Devotional

తెలుగు రాష్ట్రాల్లో కార్తికమాస సందడి

Kartika Masam Rush In Telugu States

కార్తికమాసం రెండో సోమవారం కావడంతో తెలుగు రాష్ట్రాల్లో భక్తులు నదీ స్నానాలు చేసేందుకు పోటెత్తారు. దీంతో నదీతీరాలు శివనామస్మరణతో మార్మోగాయి. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం వశిష్ఠ గోదావరి నది వద్ద వేకువజాము నుంచే భక్తులు నదిలో పుణ్యస్నానాలు ఆచారించి కార్తిక దీపాలను నదిలో వదిలారు. కార్తిక మాసంలో నదీస్నానం ఆచరించి కార్తిక దీపాలను వెలిగిస్తే పుణ్య ఫలం లభించడంతో పాటు స్వర్గప్రాప్తి పొందుతారని భక్తుల విశ్వాసం. గోదావరి తీరంలో కార్తిక శోభ విరాజిల్లుతోంది. కరోనా కారణంగా రాజమహేంద్రవరంలో గోదావరి స్నానాలు నిషేధించారు. నదిలో స్నానాలు చేయకుండా పుష్కరఘాట్‌లలో బారికేడ్లు ఏర్పాటు చేశారు. భక్తులు జల్లు స్నానాలు చేసేందుకు ఏర్పాట్లు చేశారు. శివనామస్మరణతో ఆలయాలు మార్మోగాయి. పంచారామ క్షేత్రాలైన ద్రాక్షారామం, సామర్లకోట, పిఠాపురం కుక్కుటేశ్వరస్వామి, కోనసీమలోని ప్రముఖ ఆలయాలకు భక్తులు పోటెత్తారు. కృష్ణా జిల్లా దివిసీమలోని పెదకళ్లేపల్లి దుర్గానాగేశ్వరస్వామి, ఘంటసాల గ్రామంలోని జలదీశ్వరస్వామి ఆలయం, మోపిదేవిలోని సుబ్రమణ్యేశ్వస్వామి ఆలయం, నడకుదురు పృథ్వీశ్వరస్వామి ఆలయంలో రెండవ కార్తిక సోమవారం పురస్కరించుకుని భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.