Devotional

ఎంగిలాకులపై పొర్లు దండాలు. కుక్కే సుబ్రహ్మణ్యుని ఆలయ ప్రత్యేకత.

Kukke Subrahmanyeswara Temple Special Porlu Dandaalu

నాగులచవితి నాడు పుణ్యం పేరిట జరిగే వింత ఆచారం !
?? కుక్కి సుబ్రహ్మణ్యం?? స్వామి దేవాలయం చరిత్ర విశేషాలు గురించి తెలుసుకుందాం
అనగనగా ఓ ప్రాచీన మందిరం. అక్కడ పుణ్యం పేరిట ఒక వింత జరుగుతుంది. ఎంగిలాకుల మీద పొర్లు దండాలు పెడితే చాలట ఎలాంటి చర్మ వ్యాధులైన ఇట్టే మాయమవుతాయట. చూడగానే అసహ్యం పుట్టించే ఈ వింత ఆచారం ఎక్కడిదో ? ఎలా జరుగుతుందో ఒకసారి చూసెద్దాం పదండి.
మన పక్కరాష్ట్రం కర్నాటక లోని కుక్కే సుబ్రమణ్య దేవాలయంలో ఈ వింత ప్రతి సంవత్సరం జరుగుతుంది. కుక్కే సుబ్రమణ్య దేవాలయం మంగళూరు దగ్గరలోని సుళ్యా అనే ఊర్లో కలదు. సుబ్రమణ్య స్వామిని ఇక్కడ నాగ దేవత గా ఆరాధించడం విశేషం.
సుబ్రమణ్య స్వామి దేవాలయం
కుమారధారా నది మీద వున్న సుబ్రహ్మణ్య స్వామి వూళ్ళో వున్న సుబ్రహ్మణ్య దేవాలయం లేక కుక్కే సుబ్రహ్మణ్య దేవాలయం చూసి తీరవలసిన వాటిలో ఒకటి. ఈ గుడి చుట్టూ నదులు, పర్వతాలు, అడవులు ముఖ్యంగా కుమార పర్వతం పరుచుకుని వుంటాయి.
సుబ్రహ్మణ్య దేవాలయంలో బయట లోపల వున్న హాళ్ళు గర్భాలయానికి దారి తీస్తాయి. ఒక ఎత్తైన వేదిక మీద సుబ్రహ్మణ్య స్వామి తో పాటు వాసుకి విగ్రహాలు వున్నాయి. హిందూ పురాణాల ప్రకారం మరో నాగ రాజు ఆది శేషుడి విగ్రహం కూడా గర్భాలయం లో చూడవచ్చు. గర్భాలయానికి, మండప ద్వారానికి మధ్య వెండి తో కప్పబడిన గరుడ స్థంభం వుంది. స్థానికుల ప్రకారం యాత్రికులను ఈ స్తంభంలో నివసించే వాసుకి నుంచి వచ్చే విషం నుంచి కాపాడడానికి ఈ స్తంభానికి తాపడం చేశారు.
కుక్కే శ్రీ (సర్ప దేవుడు)
సర్ప దోష శాంతికి చేసే ప్రక్రియలకు ఈ పవిత్ర దేవాలయం ప్రసిద్ది. ఈ గుడిలోని ప్రధాన పర్వ దినం తిపూయం నాడు అనేకమంది యాత్రికులు ఇక్కడికి వస్తారు. దీంతో పాటు ఆశ్లేష బలి పూజ, సర్ప సంస్కారం అనే మరో రెండు ప్రధానమైన సర్ప దోష పూజలు కూడా ఈ గుడిలో చేస్తారు.
వింత ఆచారం
‘మాదే స్నాన’, ఇక్కడి ప్రధాన దురాచారం. నవంబర్ నెలాఖరు లేదా డిసెంబర్ మొదటి వారంలో నిర్వహించే చంపా షష్టి వేడుక లేదా ఉత్సవం నాడు మూడు రోజులపాటు ‘మాదే స్నాన’ జరుపుతారు. ఈ ఆచారం ప్రకారం మొదట బ్రాహ్మణులు విస్తరాకులలో భోజనం చేస్తారు. వారు తిని వదిలేసిన ఆకులను అక్కడే ఉంచుతారు. ఊర్లోని ప్రజలందరూ వచ్చి ఆ ఆకుల పై ‘పొర్లు దండాలు’ పెడతారు. ఇలా చేస్తే వారి చర్మ వ్యాధులు తగ్గిపోతాయని, వారి పాపాలు తొలగిపోతాయని నమ్ముతారు
