Food

పాప్‌కార్న్ అలా పుడుతుంది!

How is popcorn made - Telugu food and diet news

వెనకటి రోజుల్లో కాలక్షేపం బఠానీలు అనేవారు. ఇప్పుడు అంతా కాలక్షేపం పాప్‌కార్న్‌ అంటున్నారు. ముఖ్యంగా సినిమా హాళ్లల్లో చూడండి…చాలామంది చేతుల్లో తప్పనిసరిగా పాప్‌కార్న్‌ పొట్లం ఉంటుంది. పాప్‌కార్న్‌ చేతిలో లేకుండా సినిమా చూడ్డంలో ఏం మజా ఉంటుందనే స్థితికి వచ్చేశారు నేటి యువత. అయితే, పాప్‌కార్న్‌ ఎలా తయారవుతుందో ఎవరికైనా తెలుసా? ఎప్పుడైనా తెలుసుకోవాలనుకున్నారా? తాజాగా ఫ్రాన్స్‌కు చెందిన ఇద్దరు ఇంజనీర్లు అందుకు పూనుకున్నారు. ఎట్టకేలకు ఆ రహస్యం కనిపెట్టి బయటపెట్టారు. ఇమాన్యుయెల్‌ విరోట్‌, అలగ్జాండ్రె పొనమారెంకో అనే ఈ ఇద్దరు ఇంజనీర్లకు పాప్‌కార్న్‌ ఎలా తయారవుతుందనేది ఒక అంతుబట్టని విచిత్రంగా కనిపించింది. ఎలాగైనా దానిని తెలుసుకోవాలనుకున్నారు. ప్రయోగాలు ప్రారంభించారు. ఒక కెమేరాను సిద్ధంచేసుకున్నారు. ఆ కెమెరా సెకనుకు 2,900 దృశ్యాలను రికార్డు చేయగలదు. పాప్‌కార్న్‌ తయారయ్యే చోట దానిని ఉంచారు. అంతే, అది పాప్‌కార్న్‌ తయారీని పూసగుచ్చినట్టు తన ఫ్రేముల్లో బంధించడం ప్రారంభించింది. ఉష్ణోగ్రత 100 డిగ్రీల సెల్షియస్‌కు చేరుకుంది. గింజలోపల ఉన్న తేమ ఆవిరిగా మారడం మొదలైంది. ఉష్ణోగ్రత 180 డిగ్రీల సెల్షియస్‌కు చేరుకుంది. బయట వాతావరణంలో సముద్ర మట్టం దగ్గర ఉన్న ఒత్తిడి కంటె 10 రెట్లు ఎక్కువ ఒత్తిడి ఏర్పడింది. ఆ ఒత్తిడిని తట్టుకోలేకపోయిన గింజ వెలుపలి కవచం బద్దలైంది. గింజ లోపల పిండిపదార్థ రూపంలో ఉన్న పేగుల్లాంటివి విస్తరించి బయటకు పొడుచుకువచ్చాయి. ఒక్కసారిగా ఒత్తిడి తగ్గిపోతుంది. ఈ ప్రక్రియ 180 డిగ్రీల సెల్షియస్‌ దగ్గరే జరుగుతుందనీ, గింజ ఏ ఆకారంలో, ఏ పరిమాణంలో ఉందనేదానికి ఇక్కడ సంబంధం లేదనీ తమ పరిశోధనలో తేలినట్టు ఏరొనాటికల్‌ ఇంజనీర్‌గా ఉన్న విరోట్‌ చెప్పారు. గింజ బద్దలు కాగానే మొట్టమొదట దానినుంచి ఒక కాలు లాంటి నిర్మాణం బయటికి వస్తుంది. అది కాలుతున్న పెనం పైభాగాన్ని తాకగానే ఆ వేడికి కుదించుకుంటుంది. ఒత్తిడికి లోనవుతూ విడుదలవుతున్న క్రమంలో ఈ కాలు లాంటి నిర్మాణం, గింజను కొన్ని మిల్లీమీటర్లనుంచి సెంటీమీటర్ల మేరకు పైకి గెంతేలా చేస్తుంది. అప్పుడు హఠాత్తుగా నీటి ఆవిరి విడుదలై గింజ నుంచి ‘పాప్‌’, అంటే ఒకవిధమైన శబ్దం పుడుతుంది. కొన్ని మిల్లీ సెకండ్ల తర్వాత, దానిలోని రేణువులు వెలుపలికి వెదజల్లబడి విస్తరించి మనం చూసే పాప్‌కార్న్‌లా తయారవుతాయి. దీనంతటికీ పట్టే సమయం ఎంతనుకుంటున్నారు? కేవలం 90 మిల్లీసెకన్లు! అంటే, సెకనులో 0.09 వంతు. గింజ పైకి గెంతడానికి కారణం, అందులో పేరుకున్న వాయువులు పేలిపోవడం కాదు. థర్మోడైనమిక్స్‌, ఫ్రాక్చర్‌ మెకానిక్స్‌ ఫలితం.