Health

ఇక ఆయుర్వేద సర్జరీలు

ఇక ఆయుర్వేద వైద్యులూ సర్జరీలు చేయొచ్చు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆయుర్వేదంలో పోస్టుగ్రాడ్యుయేట్‌(పీజీ) విద్యార్థులకు శస్త్రచికిత్సల్లో శిక్షణ ఇవ్వాలని నిర్ణయించింది. ఇందుకోసం పీజీ ఇండియన్‌ మెడిసిన్‌ సెంట్రల్‌ కౌన్సిల్‌-2016 (ఆయుర్వేద విద్య) రెగ్యులేషన్స్‌కు సవరణలు చేసి కేంద్రం తాజాగా ఉత్తర్వులు జారీచేసింది. దీని ప్రకారం పీజీ పూర్తయిన విద్యార్థులు నిరపాయకార కణితులు తొలగించడం, దంత, కంటి, ముక్కు సంబంధిత శస్త్రచికిత్సలు స్వతంత్రంగా నిర్వహించొచ్చు. అయితే.. తాజా ఉత్తర్వుల్లో కేవలం 58 శస్త్రచికిత్సలకు మాత్రమే అనుమతిచ్చామని కేంద్రం స్పష్టంచేసింది. ప్రాచీన ఆయుర్వేదంలో అధునాతన వైద్యాన్ని కలిపే ప్రయత్నం జరుగుతుందన్న విమర్శలను ఖండించింది. శల్య తంత్ర(జనరల్‌ సర్జరీ), శలాక్యతంత్ర(ఈఎన్‌టీ, దంతాలు) విద్యార్థులు నిర్వహించాల్సిన సర్జరీలకు సంబంధించి ఎక్కువ స్పష్టత ఇచ్చాం తప్పితే కొత్తగా వారి పరిధిలోకి ఏ శస్త్రచిక్సితలూ తీసుకురాలేదని వివరణ ఇచ్చింది. ఇది కొత్త విధానం కాదని, ఇప్పటికే ఉన్న నిబంధనలకు సవరణలు చేయడం ద్వారా స్పష్టత ఇచ్చామని ఆయుష్‌ మంత్రిత్వశాఖ కార్యదర్శి రాజేశ్‌ కోటేచా తెలిపారు. ‘‘మొత్తం సర్జరీలన్నీ ఆయుర్వేద వైద్యులు చేయొచ్చని చెప్పడం లేదు. కొన్ని అంశాల్లోనే అనుమతి ఇచ్చాం. ఆయుర్వేద పోస్టుగ్రాడ్యుయేషన్‌లో కొన్ని విభాగాలకే ఇది వర్తిస్తుంది. అన్నింటికీ వర్తించదు’’ అని రాజేశ్‌ తెలిపారు. 25 ఏళ్లుగా ఆయుర్వేద సంస్థలు శస్త్రచికిత్సలు చేస్తున్నాయని, ఇప్పుడు వాటికి చట్టబద్ధత మాత్రమే కల్పించామని సీసీఐఎం బోర్డు ఛైర్మన్‌ జయంత్‌ దేవ్‌ పుజారి అన్నారు. తాజా ఉత్తర్వులతో ఏ సర్జరీలు చేయొచ్చో.. చేయకూడదో చెబుతున్నామని, దీనివలన ఒక స్పష్టత వస్తుందని వివరణిచ్చారు.

ఆయుర్వేదంలో పోస్టుగ్రాడ్యుయేషన్‌ పూర్తి చేసిన వారికి సర్జరీలు చేసే అవకాశం ఇవ్వడంపై ఇండియన్‌ మెడికల్‌ అసోషియేషన్‌ (ఐఎంఏ) తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. తిరోగమన చర్యగా అభివర్ణించింది. వెంటనే ఉత్తర్వులను ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేసింది. ‘‘ఆధునిక వైద్యంతో మిగతా వ్యవస్థలను కలపాలనుకోవడం తిరోగమన చర్య. దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తాం. అధునాతన వైద్యాన్ని అనుసరించే వైద్యులంతా దీనిపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి దగ్గర దారులను వెతికితే ఇక నీట్‌ లాంటి పరీక్షలకు విలువ ఏముంటుంది. వెంటనే ఈ నిర్ణయాన్ని ఉపసంహరించాలి’’ అని ఒక ప్రకటనలో పేర్కొంది.