Fashion

టీనేజ్ హోమ్స్ వస్తున్నాయి

Teenage Homes Are Coming To India

టీనేజ్ హోమ్స్

వోల్డేజ్ హోమ్స్ తో పాటు ఇప్పుడు కొత్తగా టీనేజ్ హోమ్స్ రాబోతున్నాయ్.

షాకవుతున్నారా? అప్పట్లో వోల్డేజ్ హోమ్స్ వచ్చినప్పుడు కూడా ఇలాగే షాకయ్యారు. కాని, ఇప్పుడు అవి నార్మల్. ఇంతకూ ఈ టీనేజ్ హోమ్స్ కథా కమామీషు ఏంటి ??????????

నమస్తే సార్ .

నమస్తే –రండి కూర్చోండి.
మీరు ప్రారంభించిన హోమ్ ఫర్ ది టీనేజ్డ్ గురించి తెలుసుకోటానికి వచ్చాను సార్ .

వెల్కం. అబ్బాయా అమ్మాయా ?

ఇద్దర్నీ జాయిన్ చేస్తా…

ఇద్దరికీ నెలకు యాభై వేలు కట్టాలి.

ఓకే సార్ .కట్టేస్తాం.

ఇంతకూ వాళ్ళ ప్రాబ్లెం ఏమిటి?

మామూలే .. ఘర్ ఘర్ కీ కహానీ…

అంటే?

ఇద్దరూ సెల్ ఫోన్ వదలటం లేదు.

అంటే……? ఉదయం లేచిన దగ్గర్నుంచీ రాత్రి వరకూ ఫోన్ వాడుతూనే ఉంటారా?

అలా చేస్తే మాకు ప్రాబ్లెం ఏముంది?అసలు నిద్రే పోవటం లేదు.

అంటే…….? రాత్రుళ్ళు ఎన్నింటి వరకూ మేలుకుoటున్నారు?

ఎన్నింటి వరకూ ఏమిటి నా శ్రాద్ధం. అసలు నిద్ర పోతేగా?

ఓహో……అర్ధమయింది. అసలు నిద్రపోకుండా 24 గంటలూ ఫోన్ వాడుతూనే ఉంటారన్న మాట.

అవును.

మధ్యలో ఫోన్ చార్జింగ్ కోసమైనా దూరంగా ఉండరా?

అందుకే రెండు ఫోన్లు వాడుతున్నారు.

ఫోన్లు లాక్కో పోయారా?

మంచిగున్నారు. మొన్న మావాడి ఫోన్ లాక్కుంటే నామీద కత్తితో ఎటాక్ చేసాడు.

ఓహో వయొలెన్స్ సిండ్రోమ్ అన్నమాట .మాదగ్గర దానికి ట్రీట్మెంట్ వుంది.

అలాగే ఫోన్ వాడద్దని వాళ్ళమ్మ మందలించేసరికి మా అమ్మాయ్ ఇల్లు వదలి వెళ్ళిపోయింది. వారం రోజుల పాటు వెతికాక వాళ్ళ ఫ్రెండ్ ఇంట్లో దొరికింది. బలవంతంగా ఇంటికి తీసుకొస్తే పోలీస్ కంప్లైంట్ ఇచ్చింది నా తల్లి దండ్రులు నన్ను ఆత్మహత్యకు పురిగొల్పుతున్నారు అని. పోలీసులు కేస్ రిజిస్టర్ చేసారు. వాళ్ళను వదిలించుకోటానికి రెండు లక్షలు ఖర్చయింది. అప్పటినుంచీ ఎందుకైనా మంచిదని మా ఇంట్లో మా రక్షణ కోసం ఒక బౌన్సర్ ని పెట్టుకున్నాం. బౌన్సర్ కీ ముప్పై వేలు జీతం.

మరి అదే కంటిన్యూ చేయక పోయారా?
ఇప్పటికే ఆ బౌన్సర్ కోసం ,పోలీసుల కోసం, ఇద్దరు పిల్లల ఫోన్ల కోసం, రీచార్జ్ కోసం మా ఇంట్లో సగం పోర్షన్ అమ్మేసాం.మిగతాది కూడా అమ్మితే మేము రోడ్ న పడతాం.

