Politics

తెరాస అరాచకాలపై భాజపా ఛార్జిషీట్-GHMC-TNI బులెటిన్

BJP Releases ChargeSheet Against TRS Corruption

* టీఆర్ఎస్ ప్రభుత్వ అవినీతి అరాచకాలపై బీజేపీ చార్జ్‌షీట్‌ విడుదల చేసింది. జీహెచ్‌ఎంసీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం హైదరాబాద్‌కు చేరుకున్న కేంద్రమంత్రి ప్రకాశ్‌ జవడేకర్‌ దీనిని విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. బీజేపీ మేయర్ కావాలా.. ఎంఐఎం మేయర్ కావాలో హైదరాబాద్ ప్రజలు తేల్చుకోవాలన్నారు. హైద్రాబాద్ మేయర్ పీఠం బీజేపీ కైవసం చేసుకోబోతుందని జోస్యం చెప్పారు. కేసీఆర్, ఓవైసీ కుటుంబ పార్టీల నుంచి హైద్రాబాద్‌ను కాపడుకోవాలని హైదరాబాద్‌ ప్రజలకు పిలుపునిచ్చారు. టీఆర్ఎస్, కాంగ్రెస్‌కు ఓటు వేస్తే ఎంఐఎంకు ఓటు వేసినట్లే అని అభిప్రాయపడ్డారు. కేసీఆర్, హరీష్, కేసీఆర్ నియోజకవర్గాలకు మధ్యలో ఉన్న దుబ్బాకను గెలిచామని, దుబ్బాక ఫలితమే గ్రేటర్ ఎన్నికల్లో పునరావృతం కాబోతోందని ధీమా వ్యకం చేశారు. ఆదివారం హైదరాబాద్‌లో పర్యటించిన జవదేకర్‌ బీజేపీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. ‘కేసీఆర్ ఆరేళ్ళల్లో పాలన అవినీతికి చిరునామా. హైద్రాబాద్‌ను డల్లాస్ నగరం చేస్తామని.. కేటీఆర్ వరదల‌ నగరంగా మార్చారు. లక్ష డబుల్ బెడ్రూం ఇళ్ళ నిర్మాణంలో తెలంగాణ ప్రభుత్వం విఫలం. మోదీ రెండున్నర లక్షల ఇళ్ళు నిర్మిస్తే.. కేసీఆర్ రెండు వందల ఇళ్ళు కూడా నిర్మించలేదు. హుస్సేస్ సాగర్‌లో ఉన్న కొబ్బరినీళ్ళు కేసీఆర్ తాగుతున్నారా?. కరోనా సమయంలో ప్రజలను గాలికి వదిలి కేసీఆర్ ఫాంహౌస్‌లో పడుకున్నారు. ఆయుష్మాన్ భారత్ పథకం అమలు చేసి ఉంటే పేదలకు కరోనా చికిత్స ఉచితంగా అందేది. తెలంగాణ ఉద్యమంలో బీజేపీ పాత్ర కీలకం.. సుష్మా స్వరాజ్ లేకోయినా ఆమె పోరాటం మర్చిపోలేం. కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ ఏమైందో అందరకీ తెలుసు’అని అన్నారు.

* చార్జిషీట్లే వేయాల్సి వస్తే బిజెపి సర్కార్ మీద 132 కోట్ల చార్జిషీట్లు వెయ్యాలి : మంత్రి కేటీఆర్* తమను గెలిపిస్తే దేశ ప్రజల అకౌంట్లో ఒక్కొక్కరికి 15 లక్షల రూపాయలు వేస్తానన్నది బీజేపీ సర్కార్* సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాల చొప్పున 12 కోట్ల ఉద్యోగాలు ఏమినై ?ఈ మాట తప్పినందుకు దేశ యువత మీపై వేయాలి చార్జీషీట్* బీజేపీ నాయకులు సిగ్గులేకుండా, నీతిమాలిన విమర్శలు చేస్తున్నారు *జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ తీరు పట్ల విరుచుకుపడ్డ టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ •నగరం రూపు రేఖలు మార్చేలా అభివృద్ది చేసినందుకా మాపై చార్జీషీట్? •కిషన్ రెడ్డి రెండెళ్లలో ఒక్క రూపాయి అయినా అదనంగా తెచ్చిండా?

* గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికల్లో నామినేషన్ల ప్రక్రియ పూర్తి కావడంతో రాజకీయ పార్టీల అగ్రనేతలు, అభ్యర్థులు ప్రచారంపై దృష్టి సారించారు. గ్రేటర్‌ పీఠాన్ని మరోమారు దక్కించుకుంటామనే ధీమాతో ఉన్న టీఆర్‌ఎస్‌.. అభ్యర్థుల ఖరారు మొదలుకుని, సమన్వయం, ప్రచారం తదితర అంశాల్లో ఇతర పార్టీల కంటే ముందంజలో ఉంది. ప్రస్తుత ఎన్నికల్లో డివిజన్‌ స్థాయి రిజర్వేషన్లలో ఎలాంటి మార్పులు లేనప్పటికీ గ్రేటర్‌ మేయర్‌ పీఠాన్ని మాత్రం జనరల్‌ మహిళా కేటగిరీకి రిజర్వు చేశారు. దీంతో డివిజన్‌ స్థాయిలో విజయం సాధించి, గ్రేటర్‌ మేయర్‌ పీఠాన్ని దక్కించుకునేందుకు టీఆర్‌ఎస్‌లో సుమారు డజను మంది మహిళా నేతలు ఆసక్తి చూపుతున్నారు. అయితే పార్టీలో పలువురు నాయకుల వారసులు మేయర్‌ పీఠాన్ని ఆశిస్తున్నా.. సామాజికవర్గ సమీకరణలు, విధేయత, సమర్థత ఆధారంగా ఎంపిక జరుగుతుందని పార్టీ వర్గాలు చెప్తున్నాయి.

* గ్రేటర్‌ హైదరాబాద్‌లో బలపడేందుకు బీజేపీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. పూర్వ వైభవం సాధించేందుకు ప్రయత్నిస్తోంది. ఆటుపోట్లను ఎదుర్కొంటూ ప్రతి ఎన్నికల్లోనూ ఉనికిని చాటిన బీజేపీ గతంలో కొన్ని సార్లు తెలుగు దేశంతో కలిసి, మరికొన్ని సార్లు ఒంటరిగా పోటీ చేసింది. 2014 ఎన్నికల్లో అయిదు అసెంబ్లీ సీట్లను సాధించి గ్రేటర్‌లో తన సత్తాను చాటింది. 2018 అసెంబ్లీ ఎన్నికలో కేవలం ఒకే ఒక సీటుతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.

* నగరానికి మేయర్‌ మొదటి పౌరుడిగా ప్రొటోకాల్‌ పాటించడం ఆనవాయితీ. అలాంటి గౌరవ హోదాలో ఉండే మేయర్‌నూ ఒక సందర్భంలో పోలీసులు అరెస్టు చేశారు. హైదరాబాద్‌ మునిసిపల్‌ కార్పొరేషన్‌ చరిత్రలో అరెస్టు అయిన తొలి మేయర్‌గా చరిత్రకెక్కారు ఎన్‌. లక్ష్మీనారాయణ ముదిరాజ్‌. 1969 తెలంగాణ ఉద్యమంలో అసువులుబాసిన అమరవీరుల స్మారకంగా గన్‌పార్కు వద్ద తెలంగాణ అమరవీరుల స్తూపం నెలకొల్పాలని ఆనాటి ఉద్యమకారులు నిర్ణయించారు. 1970, ఫిబ్రవరి 23న గన్‌పార్కులో స్తూపం శంకుస్థాపన తలపెట్టారు. కార్యక్రమానికి స్థానిక పోలీసుల అనుమతి ఉన్నా, అప్పటి ప్రభుత్వం వ్యతిరేకించింది. శంకుస్థాపన ఆపేయాలని హుకుం జారీచేసింది. దీంతో గన్‌పార్కు చుట్టూ వందల మంది పోలీసులు మోహరించారు. ప్రభుత్వ ఆదేశాలను బేఖాతర్‌ చేసిమరీ అమరవీరుల స్తూపానికి పునాదిరాయి వేశారు లక్ష్మీనారాయణముదిరాజ్‌. ఆయనతోపాటు కార్యక్రమంలో పాల్గొన్న వారినీ పోలీసులు అరెస్టు చేసి ఠాణాకి తరలించారు. ఆయన అరెస్టుకు వ్యతిరేకంగా నగరమంతా నిరసనలు మిన్నంటాయి. తర్వాత లక్ష్మీనారాయణ ముదిరాజ్‌ కాంగ్రె్‌సకు రాజీనామా చేసి, తెలంగాణ ప్రజా సమితి పార్టీలో చేరారు. 1972లో మహారాణిగంజ్‌ (ఇప్పటి గోషామహల్‌)నుంచి శాసనసభకు ఎన్నికయ్యారు. బీసీ కమిషన్‌ సభ్యుడిగానూ సేవలందించారు. అనారోగ్యంతో 2015లో కన్నుమూశారు.

