఖాస్తుల స్క్రూటినీ అయిన వెంటనే మదన్‌లాల్‌ నేతృత్వంలోని క్రికెట్‌ అడ్వైజరీ కమిటీ (సీఏసీ) అర్హత గల అభ్యర్థుల్ని ఇంటర్వ్యూ చేస్తుంది. అనంతరం ఈ సీనియర్‌ సెలక‌్షన్‌ కమిటీ భారత్‌తో పాటు భారత్‌ ‘ఎ’, దులీప్‌ ట్రోఫీ, దేవధర్‌ ట్రోఫీ, చాలెంజర్‌ ట్రోఫీ, రెస్టాఫ్‌ ఇండియా జట్లను ఎంపిక చేస్తుంది.

దరఖాస్తు చేసుకున్నవారిలో అజిత్‌ అగార్కర్‌, చేతన్‌ శర్మ, మహిందర్‌ సింగ్‌, ఎస్‌ఎస్‌ దాస్‌లలో ముగ్గురు సెలెక్టర్లుగా ఎంపికవడం ఖాయంగా తెలుస్తోంది. ఇక అజిత్‌ అగార్కర్‌, మహిందర్‌ సింగ్‌ గత మార్చిలోనే అప్లై చేయగా.. వారికి అవకాశం రాలేదు. ఆ దరఖాస్తులనే సీఏసీ మళ్లీ పరిగణించనుంది. ఇక అంతర్జాతీయ క్రికెట్‌ ఆడిన అనుభవం ఉన్న అగార్కర్‌ చీఫ్‌ సెలక్టర్‌గా సరిపోతాడని కొందరు క్రీడా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. దాంతోపాటు మాజీ పేస్‌ బౌలర్‌ దేవాశిష్‌ మహంతిని జూనియర్‌ సెలక‌్షన్‌ కమిటీ చైర్మన్‌గా నియమించాలని చెప్తున్నారు. గత సెలక‌్షన్‌ కమిటీ భర్తీ ప్రక్రియలో జోన్లవారీగా సభ్యులను ఎంపిక చేసుకుని చరిత్రాత్మక నిర్ణయం తీసుకున్న బీసీసీఐ.. తాజాగా ఆ సంప్రదాయాన్ని ఫాలో అయ్యే అవకాశాలు కనిపించడం లేదు.