Devotional

శివుడికి ప్రీతిపాత్రం…కార్తికం

Reasons on why Lord Shiva Is a little bit interested in Karika Maasa

కార్తీక మాసం అన్ని రోజులూ పర్వదినాలే. చాలా పవిత్రంగా భావించే నెల ఇది. ఎక్కడ చూసినా ఆధ్యాత్మిక శోభ వెల్లివిరుస్తుంది. శివునికి ప్రీతిపాత్రమైన మాసమిది. ప్రతి ఏటా దీపావళి వెళ్లిన మరుసటి రోజు నుంచి కార్తీక మాసం ప్రారంభమవుతుంది. జన్మజన్మల పాపాలను హరించి అనంతమైన పుణ్యఫలాలను ప్రసాదించే మహిమాన్వితమైన మాసం కార్తీకం. స్నాన, దాన, జపాలు, పూజలు, వనభోజనాలు, దీపాలు ఈ మాసంలో చేయాల్సిన నిత్య పూజలు. ఈ నియమాలు పాటించడం వల్ల ముక్కంటి అనుగ్రహం పొంది తరించవచ్చు.
*కార్తీక స్నానాలు
భక్తులంతా మహాశివుడి అనుగ్రహం పొందాలంటే తెల్లవారు జామునే తలస్నానం చేసి, శివాలయానికి వెళ్లి ఎంతో భక్తిశ్రద్ధలతో పూజించాలి. దేశం నలుమూలలా శివాలయాలలో రుద్రాభిషేకాలు, రుద్రపూజ, లక్ష బిల్వదళాలతో పూజలు, అమ్మవారికి లక్ష కుంకుమార్చనలు, అభిషేకాలు విశేషంగా నిర్వహిస్తారు. దీపం: కార్తీక దీపానికి చాలా విశిష్టత ఉంది. పరమేశ్వరుని అనుగ్రహం పొందడానికి నిత్యం ముఖ ద్వారానికి ఇరువైపులా సాయంకాలం దీపాలు వెలిగిస్తే మంచిది. శివాలయం ప్రాంగణంలో కూడా దీపాలు వెలిగిస్తే వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది.
*కార్తీక సోమవారాలు
సోమవారం, కార్తీకమాసం రెండూ శివునికి ప్రీతికరమైనవే. కాబట్టి కార్తీక సోమవారాలలో సాయంకాల సమయంలో శివాలయంలో ఉసిరికాయపై వత్తులు పెట్టి దీపం వెలిగించడం ఎంతో శ్రేయస్కరం. నువ్వుల నూనె, ఆవు నెయ్యి, కొబ్బరి నూనె, నెయ్యి, అవిశనూనె, ఇప్పనూనె, ఆముదం ఏదైనా దీపం వెలిగించడానికి వాడవచ్చు. కార్తీక పౌర్ణమి: కార్తీక మాసంలో ముప్పై రోజులలో దీపం పెట్టలేని వారు శుద్ధ ద్వాదశి, చతుర్దశి, పౌర్ణమి రోజు దీపం పెడితే మంచిది. అంతేకాదు కార్తీక మాసంలో దీపం దానం చేయడం వల్ల మంచి జరుగుతుంది. **ఉపవాసం:
కార్తీక మాసంలో వచ్చే ప్రతి సోమవారం ఉపవాసం ఆచరించి, రాత్రి నక్షత్ర దర్శనం చేసుకుని భోజనం చేసినవాళ్లు ఆ పరమేశ్వరుని కరుణా కటాక్షాలు పొందుతారని కార్తీక పురాణం చెబుతోంది.
**వన భోజనం
కార్తీక సోమవారం లేదా కార్తీక మాసంలో ఏ రోజైనా ఉసిరి చెట్టు కింద భోజనం చేయడం మంచిది. ఉసిరి చెట్టు కింద సాలగ్రామాన్ని ఉంచి గంధం, అక్షతలు, పుష్పాలతో పూజించాలి. అనంతరం పండితులను సత్కరించి అందరూ భోజనం చేయాలి. ఈ నియమాలను పాటించడం వల్ల శివానుగ్రహం కలిగి సర్వపాపాలు నశిస్తాయని నమ్మకం. వనభోజన కార్యక్రమాలను నిర్వహించే వారికి పాపాల నుంచి విముక్తి కలుగుతుందని పురాణాలు చెబుతున్నాయి. తులసి పూజ: పౌర్ణమిరోజు ఆవు నెయ్యితో తడిపిన దారపు వత్తులతో దీపాలు వెలిగించి తులసికోట చుట్టూ పదకొండు ప్రదక్షిణలు చేసి పరమాన్నం నైవేద్యంగా పెట్టాలి. తర్వాత 365 వత్తులతో హారతివ్వాలి. నక్షత్రాలు కనుమరుగు కాకముందే ఈ పూజ చేస్తే చాలా మంచిది.