పొర్లు దండలు పెడుతున్న భక్తులు
ఈ ఆచారాన్ని పాటించే వారిలో అత్యున్నత చదువులు చదివిన వారు సైతం ఉండటం గమనార్హం. మధ్యతరగతి కుటుంబీకులు, టీచర్లు, ఇంజనీర్లు, వైద్యులు, న్యాయవాదులు ఇలా ఎందరో ఈ ఆచారాన్ని పాటిస్తున్నారు.
కుమార పర్వతం
కుక్కే సుబ్రమణ్య ఆలయాన్ని సందర్శించడటానికి వెళ్ళే యాత్రికులు తప్పక చూసి రావలసిన ప్రదేశం ‘కుమార పర్వతం’. కుక్కే సుబ్రమణ్య ఊరి నుండి ఈ పర్వతం 13 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. ఈ అందమైన శిఖరం పశ్చిమ కనుమలలో 4000 అడుగుల ఎత్తులో ఉండి, సుదూర ప్రదేశాలకు, కొండలకు చక్కని వ్యూ పాయింట్ గా ఉన్నది.
కుమార పర్వత ట్రెక్కింగ్
కుమార పర్వతం మీద సాలిగ్రామాలు, శివలింగాలు గా చెప్పబడే తెల్లని రాళ్ళు దొరుకుతాయి. కుమారలింగం గా పిలువబడే ఆరు ముఖాల శివలింగాలు పర్వతం ఫై చూడవచ్చు. సాహసాలు ఇష్టపడే వారు పర్వతం పై వరకు ట్రెక్కింగ్ చేయవచ్చు.
కుక్కే సుబ్రమణ్య లో చూడవలసిన మరిన్ని సందర్శన స్థలాలు
బిలద్వార గుహ, సుబ్రమణ్య మఠం , వేదవ్యాస సంపుట నరసింహ దేవాలయం, ఆది సుబ్రమణ్య దేవాలయం, అభయ మహాగణపతి దేవాలయం, హరిహరేశ్వర్ దేవాలయం, మత్స్య పంచమి తీర్థాలు మొదలైనవి.
కుక్కే సుబ్రమణ్య ఎలా చేరుకోవాలి ?
విమాన మార్గం
మంగళూరు విమానాశ్రయం కుక్కే సుబ్రమణ్య కు 115 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. బెంగళూరు ఎయిర్ పోర్ట్ 340 కిలోమీటర్ల దూరంలో ఉంది. క్యాబ్ లేదా ప్రవేట్ టాక్సీ లలో ప్రయాణించి కుక్కే సుబ్రమణ్య చేరుకోవచ్చు.
రైలు మార్గం
కుక్కే సుబ్రమణ్య వద్ద రైల్వే స్టేషన్ కలదు. ఇది సుబ్రమణ్య రోడ్ రైల్వే స్టేషన్ గా పిలువబడుతున్నది. ఊరి నుండి 7 కిలోమీటర్ల దూరంలో ఈ స్టేషన్ ఉన్నది. స్టేషన్ బయట క్యాబ్ లేదా అటో లలో ప్రయాణించి ఊర్లోకి రావచ్చు
రైలు మార్గం , కుక్కే సుబ్రమణ్య
బస్సు / రోడ్డు మార్గం
బెంగళూరు, మంగళూరుల నుండి కుక్కే సుబ్రమణ్యకు కర్నాటక రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (KSRTC) బస్సులు నడుస్తుంటాయి. దీంతో పాటు ప్రవేట్ వోల్వా బస్సు, ఏసీ బస్సు సర్వీసులు కూడా మంగళూరు నుండి బయలుదేరుతాయి.