Editorials

నోరుజారిన జాక్‌మా…36 బిలియన్లు మాయం

చైనాలో ఎంత పెద్ద వ్యాపారవేత్త అయినా సరే.. చైనా కమ్యూనిస్టు పార్టీ పడగనీడలో ఉంటున్నామన్న విషయం పొరపాటున కూడా మర్చిపోకూడదు.. గ్రహపాటున మర్చిపోయి.. నోరుజారి ఏమైనా వ్యాఖ్యలు చేస్తే.. ఇక వారి పని అంతే..! చైనాలోని వ్యవస్థలన్నీ ఆ వ్యాపారవేత్త వెనుకపడతాయి.. ఉన్నవీ లేనివీ లెక్కలు అడుగుతాయి.. బిజినెస్‌ప్లాన్లను తొక్కిపెడతాయి.. సదరు వ్యాపారవేత్తకు జరిగిన శాస్తిని చూసి మరెవరూ నోరు మెదపకుండా చేస్తాయి. ఇలాంటి పరిస్థితే ఓ ప్రపంచ కుబేరుడికి వచ్చింది. అయనే జాక్‌మా..! ఇప్పుడు ఆయన నేతృత్వంలోని యాంట్‌గ్రూప్‌ ఐపీవోను చైనా తొక్కిపట్టింది.

అక్టోబర్‌ 24న చైనాలో జరిగిన ‘ది బండ్‌ సమిట్‌’ కార్యక్రమంలో జాక్‌మా ప్రసంగించారు. ఈ కార్యక్రమానికి చైనాకు చెందిన దిగ్గజ బ్యాంకర్లు కూడా హాజరయ్యారు. జాక్‌మా తన ప్రసంగంలో చైనా ఆర్థిక వ్యవస్థలోని లోపాలను ఉతికి ఆరేశారు. చైనా బ్యాంకులు ‘తాకట్టు దుకాణాల’ మనస్తత్వాన్ని వీడి విస్తృతంగా ఆలోచించాలని హితవు పలికారు. సంప్రదాయ బద్ధంగా వస్తున్న ఆర్థిక విధానాల్లో సమూల మార్పులు అవసరమని తెలిపారు. చైనాలో సచేతనమైన ఆర్థిక విధానాలు లేవని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇవి రోగికి తప్పుడు ఔషధాలు ఇచ్చినట్లే పనిచేస్తామని ఎద్దేవా చేశారు. ‘అల్జీమర్స్‌ లక్షణాలు.. పోలియో లక్షణాలు ఒకేలా ఉండవచ్చేమో.. కానీ, అవి పూర్తిగా వేర్వేరు వ్యాధులు. అలాంటప్పుడు పిల్లలు పోలియో ఔషధం కింద అల్జీమర్స్‌ మందులు వాడితే కొత్త సమస్యలు వస్తాయి’’ అని జాక్‌మా వ్యాఖ్యానించారు. చైనాకు బాసెల్‌ ఒప్పంద నిబంధనలు ఏమాత్రం సరిపడవని ఆయన పేర్కొన్నారు. ఇవేకాదు చాలా అంశాల్లో చైనా లోపాలను ఆయన ఎత్తి చూపారు. ఈ వ్యాఖ్యలు నేరుగా అధ్యక్షుడు షీజిన్‌పింగ్‌ను తాకాయి.

చైనా ఆర్థిక వ్యవస్థలోని లోపాలను బహిరంగ వేదికపై చెప్పడంతో షీ జిన్‌పింగ్‌కు ఇబ్బందికరంగా మారింది. జాక్‌మాకు గుణపాఠం నేర్పాలని నిర్ణయించారు. దీంతో యాంట్‌గ్రూప్‌ ఐపీవోలో లోపాలను వెతికిపట్టాలని నియంత్రణ సంస్థలను ఆయన ఆదేశించారు. ఈ విషయాన్ని నవంబర్‌ 12న వాల్‌స్ట్రీట్‌ జనరల్‌ రిపోర్టు చేసింది. దీంతో ఐపీవోకు వెళ్లడానికి కొద్ది రోజుల ముందే చైనా అధికారులు కొన్ని నిబంధనలను ఉల్లంఘించారనే కారణం చూపుతూ ఐపీవోను నిలిపివేశారు. ఈ ఐపీవో రూపంలో 27 బిలియన్‌ డాలర్ల నుంచి దాదాపు 36 బిలియన్‌ డాలర్ల మధ్యలో సమీకరించాలన్న యాంట్‌గ్రూప్‌ ఆశలపై నీళ్లు జల్లారు. ఈ ఐపీవో ముగిస్తే కంపెనీ విలువ కూడా 350 బిలియన్‌ డాలర్ల నుంచి 450 బిలియన్‌ డాలర్ల మధ్యకు చేరుతుంది. షేర్‌ ధరను కూడా నిర్ణయించాక.. ఐపీవోను అడ్డుకోవడం జాక్‌మాను షాక్‌కు గురిచేసింది.

