Business

ఇండియా మందులు వెనక్కి పంపుతున్న అమెరికా-వాణిజ్యం

ఇండియా మందులు వెనక్కి పంపుతున్న అమెరికా-వాణిజ్యం

* భారతీయ ఔషధ కంపెనీలు అరబిందో ఫార్మా, జైడస్‌, జుబిలెంట్‌, మార్క్‌సాన్స్‌ ఫార్మాలు వివిధ ఔషధాలను అమెరికా విపణి నుంచి వెనక్కి రప్పిస్తున్నట్లు వెల్లడించాయి. అమెరికా ఆహార, ఔషధ నియంత్రణ సంస్థ (యూఎస్‌ఎఫ్‌డీఏ) తాజా నివేదిక దీన్ని ధ్రువీకరించింది. మార్క్‌శాన్స్‌ ఫార్మా డయాబెటిస్‌ ఔషధాన్ని, జైడస్‌ ఫార్మాస్యూటికల్స్‌ కడుపులో ఆమ్లాన్ని తగ్గించేందుకు వాడే ఔషధాన్ని, అరబిందో ఫార్మా (యూఎస్‌ఏ) నొప్పి నివారణ ఔషధాన్ని, జుబిలెంట్‌ క్యాడిస్టా స్కిజోఫ్రీనియా చికిత్సలో వాడే ఔషధాన్ని వెనక్కి రప్పిస్తున్నాయి.

* జీవిత బీమా తీసుకోవాలనుకునే వారు ఎలక్ట్రానిక్‌ పద్ధతిలో తమ సమ్మతి తెలిపేందుకు 2021 మార్చి 31 వరకు గడువు పొడిగిస్తున్నట్లు భారతీయ బీమా అభివృద్ధి, నియంత్రణ ప్రాధికార సంస్థ (ఐఆర్‌డీఏఐ) వెల్లడించింది. కరోనా మహమ్మారి వ్యాప్తితో వ్యాపార కార్యకలాపాలకు ఆటంకం ఏర్పడిన నేపథ్యంలో, గత ఆగస్టులో ప్రయోగాత్మక పద్ధతిన ఐఆర్‌డీఏఐ ఆన్‌లైన్‌ పాలసీలకు అనుమతించింది. ఇందువల్ల పాలసీదార్లు, బీమా సంస్థలకు ఊరట లభించింది. ఇప్పుడు ఆ గడువును మరో 3 నెలల పాటు పొడిగిస్తూ నిర్ణయం తీసుకొంది. జీవిత బీమా పాలసీదార్ల నుంచి వస్తున్న స్పందన, బీమా సంస్థలు అందుకు సన్నద్ధమైన తీరును పరిగణనలోకి తీసుకున్న ఐఆర్‌డీఏఐ తాజాగా అన్ని బీమా ఉత్పత్తులకు ఈ గడువును పెంచుతూ సర్క్యులర్‌ జారీ చేసింది.

* ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో ఓఎన్‌జీసీ నిరాశపరిచింది. జులై-సెప్టెంబరు త్రైమాసికంలో రూ.2,878 కోట్ల స్టాండలోన్‌ నికర లాభాన్ని నమోదు చేసింది. క్రితం ఆర్థిక సంవత్సరం ఇదే సమయంలో సంస్థ ఆర్జించిన నికర లాభం రూ.6,336 కోట్లతో పోలిస్తే ఇది 54.6 శాతం తక్కువ కావడం గమనార్హం. ఆదాయం 31 శాతం క్షీణించి రూ.16,917 కోట్లుగా నమోదైంది. సమీక్షా త్రైమాసికంలో కంపెనీ ఉత్పత్తి చేసిన ముడి చమురుకు ఒక్కో బ్యారెల్‌కు 41.38 డాలర్ల చొప్పున సంపాదించింది. 2019 సెప్టెంబరు త్రైమాసికంలో 60.33 డాలర్లు ఆర్జించింది. అంటే 31.4 శాతం క్షీణత నమోదైంది. సహజ వాయువు ద్వారా ఆర్జన కూడా 1/3 వంతు క్షీణించి 1 మిలియన్‌ బ్రిటీష్‌ థర్మల్‌ యూనిట్‌కు 2.39 డాలర్లుగా నమోదైంది. అసాధారణ నష్టం (ఇంపెయిర్మెంట్‌ లాస్‌) రూ.1,238 కోట్లు రావడంతో నికర లాభం బాగా తగ్గిందని కంపెనీ ఎక్స్ఛేంజీలకు సమాచారమిచ్చింది. గత జనవరి-మార్చి త్రైమాసికంలో కూడా ఇలాగే రూ.4,899 కోట్ల అసాధారణ నష్టం రావడంతో ఓఎన్‌జీసీ చరిత్రలోనే తొలి త్రైమాసిక నష్టం (రూ.3,098 కోట్లు) నమోదు చేసిన సంగతి తెలిసిందే. కాగా, సమీక్షా త్రైమాసికంలో ముడి చమురు ఉత్పత్తి 4.78 మిలియన్‌ టన్నుల నుంచి స్వల్పంగా పెరిగి, 4.81 మి.టన్నులకు చేరింది. సహజ వాయువు ఉత్పత్తి మాత్రం 5.9 బిలియన్‌ క్యుబిక్‌ మీటర్ల (బీసీఎమ్‌) నుంచి 5.7 బీసీఎమ్‌లకు తగ్గింది. కొవిడ్‌-19 లాక్‌డౌన్‌ నేపథ్యంలో గిరాకీ తగ్గడంతో ఉత్పత్తి తగ్గినట్లు కంపెనీ తెలిపింది. 2020-21 ఆర్థిక సంవత్సరం ఏప్రిల్‌-సెప్టెంబరు మధ్య కాలంలో (హెచ్‌1) నికర లాభం 72.6 శాతం క్షీణించి రూ.3,374 కోట్లకు, ఆదాయం 41.4 శాతం క్షీణించి రూ.29,927 కోట్లకు పరిమితమైంది.

* జాతీయ పింఛను వ్యవస్థ (ఎన్‌పీఎస్‌) కింద నమోదైన అన్ని విభాగాల చందాదార్ల యాజమాన్య వాటాకు (14%) తదుపరి బడ్జెట్‌లో పన్ను నుంచి మినహాయింపునివ్వాలని కోరుతూ తాము ప్రభుత్వానికి నివేదించామని భవిష్య నిధి నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ (పీఎఫ్‌ఆర్‌డీఏ) ఛైర్మన్‌ సుప్రతిమ్‌ బందోపాధ్యాయ వెల్లడించారు. కాగా, 2019 ఏప్రిల్‌ 1 నుంచి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఎన్‌పీఎస్‌ కింద యాజమాన్య చందా అయిన 14% భవిష్య నిధికి పన్ను మినహాయింపు లభిస్తోంది. దీన్ని ఎన్‌పీఎస్‌ కింద నమోదైన రాష్ట్ర ప్రభుత్వాల ఉద్యోగులు, ఇతర కార్పొరేట్‌ సంస్థల చందాదార్లకు కూడా తదుపరి బడ్జెట్‌ నుంచి (2021 ఏప్రిల్‌ 1) వర్తింపజేయాలని కోరుతున్నామని బందోపాధ్యాయ వెల్లడించారు.