Movies

వస్త్రపరిశ్రమలో ₹736 జీతంతో..

వస్త్రపరిశ్రమలో ₹736 జీతంతో..

ఎయిర్‌ డెక్కన్‌ వ్యవస్థాపకుడు జీవీ గోపీనాథ్‌ జీవితాన్ని ఆధారంగా చేసుకుని తెరకెక్కిన చిత్రం ‘ఆకాశం నీ హద్దురా’. సుధా కొంగర దర్శకత్వం వహించిన ఈ సినిమా ఇటీవల అమెజాన్‌ ప్రైమ్‌ వేదికగా విడుదలై ప్రేక్షకులను అలరిస్తోంది. చాలాకాలం తర్వాత నటుడిగా సూర్య పూర్తిస్థాయిలో మెప్పించాడని సినీ ప్రియులు అంటున్నారు. మరోవైపు పలువురు సినీ ప్రముఖులు సైతం సూర్య నటనను కొనియాడుతూ ట్వీట్లు చేస్తున్నారు. కాగా, కథానాయకుడిగా ప్రేక్షకులకు పరిచయం కాక ముందు తాను ఏం చేశాననే విషయాన్ని తాజాగా సూర్య ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ‘‘ఆకాశం నీ హద్దురా’ చిత్రంలో నేను పోషించిన పాత్ర.. వ్యక్తిగతంగా నాకెంతో దగ్గరయ్యింది. ఒక్కప్పటి రోజుల్ని నాకు గుర్తు చేసింది. మా నాన్నగారు సినీ పరిశ్రమలో ఉన్నప్పటికీ నేను ఈ రంగంలోకి వస్తానని అనుకోలేదు. నా కాళ్లపై నేను నిలబడాలని మా ఇంట్లోవాళ్లు భావించారు. అందుకే డిగ్రీ పూర్తయిన వెంటనే ఓ వస్త్ర పరిశ్రమలో పనిచేశాను. నెలరోజులపాటు పనిచేసినందుకుగాను రూ.736 జీతంగా ఇచ్చారు. అదే నా మొదటి సంపాదన. ‘ఆకాశం నీ హద్దురా’ చిత్రీకరణ సమయంలో ఆనాటి రోజులు నాకు బాగా గుర్తుకువచ్చాయి. దానివల్లే భావోద్వేగాలను మరింత బాగా పలికించగలిగానని అనుకుంటున్నాను. అంతేకాకుండా కొన్ని సన్నివేశాలు చిత్రీకరిస్తున్నప్పుడు హావభావాలు పలికించే విషయంలో సుధా కొంగర ఎంతో సాయం చేశారు. నాలోని నటుడిని మరో కోణంలో నాకు పరిచయం చేసిన సుధాకు థ్యాంక్స్‌’ అని సూర్య తెలిపారు.