చైనా దిగ్గజ సంస్థ అలీబాబా గ్రూప్‌ అధినేత జాక్‌మా యాంట్‌ గ్రూప్‌ను స్థాపించారు. దీనిలో యాంట్‌ ఫైనాన్షియల్‌, అలీపే సంస్థలు ఉంటాయి. అలీపే సంస్థ పేమెంట్‌ సేవలను అందిస్తోంది. ఇక యాంట్‌ ఫైనాన్షియల్‌ సంస్థ ఫైనాన్షియల్‌, టెక్నాలజీ, పేమెంట్‌ ప్రాసెసర్‌ వంటి సేవలను అందుబాటులోకి తెచ్చింది. అలీపేకు దీనిని మాతృసంస్థగా పేర్కొంటారు. ప్రపంచంలోనే అత్యంత విలువైన స్టార్టప్‌గా ఇది రికార్డు సృష్టించింది. దీని విలువ 150 బిలియన్‌ డాలర్లు ఉంటుందని అంచనా. చైనా జనాభాలో మూడోవంతు మంది దీని కస్టమర్లే. దీనిలో 33శాతం వాటాలు అలీబాబా గ్రూపునకు ఉన్నాయి. దీనిని బిలియనీర్‌ జాక్‌మా నియంత్రిస్తున్నారు.

కొన్నేళ్ల క్రితం చైనా ప్రభుత్వం ఉదాసీనంగా ఉన్నప్పుడు జాక్‌మా వాడుకున్న స్వేచ్ఛ ఇప్పుడు అడ్డంకిగా మారింది. ఐదేళ్లక్రితం యాంట్‌ పేమెంట్స్‌ అండ్‌ వెల్త్‌ మేనేజ్‌మెంట్‌ను క్రమబద్ధీకరించాలని పీబీవోసీ ప్రయత్నించింది. కానీ, అప్పట్లో ఆ నిబంధనల విషయంలో జాక్‌మా సంతృప్తి పడలేదు. ఆ తర్వాత పీబీవోసీ కూడా ఆ నిబంధనల విషయంలో చూసీచూడనట్లు వదిలేసింది. తాము మాత్రం నిబంధనలు ఉల్లంఘించలేదని యాంట్‌ ప్రతినిధి రాయిటార్స్‌కు వెల్లడించారు. ఇందుకు ఓ కారణం ఉంది.. టీచర్‌ నుంచి వ్యాపారవేత్త స్థాయికి ఎదిగిన జాక్‌మా విజయం, కీర్తి చైనాకు అంతర్జాతీయంగా ఉపయోగపడతాయి. ప్రభుత్వంతో సఖ్యతగా ఉన్నప్పుడు జాక్‌మా వ్యాపార దక్షతకు కితాబులు అందాయి. ఆయన ప్రభుత్వ వ్యతిరేక వ్యాఖ్యలు చేశాక పరిస్థితి ప్రతికూలంగా మారింది. సూక్ష్మరుణదాతలు బ్యాంకులతో కలిసి ఇచ్చే రుణాల్లో ఉండాల్సిన శాతం విషయంలో యాంట్‌ గ్రూప్‌ను అక్కడి నియంత్రణ సంస్థలు ప్రశ్నిస్తున్నాయి.

జాక్‌మా సహా కంపెనీ సీనియర్‌ అధికారులకు నోటీసులు జారీ చేశారు. హాంగ్‌కాంగ్, షాంఘై మార్కెట్లలో ఈ ఐపీవోను నిలిపివేశారు. దీంతో కనీసం ఆరు నెలల పాటు ఐపీవో మార్కెట్లోకి వచ్చే అవకాశం లేదని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ యాంట్‌ను టెక్నాలజీ ఆధారిత కంపెనీగా మార్కెట్లోకి తీసుకురావాలనుకున్నారు. అప్పుడు కంపెనీకి అత్యధిక విలువ లభించేది. కానీ, ఇప్పుడు నియంత్రణ సంస్థల చట్రంలో బ్యాంక్‌ వలే దానిని బిగించడంతో దాని లాభాల్లో తగ్గుదల వచ్చే అవకాశం ఉండటంతో ఇన్వెస్టర్లు అంత ఆసక్తి చూపకపోవచ్చు.

నవంబర్‌ మొదటి వారంలో ఐపీవోను నిలిపివేయడంతో అలీబాబా షేర్లు భారీగా పతనం అయ్యాయి. దీంతో అలీపే వంటి వ్యాపారం చేసే వియ్‌ఛాట్‌ (టెన్సెంట్‌) షేర్లు భారీగా కుంగాయి. ఈ రెండు కంపెనీలు కోల్పోయిన మార్కెట్‌ విలువ 290 బిలియన్‌ డాలర్లు ఉంటుందని అంచనా.