ఓకే. అర్ధమయింది. కాని మా ఫీజ్ ఎలా కడతారు మరి?

మీకు కట్టటానికి మా ఇంటి మీద బాంక్ లోన్ తీసుకున్నాం..

గుడ్…… రేపే మీ పిల్లల్ని తీసుకొచ్చి జాయిన్ చేసేయండి.

మేమెలా తీసుకొస్తాం? ఇక్కడికి తీసుకొస్తామని తెలుస్తే వాళ్ళు అన్నంలో పురుగుల మందు పెట్టి మమ్మల్ని చంపేస్తారు.

ఓకే…. .అయితే మా సెక్యూరిటీ వాళ్ళను పంపిస్తాం. వాళ్ళు తాళ్ళతో కట్టేసి తీసుకొస్తారు. అలా రిస్క్ తీసుకుంటున్నందుకు ఇంకో పాతిక వేలు కట్టాలి.

అంత సీన్ అవసరం లేదు . మా పిల్లలు రాత్రి పన్నెండు నుంచి తెల్లారు జామున నాలుగింటివరకూ వాళ్ళ వాట్సాప్ గ్రూప్స్ తో చాటింగ్ చేస్తూంటారు. ఆ టైములో వాళ్లకు సృహ వుండదు. ఈజీగా ఎత్తుకొచ్చి మీ వాన్ లో పడేయవచ్చు.
అలా అయితే పదివేలు కట్టండి చాలు.

ఇంతకూ మీరు వాళ్ళను మళ్ళీ ఆ మెషిన్ లైఫ్ నుంచి మనిషి లైఫ్ లోకి ఎలా తీసుకొస్తారు?

ముందు వాళ్ళను సెల్ ఫోన్ డి –ఎడిక్షన్ హాస్టల్ లో పెడతాం. అక్కడ రకరకాల ట్రీట్మెంట్ ఇస్తాం. మా సైఖియాట్రిస్ట్ వాళ్లకు మైల్డ్ షాక్స్ ఇస్తాడు. తరువాత, వాళ్లoదర్నీ ఒక హాల్లో కూర్చోబెట్టి ఫోన్ లేకుండా ఎలా మాట్లాడు కోవాలో నేర్పిస్తాం. ఆ తరువాత, ఆటలు, పాటలు నేర్పిస్తాం. జంతువులు ఫోన్లు లేకుండా ఎంత హాపీగా ఉంటున్నాయో డాక్యుమెంటరీలు చూపిస్తాం. పాత కాలంలో ఫోన్లు లేనప్పుడు ప్రజలు ఎంత హాపీగా కలసి మెలసి వుండేవారో మూవీస్ ద్వారా చూపిస్తాం. తల్లిదండ్రుల్ని బంధువులను ఎలా గుర్తు పట్టాలో ట్రైనింగ్ ఇస్తాం. డమ్మీ తల్లిదండ్రుల్ని ఎరేంజ్ చేసి వాళ్ళు ఎంతగా పిల్లల్ని ప్రేమిస్తారో ట్రయల్ రన్స్ ఇస్తాం. ఫోన్ లేకపోయినా మనం బతకవచ్చు అనే ఎక్స్పెరిమెంటల్ ఫిలిమ్స్ చూపిస్తాం…

ఒక డౌట్ సార్ .

ఏంటది.?

ఒకవేళ అప్పటికీ పిల్లలు మారక పోతే?

అప్పుడు వాళ్ళ తల్లిదండ్రులను వేరే హోమ్ లో చేర్చుకుంటాం.

ఎందుకు?

అలాంటి రిపేర్ కి పనికిరాని పిల్లలతో ఎలా శేష జీవితం గడపాలో తల్లిదండ్రులకు ట్రైనింగ్ ఇస్తామన్న మాట. దానికి ఫీజ్ తీసుకోము. ఫ్రీ.
ఎందుకంటే, అప్పటికే వాళ్ళు, పొలాలు, స్థలాలు, ఇల్లు అమ్ముకొని అరిపోయి వుంటారు గనక.