* గ్రేటర్‌ హైదరాబాద్‌ ఎన్నికల్లో ప్రధాన పార్టీల విజయావకాశాలకు బీసీలే కీలకంగా మారారు. నగరం మొత్తంలో 150 డివిజన్లు ఉండగా, దాదాపు 60, 70 డివిజన్లలో బీసీలు నిర్ణయాత్మక శక్తిగా ఉన్నారు. దాంతో, వారి ఓట్లను ఆకట్టుకునేందుకు ప్రధాన పార్టీలు దృష్టి సారించాయి. టికెట్ల కేటాయింపులో బీసీలకు పెద్దపీట వేశాయి. గ్రేటర్‌ ఎన్నికల్లో బీసీలకు 33 శాతం రిజర్వేషన్‌ కల్పించగా, పలు రాజకీయ పార్టీలు 50 శాతానికి మించి స్థానాలను కేటాయించాయి. పలుచోట్ల జనరల్‌ స్థానాల్లో సైతం బీసీలకు టికెట్లు ఇచ్చాయి. టీఆర్‌ఎస్‌ సగానికి సగం సీట్లు బీసీలకు ఇవ్వగా.. బీజేపీ అంతకుమించి ఇచ్చింది. బీసీ కులాల్లోనూ యాదవ, గౌడ, మున్నూరు కాపు కులాలకే అగ్రతాంబూలం దక్కింది. ఆయా డివిజన్లలో బీసీ రిజర్వేషన్ల ప్రకారం యాదవ సామాజిక వర్గానికి టీఆర్‌ఎస్‌ 14, బీజేపీ-15, కాంగ్రెస్‌-10, టీడీపీ-8 టికెట్లు ఇచ్చాయి. గౌడ కులస్తులకు టీఆర్‌ఎస్‌-15, బీజేపీ-10, కాంగ్రెస్‌-11, టీడీపీ-12 టికెట్లు కేటాయించాయి. మున్నూరు కాపులకు టీఆర్‌ఎస్‌-12, బీజేపీ-8, కాంగ్రెస్‌-4 ఇచ్చాయి. కాపు (ఓసీ)లకు టీఆర్‌ఎస్‌-1, బీజేపీ-4, కాంగ్రె స్‌-4, టీడీపీ-3; కమ్మ (ఓసీ)లకు టీఆర్‌ఎస్‌-4, బీజేపీ-4, కాంగ్రెస్‌-2, టీడీపీ-6 కేటాయించాయి. మైనారిటీలకు టీఆర్‌ఎస్‌-17, బీజేపీ-1, కాంగ్రెస్‌-10, టీడీపీ-4 టికెట్లు ఇచ్చాయి. అలాగే, ముదిరాజ్‌లకు టీఆర్‌ఎస్‌-5, బీజేపీ-5, కాంగ్రెస్‌-5, టీడీపీ-5, మాదిగ, మాలలకు టీఆర్‌ఎస్‌-7, బీజేపీ-9, కాంగ్రెస్‌-7, టీడీపీ-10 కేటాయించాయి. విశ్వకర్మ, పెరిక, నాయీ బ్రహ్మణ, మార్వాడీ, రజక, లోథీ, గంగపుత్ర, చౌదరి కులాలకు రెండు నుంచి నాలుగు టికెట్లు కేటాయించాయి. చాలావరకూ డివిజన్లలో పార్టీలన్నీ ఒకే ఫార్ములాను అమలు చేశాయి. ఇతర పార్టీలు ఏయే డివిజన్లలో ఏయే సామాజిక వర్గానికి ఎన్ని టికెట్లు కేటాయించాయో మిగిలిన పార్టీలు కూడా అదే స్థాయిలో ప్రాధాన్యమిచ్చాయి.

