Politics

జగన్ ఛాంబర్‌కు కాకినాడ పంచాయతీ

YS Jagan Enquires About Kakinada DRC Fight

కాకినాడలో వైకాపా నేతల పంచాయితీ ఏపీ సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి వద్దకు చేరింది. ఇటీవల జరిగిన డీఆర్సీ సమావేశంలో ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి, ఎంపీ సుభాష్‌చంద్రబోస్‌ పరస్పరం తీవ్రస్థాయిలో ఆరోపణలు చేసుకున్న విషయం తెలిసిందే. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన సీఎం జగన్‌.. తనను కలవాలని ఇద్దరు నేతలను ఆదేశించారు. సీఎం ఆదేశాలతో తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయానికి చేరుకున్న ద్వారంపూడి, సుభాష్‌చంద్రబోస్‌ సీఎంతో సమావేశమయ్యారు. సీఎం జగన్‌ ఇరువురి వివరణ తీసుకుంటున్నట్లు సమాచారం. అధికారికంగా నిర్వహించిన సమావేశంలో వైకాపా నేతలే ఈ తరహా వాగ్వాదాలకు దిగడం.. అవినీతి ఆరోపణలు చేసుకోవడంపై ఆయన అసహనం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. తూర్పు గోదావరి జిల్లా కాకినాడ డీఆర్సీలో జరిగిన సమావేశంలో టిడ్కో ఇళ్ల కేటాయింపుల్లో అవినీతి జరిగిందని పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌ ఆరోపించారు. కాగా ఆ వ్యాఖ్యలను అదే పార్టీకి చెందిన కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి ఖండించారు. దీంతో వారిద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఆరోపణలు, ప్రతి ఆరోపణలతో సభ రసాభాసగా మారింది. దీంతో ఆ సమావేశాన్ని జిల్లా కలెక్టర్‌ అర్ధాంతరంగా ముగించారు. ఈ వివాదం కాస్తా సీఎం జగన్‌ దృష్టికి వెళ్లడంతో వారిద్దరు వివరణ ఇవ్వాల్సిన పరిస్థితి నెలకొంది.