DailyDose

తెలుగు రాష్ట్రాలపైకి దూసుకువస్తున్న నివర్-తాజావార్తలు

Breaking News - Nivar Storm Coming At Faster Pace Towards Telugu States

* తీరం దాటే సమయానికి అతి తీవ్ర తుపానుగా నివర్.బంగాళాఖాతంలో కొనసాగుతున్న ‘నివర్’ తుపాను క్రమంగా తీరంవైపు కదులుతోంది.రేపు సాయంత్రం ఇది తమిళనాడులోని కారైక్కాల్, మామల్లపురం (మహాబలిపురం) వద్ద తీరం దాటనుందని భారత వాతావరణ విభాగం ప్రత్యేక బులెటిన్ లో వెల్లడించింది.అయితే ఇది తీరం దాటే సమయానికి అతి తీవ్ర తుపానుగా మారే అవకాశాలు ఉన్నాయని అంచనా వేస్తోంది.ప్రస్తుతం ఇది పుదుచ్చేరికి తూర్పు ఆగ్నేయ దిశలో 380 కిలోమీటర్ల దూరంలోనూ, చెన్నైకి ఆగ్నేయ దిశగా 430 కిలోమీటర్ల దూరంలోనూ ఉన్నట్టు తెలుస్తోంది.దీని ప్రభావంతో తమిళనాడులో ఇప్పటికే వర్షాలు మొదలయ్యాయి.ఇక ‘నివర్’ కారణంగా ఏపీలోని దక్షిణ కోస్తా రాయలసీమ జిల్లాల్లోనూ భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ పేర్కొంది.ముఖ్యంగా ఈ తుపాను ప్రభావం రాయలసీమ జిల్లాలపై అధికంగా ఉంటుందంటూ రెడ్ అలర్ట్ జారీ చేశారు. దక్షిణ కోస్తా జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ అయింది.నెల్లూరు, చిత్తూరు, అనంతపురం, కడప జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని తెలిపింది.’నివర్’ దూసుకొస్తున్న నేపథ్యంలో నెల్లూరులో ఒకటో నెంబరు ప్రమాద హెచ్చరిక జారీ చేశారు.రేపటి నుంచి 27వ తేదీ వరకు భారీ వర్షాలు కురిసే అవకాశముందని వెల్లడించారు.’నివర్’ భూభాగంపైకి ప్రవేశించిన తర్వాత కూడా కొన్ని గంటల పాటు తుపాను స్థాయిలోనే కొనసాగుతుందని భావిస్తున్నారు.

* విద్యుత్‌ సరఫరా వ్యవస్థకూ సైబర్‌ ముప్పు పొంచి ఉందని కేంద్రం అన్ని రాష్ట్రాలను హెచ్చరించింది. విదేశాల నుంచి దిగుమతి చేసుకొనే విద్యుత్‌ నిర్వహణ సంబంధ ఎలక్ట్రానిక్‌ పరికరాలు, విడిభాగాల్లో మాల్‌వేర్‌/ట్రోజన్స్‌ తదితర వైరస్‌లను హ్యాకర్లు చొప్పించే ప్రమాదం ఉందని, వాటి వాడకం వల్ల విద్యుత్‌ సరఫరా వ్యవస్థ (గ్రిడ్‌)పై సైబర్‌ దాడులు జరిగే అవకాశాలున్నాయని పేర్కొంది. రాష్ట్రాలకు పలు సూచనలు చేసింది. ఇటీవల చైనాతో సరిహద్దుల వెం బడి ఉద్రిక్తతలు ఏర్పడిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ముందుజాగ్రత్త చర్యలు చేపట్టింది. కేంద్రం సూచనలివీ…విద్యుత్‌ సరఫరా వ్యవస్థ కోసం విదేశాల నుంచి దిగుమతి చేసుకొనే అన్ని రకాల పరికరాలు, విడిభాగాల్లో మాల్‌వేర్‌/ట్రొజన్స్‌/సైబర్‌ ముప్పు ఉందా అని పరీక్షించించాలి. ఇవి భారతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నాయని నిర్ధారించుకోవాలి. కేంద్ర విద్యుత్‌ మంత్రిత్వ శాఖ గుర్తించిన సరి్టఫైడ్‌ ల్యాబ్‌లలో మాత్రమే ఈ పరీక్షలు నిర్వహించాలి. చైనా, పాకిస్తాన్‌ వంటి కొన్ని దేశాల నుంచి లేదా ఆయా దేశాల వ్యక్తుల యాజమాన్యంలోని కంపెనీ ల నుంచి పరికరాలు, విడిభాగాలను దిగుమతి చేసుకోవడానికి తప్పనిసరిగా కేంద్రం నుంచి అనుమతి తీసుకోవాలి.

