Fashion

ఏడువారాల నగలు…ఏయే రోజున పెట్టుకోవాలి?

ఏడువారాల నగలు…ఏయే రోజున పెట్టుకోవాలి?

నగలంటే ఇష్టపడని స్ర్తిలు ఎవరూ ఉండరు. పండుగలన్నా, శుభకార్యాలన్నా ముందు స్ర్తిల చూపు నగలపైనే. ఎవరు ఎలాంటి నగలు పెట్టుకుని వచ్చారు అని చూస్తుంటారు. దాదాపుగా అందరు స్ర్తిలు ఏదైనా శుభకార్యానికి వెళ్లేటప్పుడు అందర్లోకి భిన్నంగా కనిపించాలని, కొత్తగా కనిపించాలని అనుకుంటూ తయారవుతారు. వారు ధరించే నగలను అందరూ చూడాలని, తమ దగ్గర ఉన్న నగలు ఎవరి దగ్గరా ఉండకూడదనే భావన కూడా చాలామంది దగ్గర ఉంటుంది. అయితే ఇప్పుడు అన్నీ లేటెస్ట్ నగల ట్రెండ్ నడుస్తోంది కానీ పెళ్లిళ్లు వంటి సాంప్రదాయ శుభకార్యాల దగ్గరకు వచ్చేటప్పటికి అందరూ పురాతన నగలు, పాత నగలను వేసుకోవడానికి ఇష్టపడతారు.అలాంటి వాటిలో ముందుగా నిలిచేవి ఏడువారాల నగలు. అలాంటి నగల గురించి తెలుసుకోవడం, ధరించడం అందరికీ నచ్చే విషయం. అయితే నగలు ఎన్నో రకాలు ఉన్నా ప్రత్యేకించి ఏడువారాల నగలు అని పురాణాల్లో, పెద్దల మాటల్లో, కథల్లో, సినిమాల్లో వింటూ ఉంటాం. అవి ఏంటో, ఎలా ఉంటాయో, ఏయే రోజుల్లో ఏవి ధరించాలో తెలుసుకుందాం..
* వారాన్ని అనుసరించి ఆ రోజుకి ఉండే గ్రహాధిపతిని బట్టి ఏ ఏ నగలు ఎప్పుడెప్పుడు ధరించారో చెప్పారు పెద్దలు. అలా..
* ఆదివారం సూర్యునికి ఇష్టమైన రోజు కాబట్టి ఆ రోజు కెంపుతో చేసిన నగలు, హారాలు, కమ్మలను ధరించాలి.
* సోమవారం చంద్రునికి ఇష్టమైన రోజు. ఆ రోజున ముత్యాల హారాలు, ముత్యాల గాజులతో అలంకరించుకునేవారు అప్పటితరం ఆడవారు.
* మంగళవారం కుజుడికి ఇష్టమైన వారం. ఆ రోజు పగడాలతో చేసిన నగలను పెట్టుకోవాలి.
* బుధవారం బుధుడికి ఇష్టమైన రోజు. ఆ రోజు ఆయనకిష్టమైన పచ్చల హారాలు, గాజులు వేసుకోవాలి.
* గురువారం వంతు బృహస్పతిది. అందుకే గురువారం రోజు పుష్యరాగంతో చేసిన కమ్మలు, ఉంగరాలు ధరించాలి.
* శుక్రవారం శుక్రుడికి ఇష్టమైన రోజు. అందుకే ఆ రోజు వజ్రాల హారాలు, ముక్కుపుడక ధరించి లక్ష్మీదేవిలా దర్శనమిచ్చేవారు.
* శనివారం శనిభగవానుడికి ఇష్టమైన రోజు కాబట్టి ఆ రోజున ఆయనకిష్టమైన నీలాల నగలను ధరించాలి. నీలంతో చేసిన కమ్మలు, ముక్కుపుడక పెట్టుకోవాలి.
ఇలా.. ఒక్కోరోజు ఒక్కో రత్నంతో చేసిన నగలను వేసుకునేవారు అప్పటితరం ఆడవారు. అలాకాకుండా మొత్తం నవరత్నాలతో కమ్మలు, ముక్కుపుడక, హారం, పాపిడిబిళ్ల, వంకీలు.. ఇలా ఎన్నయినా, ఏవైనా చేయించుకోవచ్చు. ఇలా నవరత్నాలతో కూడిన నగలు, వారానికి అనుగుణంగా అలంకరించుకోవడం కన్నా స్ర్తికి గొప్ప వైభోగం మరొకటి ఉండదు.