* టీఆర్ఎస్ ఇచ్చిన హామీలు నిలబెట్టుకోలేదని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. ఓట్లు అడగడానికి వస్తున్న టీఆర్ఎస్ నేతలను ప్రజలు నిలదీయాలన్నారు. హైదరాబాద్‌ను డల్లాస్, ఇస్తాంబుల్ చేస్తామన్న హామీ ఏమైంది?, డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల హామీ ఏమయ్యింది? అని ఆయన ప్రశ్నించారు. డబుల్ బెడ్ రూమ్ ఇస్తారనే గతంలో ప్రజలు టీఆర్ఎస్‌కు ఓటేశారని చెప్పారు. డబుల్ బెడ్ రూమ్ ఎక్కడ కట్టారు? ఎవరికిచ్చారు? అని ప్రశ్నించారు. రోడ్లపై గుంత చూపిస్తే రూ.వెయ్యి ఇస్తామని గతంలో టీఆర్ఎస్ ఛాలెంజ్ చేసిందని గుర్తుచేశారు. ఇప్పుడు గుంతలేని రోడ్లు చూపిస్తే తాను రూ.లక్ష ఇస్తానన్నారు. హైదరాబాద్ సముద్రంగా మారడానికి ఈ ప్రభుత్వం కారణం కాదా? అని ప్రశ్నించారు. వరదల వల్ల దాదాపు 15 లక్షల మంది నిరాశ్రయులయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. వేగంగా జరుగుతున్న మెట్రో పనులను అడ్డుకున్నారని చెప్పారు. గతంలో కంటే ఈసారి బీజేపీపై ప్రజలకు విశ్వాసం పెరిగిందన్నారు. రేపటి నుంచి బీజేపీ ప్రచారం నిర్వహిస్తుందన్నారు.

* నగరంలోని అల్వాల్ మున్సిపల్ సర్కిల్ పరిధిలో 135 వెంకటాపురం డివిజన్ కాంగ్రెస్ అభ్యర్థి సంజీవ తన ప్రచారాన్ని జోరుగా కొనసాగిస్తున్నారు. ప్రచారంలో భాగంగా వెంకటాపురం డివిజన్లోని రాజీవ్‌నగర్ కాలనీలో సమస్యలు తనకు తెలుసని అందులో నల్లాల సమస్య తీవ్రంగా ఉందన్నారు. తనను గెలిపిస్తే నల్లాల సమస్యను సత్వరమే పరిష్కారం చేస్తానని హామీ ఇచ్చారు. 135 కాంగ్రెస్ అభ్యర్థి సంజీవను గెలిపించాలని మల్కాజిగిరి నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్‌చార్జ్ నంది కంటి శ్రీధర్ కాలనీవాసులుని కోరారు. ప్రతిపక్షం పటిష్టంగా ఉంటే సమస్యల పైన పోరాడి తీరుస్తామని హామీ ఇచ్చారు. ఈ సారి తనను గెలిపిస్తే కాలనీ సమస్యలు తీరుస్తానని, హామీ ఇచ్చారు. కాగా కాలనీ సమస్యలు తీరుస్తానని హామీ ఇచ్చిన వారికే తాము పట్టం కడతామని కాలనీవాసులు తెలిపారు.