ScienceAndTech

ENTల వద్దకు భారతీయుల పరుగులు

ENTCases On Rise In India Due To Work From Home

ఆన్‌లైన్‌ తరగతులు, వర్క్‌ ఫ్రం హోం అంటూ అదే పనిగా ఇయర్‌ ఫోన్స్‌ ఉపయోగిస్తున్నారా? అయితే వాటిని ఉపయోగించే విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాంటూ హెచ్చరిస్తున్నారు ఆరోగ్య నిపుణులు. ఇటీవలి కాలంలో కరోనా వైరస్‌ కారణంగా ఆన్‌లైన్‌ తరగతులు, వర్క్‌ ఫ్రం హోం పెరిగిపోవడంతో చెవి సంబంధిత సమస్యలతో ఆస్పత్రికి వచ్చే వారి సంఖ్య పెరిగిందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ముంబయిలోని జేజే ప్రభుత్వ ఆస్పత్రి ఈఎన్‌టీ నిపుణులు చవాన్‌, రాహుల్‌ కులకర్ణిలు పలు విషయాలు వెల్లడించారు. ‘గత ఆరేడు నెలలుగా చెవి సంబంధిత సమస్యలతో బాధపడుతూ ఆస్పత్రికి వచ్చేవారి సంఖ్య పెరిగింది. దాదాపుగా అన్ని కేసులూ ఇయర్‌ ఫోన్స్‌ ఉపయోగించిన కారణంగా సంభవించినవే ఉంటున్నాయి. సాధారణ సమయాలతో పోలిస్తే ప్రస్తుతం నిత్యం అదనంగా 5 నుంచి 10 మంది చెవి సంబంధిత ఫిర్యాదులతో ఆస్పత్రికి వస్తున్నారు. వారిలో చాలా మంది ఇయర్‌ ఫోన్స్‌ ఉపయోగించి 8గంటలు పనిచేస్తున్న వారే. ఎక్కువ సమయం అలా గడపడం ద్వారా వారి చెవులపై ఒత్తిడి ఏర్పడి ఇన్ఫెక్షన్‌లకు దారి తీస్తోంది. ఇయర్‌ ఫోన్స్‌ వాడకాన్ని కొంతమేరకు అయినా తగ్గించుకోకపోతే శాశ్వత సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంటుంది. పాఠశాల విద్యార్థులు హెడ్‌ఫోన్స్‌తో 60డీబీ కన్నా ఎక్కువ శబ్దాన్ని విన్నట్లయితే అది వారి సాధారణ వినికిడి శక్తిని దెబ్బతీస్తుంది. కాబట్టి తల్లిదండ్రులు పిల్లలు ఆన్‌లైన్‌లో తరగతులు వినేటప్పుడు సౌండ్ తక్కువ ఉండేలా దృష్టి సారిస్తే మంచిది’ అని ఈఎన్‌టీ నిపుణులు చవాన్‌, కులకర్ణిలు హెచ్చరించారు.