* భారత్‌లో గత కొన్ని రోజులు నుంచి కలవరపెడుతున్న కరోనా కేసులు సోమవారం కాస్త తగ్గుముఖం పట్టాయి. అంతకుముందు వరుసగా రెండు రోజులు కోలుకున్న వారి కంటే కొత్త వైరస్‌ కేసులే ఎక్కువగా ఉండగా.. తాజాగా రికవరీల సంఖ్యే ఎక్కువగా ఉండటం ఊరటనిస్తోంది. ఇక కొత్త కేసులు కూడా మళ్లీ 40వేల దిగువన నమోదయ్యాయి.

* కరోనా నేపథ్యంలో మరోసారి ముఖ్యమంత్రులతో ప్రధాని నరేంద్ర మోదీ సమీక్ష నిర్వహించాలని భావిస్తున్నట్లు సమాచారం.రాష్ట్రాల ముఖ్య మంత్రులు, ఉన్నతాధికారులతో ప్రధాని మంగళవారం సమావేశమయ్యే అవకాశముందని అధికారిక వర్గాలు వెల్లడించాయి.వీడియో కాన్ఫరెన్స్​ ద్వారా ఈ భేటీ జరగనుందని పేర్కొన్నాయి.కొవిడ్ నేపథ్యంలో ప్రస్తుత పరిస్థితులు సహా వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తే పాటించాల్సిన​ పంపిణీ వ్యూహాలపై ఈ భేటీలో ప్రధానంగా చర్చ జరగనుందని అధికారిక వర్గాలు తెలిపాయి.ఈ భేటీలో దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్​ కేజ్రివాల్, బంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సహా ఇతర రాష్ట్రాల సీఎంలు పాల్గొనున్నారని అధికారిక వర్గాలు తెలిపాయి.దేశవ్యాప్తంగా రోజువారీ కేసులు తగ్గినా.. పలు పట్టణాల్లో కొవిడ్ తీవ్రత ఇంకా తగ్గలేదు.ఈ నేపథ్యంలో పలు పట్టణాల్లో రాత్రి పూట కర్ఫ్యూ వంటి చర్యలకు దిగాయి రాష్ట్ర ప్రభుత్వాలు.

* బాపట్ల మండలం సూర్యలంక వాయుసేన కేంద్రంలో మంగళవారం నుంచి క్షిపణి పరీక్షలు నిర్వహించడానికి వైమానిక దళం అన్ని ఏర్పాట్లు చేసింది.ఈ నెల 24, 25, 27, డిసెంబరు 1, 2న కంబైన్డ్‌ గైడెడ్‌ మిస్సైల్‌ వెహికల్‌ ద్వారా భూతలం నుంచి నింగిలోని నిర్దేశిత లక్ష్యాలను చేధించే ఆకాష్‌, ఇగ్లా, స్పైడర్‌, ఓఎస్‌ఏ-ఏకే-ఎం క్షిపణులను సూర్యలంక సముద్ర తీరంలో పరీక్షించనున్నారు.

* తెలంగాణ రాష్ట్రంలో నిన్న రాత్రి 8గంటల వరకు 42,740 మందికి కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించగా 921 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.

* ఏపీలో కొత్త జిల్లాలు ఏర్పాటవుతున్న నేపథ్యంలో ఐపీఎస్‌ అధికారుల సంఖ్యను పెంచాలని డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ కేంద్ర హోంశాఖకు విజ్ఞప్తి

* ‘సాధనాత్‌ సాధ్యతే సర్వం’ అంటే సాధన చేస్తే సాధ్యం కానిది లేదు అని. దీనికి చక్కటి ఉదాహరణే ఈ ఘటన. పొట్టి శ్రీరాములు నెల్లూరుకు చెందిన ప్రభాకర్ రెడ్డి అనే మార్షల్ ఆర్ట్స్‌ నిపుణుడు అరుదైన స్టంట్‌ ప్రదర్శించి గిన్నిస్‌ రికార్డు నెలకొల్పాడు. ఎంతో ప్రమాదంతో కూడిన ఈ స్టంట్ కోసం ఆయన ఎంతో సాధన చేశారట. ఇంతకీ ఆయన ఏం చేశారంటే..తలతో నిమిషంలో 68 కూల్‌డ్రింక్‌ సీసా మూతలను తెరిచి సరికొత్త గిన్నిస్‌ వరల్డ్ రికార్డ్ నెలకొల్పాడు. ఈ మేరకు గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డ్‌ సంస్థ ప్రమాదకరమైన ఈ స్టంట్‌ను ఇంట్లో ఎవరు ప్రయత్నించొద్దని సూచిస్తూ ప్రభాకర్ రెడ్డి స్టంట్‌ వీడియోను ట్వీట్ చేసింది.

* రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ తిరుమల పర్యటనలో చిత్తూరు జిల్లా కలెక్టర్‌ సహా పలువురు అధికారులకు చేదు అనుభవం ఎదురైంది. లోనికి అనుమతి లేదంటూ మహాద్వారం వద్ద తితిదే విజిలెన్స్‌ సిబ్బంది అడ్డుకోవడం కలకలం రేపింది. మహాద్వారం వద్ద రాష్ట్రపతి లోనికి వెళ్తుండగా జిల్లా కలెక్టర్‌ భరత్‌ గుప్తా, ఇంటెలిజెన్స్‌ ఎస్పీ విజయారావు, సీఎంవో అధికారి ఆలస్యంగా అక్కడికి వచ్చారు. వారు లోపలికి వెళ్లకుండా తితిదే విజిలెన్స్‌ అధికారులు అడ్డుకున్నారు. ఈ పరిస్థితుల్లో అధికారులు ముందుకు వెళ్లలేక కాసేపు అక్కడే ఉండిపోయారు. ఫోన్‌లో ఇతర అధికారులను సంప్రదించిన కలెక్టర్‌ సమస్యను వివరించారు. హుటాహుటిన అక్కడికి చేరుకున్న తిరుపతి అదనపు ఎస్పీ సుప్రజ.. వారిని దగ్గరుండి లోపలికి తీసుకెళ్లారు.

* కరోనా కారణంగా ఆదాయం భారీగా పడిపోయినందున కేంద్ర ప్రభుత్వ అత్యవసర నిధి నుంచి సాయం అందించాలని ఏపీ ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి కోరారు. దిల్లీలో కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్‌తో బుగ్గన భేటీ అయ్యారు. కరోనాపై పోరులో రాష్ట్రానికి సాయంపై ఆయనతో చర్చించారు. కరోనా నేపథ్యంలో ప్రభుత్వంపై అదనపు భారం పడిందని.. కొవిడ్‌ కేర్‌కు సంబంధించి మందులు, పీపీఈ కిట్లు ఇతరత్రా అవసరాల నిమిత్తం రూ.981 కోట్ల సాయం అందించాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో వైద్య కళాశాలల మంజూరు అంశంపై కేంద్ర మంత్రితో బుగ్గన చర్చించారు. రాష్ట్రంలో జిల్లాల పరిమాణం పెద్దదని.. ఈ మేరకు భవిష్యత్‌ అవసరాలను దృష్టిలో పెట్టుకొని గరిష్ఠ ప్రయోజనం పొందేలా చూడాలని కోరారు.

* సూపర్‌సోనిక్‌ క్రూయిజ్‌ క్షిపణి బ్రహ్మోస్‌ను భారత్‌ మరోసారి విజయవంతంగా ప్రయోగించింది. వరుస ప్రయోగాల్లో భాగంగా మంగళవారం భూ ఉపరితలం నుంచి మరో చోటుకు పరీక్షించింది. బ్రహ్మోస్‌ వాస్తవ దాడి పరిధి 290 కి.మీ ఉండగా దానిని ఇప్పుడు 400 కిలోమీటర్లకు పెంచారు. ఇక శబ్ద వేగానికి మూడు రెట్లు లేదా 2.9 మాక్‌ల వేగాన్ని మెయింటెన్‌ చేశారు.

* ప్రపంచంలోనే తొలి కరోనా వ్యాక్సిన్‌గా రిజిస్టర్‌ చేసుకున్న రష్యా వ్యాక్సిన్‌ ‘స్పుత్నిక్‌-వి’ తాజాగా మరో శుభవార్త చెప్పింది. వ్యాక్సిన్‌ రెండో మధ్యంతర విశ్లేషణ ఫలితాల్లోనూ స్పుత్నిక్‌-వి వ్యాక్సిన్‌ 95శాతం సామర్థ్యం కలిగి ఉన్నట్లు రష్యా ఆరోగ్యశాఖ ప్రకటించింది. వ్యాక్సిన్‌ రెండు డోసులను 21రోజుల వ్యవధిలో ఇచ్చిన అనంతరం ఫలితాలను విశ్లేషించారు. తొలి డోసు తీసుకున్న 28 రోజుల తర్వాత (రెండో డోసు తీసుకున్న 7రోజులు) 91.4శాతం సామర్థ్యం కనిపించినట్లు ఇప్పటికే వెల్లడించింది. ఇక తొలిడోసు తీసుకున్న 42రోజుల తర్వాత (రెండో డోసు తీసుకున్న 21 రోజులకు) వ్యాక్సిన్‌ 95శాతం సమర్థత ఉన్నట్లు తాజాగా రష్యా ఆరోగ్యశాఖ విభాగం (గమలేయా కేంద్ర బృందం) ప్రకటించింది.