DailyDose

నేను బైడెన్‌ను అంగీకరించను-తాజావార్తలు

Putin Says He Won't Accept Biden's Presidential Win

* అమెరికా అధ్యక్ష ఎన్నికలపై ఎట్టకేలకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ స్పందించారు. ఎవరి నాయకత్వంలోనైనా అమెరికాతో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నానని తెలిపారు. కానీ, అమెరికా అధ్యక్షుడిగా జో బైడెన్‌ గెలుపును మాత్రం గుర్తించేందుకు సిద్ధంగా లేనని పుతిన్‌ స్పష్టంచేశారు. ‘అమెరికా ప్రజల నమ్మకాన్ని కలిగిన ఏ నాయకుడితోనైనా మేము కలిసి పనిచేస్తాం. అయితే, ఆ విశ్వాసాన్ని ప్రతిపక్ష పార్టీ గుర్తించిన అభ్యర్థి లేదా చట్టపరమైన మార్గంలో ఫలితాలు నిర్ధారించబడిన తర్వాతే పొందుతారు’ అని రష్యన్‌ అధికారిక మీడియాలో పుతిన్‌ వెల్లడించారు.

* తెలుగు సినీ పరిశ్రమను కాపాడుకోవటానికి అవసరమైన చర్యలు తీసుకుంటామని తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అన్నారు. కొవిడ్‌ కారణంగా షూటింగులు ఆగిపోయి, థియేటర్లు మూతపడటంతో ఇబ్బందులుపడుతున్న కార్మికులను ఆదుకోవటానికి ప్రభుత్వపరంగా రాయితీలు, మినహాయింపులు ఇవ్వనున్నట్లు కేసీఆర్‌ వెల్లడించారు. జీహెచ్‌ఎంసీ తెరాస మేనిఫెస్టోలో సినీ పరిశ్రమకు సంబంధించిన అంశాలను ప్రస్తావిస్తాన్నారు.

* భాజపా అంటే సీఎం కేసీఆర్‌కు భయం పట్టుకుందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ అన్నారు. దేశాన్ని మజ్లిస్‌కు అప్పజెప్పేందుకు ప్రత్యక్షంగా, పరోక్షంగా తెరాస మద్దతిస్తోందని విమర్శించారు. తెరాస, మజ్లిస్‌ కలిసి భాగ్యనగరాన్ని పాతబస్తీలా మార్చాలని చూస్తున్నాయని ఆరోపించారు. తెలంగాణకు కేంద్రం ఏం చేసిందని తెరాస నేతలు ప్రశ్నిస్తున్నారని.. అసలు రాష్ట్రానికి తెరాస చేసిందేంటో చెప్పాలని నిలదీశారు. భాజపాను గెలిపిస్తే పాతబస్తీని భాగ్యనగరంగా మారుస్తామని చెప్పారు.

* నగరానికి 2050 వరకు ఎలాంటి నీటి ఇక్కట్లు రాకుండా ప్రణాళికలు రూపొందించినట్లు తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ తెలిపారు. ఖైరతాబాద్‌ నియోజకవర్గ పరిధిలోని జహీరానగర్‌ చౌరస్తాలో నిర్వహించిన రోడ్‌ షోలో కేటీఆర్ ప్రసంగించారు. ‘‘ఛార్జ్‌షీట్‌ వేయాల్సి వస్తే భాజపాపై 132 కోట్ల ఛార్జ్‌షీట్లు వేయాలి. భాజపా, కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాల్లో కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్‌ ఉందా?కరోనా కష్టకాంలో హైదరాబాద్‌లో తిరిగింది ఎవరు? ’’ అని కేటీఆర్ వ్యాఖ్యానించారు.

* దేశవ్యాప్తంగా రెండో విడతగా కరోనా ప్రబలే అవకాశాలు ఉన్నాయని వైద్య నిపుణులు చెబుతున్న నేపథ్యంలో కేంద్రం అప్రమత్తమైంది. ఎక్కువ మొత్తంలో కేసులు నమోదవుతున్న ఉత్తర్‌ప్రదేశ్‌, పంజాబ్‌, హిమాచల్‌ ప్రదేశ్‌లకు ప్రత్యేక బృందాలను పంపించింది. ఆయా రాష్ట్రాల్లోని తాజా పరిస్థితులను అధ్యయనం చేస్తూ, వైరస్‌ వ్యాప్తి నివారణ చర్యల్లో రాష్ట్ర ప్రభుత్వాలకు ఈ బృందాలు సహాయ పడతాయి.

* భారతీయ రిజర్వ్‌ బ్యాంకు (ఆర్‌బీఐ) సరికొత్త రికార్డు సృష్టించింది. ప్రపంచలోనే అత్యధిక ట్విటర్‌ ఫాలోవర్లు ఉన్న కేంద్ర బ్యాంకుగా అవతరించింది. ఆర్‌బీఐ అధికారిక ట్విటర్‌ ఖాతా ‘‘RBI Twitter’’ తాజాగా 10 లక్షల మంది ఫాలోవర్లను సొంతం చేసుకుంది. ప్రపంచ వ్యాప్తంగా అత్యంత పేరెన్నికగన్న యూఎస్‌ ఫెడరల్‌ రిజర్వ్‌ 6.67 లక్షల ఫాలోవర్లతో రెండో స్థానంలో నిలవగా.. యూరోపియన్‌ సెంట్రల్‌ బ్యాంకు (ఈసీబీ) 5.91లక్షల మందితో మూడో స్థానంలో ఉంది.

* వరద సాయం పంపిణీలో తెరాస నేతలు అవినీతికి పాల్పడ్డారని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి ఆరోపించారు. హైదరాబాద్‌ను అభివృద్ధి చేసింది కాంగ్రెస్‌ పార్టీయే అని పునరుద్ఘాటించారు. మెట్రో రైలు, పీవీ ఎక్స్‌ప్రెస్‌ వే, కృష్ణా జలాలు ఇలా.. ఎన్నో అభివృద్ధి పనులను చేపట్టామన్నారు. గాంధీభవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఉత్తమ్‌ మాట్లాడారు. కరోనాతో ప్రజలు చనిపోతున్నా.. ఆ వ్యాధిని ఆరోగ్యశ్రీ పరిధిలో చేర్చలేదని విమర్శించారు.

* ఐపీఎల్‌లో గొప్ప ప్రదర్శన చేసినా ముంబయి బ్యాట్స్‌మన్ సూర్యకుమార్‌ యాదవ్‌ను ఆస్ట్రేలియా పర్యటనకు ఎంపిక చేయకపోవడంపై చర్చలు జోరుగా సాగిన సంగతి తెలిసిందే. సెలక్టర్లపై విమర్శలు వెల్లువెత్తాయి. టీమిండియా ప్రధాన కోచ్‌ రవిశాస్త్రి సైతం సూర్య ఓపికతో ఉండాలని, తప్పక అవకాశం వస్తుందని ట్వీ‌ట్ చేశాడు. అయితే ఆస్ట్రేలియా సుదీర్ఘ పర్యటనకు ఎంపిక కాకపోవడంపై భావోద్వేగానికి గురైనట్టు పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో సూర్యకుమార్‌ పేర్కొన్నాడు.

* ఎంఐఎంకు చెందిన చార్మినార్‌ ఎమ్మెల్యే ముంతాజ్‌ అహ్మద్‌ఖాన్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. తమ పార్టీ తలచుకుంటే రెండు నెలల్లో తెరాస ప్రభుత్వాన్ని దించేయగలమన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో భాగంగా మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఎంఐఎంకు సీటులో కూర్చొబెట్టడమూ.. దించడమూ తెలుసన్నారు. మంత్రి కేటీఆర్‌ను ఉద్దేశిస్తూ ఆయన ఇప్పుడే కళ్లు తెరిచిన చిలుక అని వ్యాఖ్యానించారు.

* తక్కువ ధర ఎక్కువ ఫీచర్లతో ఫోన్‌ అందించాలనే లక్ష్యంతో షావోమి ప్రవేశపెట్టిన రెడ్‌మీ బ్రాండ్‌కు భారత మార్కెట్లో విశేష ప్రజాదరణ లభించింది. ఈ క్రమంలోనే రెడ్‌మీ బ్రాండ్ తొలి 5జీ ఫోన్లను త్వరలో భారత మార్కెట్లోకి విడుదల చేయనున్నారు. రెడ్‌మీ నోట్ 9 ప్రో 5జీ, రెడ్‌మీ నోట్ 9 5జీ పేరుతో ఈ ఏడాది మార్చిలో విడుదల చేసిన రెడ్‌మీ నోట్ 9 ప్రో సిరీస్‌కి కొనసాగింపుగా వీటిని తీసుకొస్తున్నారు. మరి ఈ ఫోన్ల ధర, ఫీచర్లు ఎలా ఉంటాయనేది ఒకసారి చూద్దాం.