Politics

జగన్‌కు నూతనంగా భారీ భద్రత-తాజావార్తలు

Breaking News - Jagan Gets New Increased Security

* ఏపీ సీఎం జగన్‌ అధ్యక్షతన వెలగపూడిలోని సచివాలయంలో సమావేశమైన రాష్ట్ర మంత్రివర్గం భారీ వర్షాలు, నివర్‌ తుపానుపై చర్చించింది. నష్ట పరిహారం అంచనాలను డిసెంబరు 15 నాటికి పూర్తి చేయాలని ఈ సందర్భంగా సీఎం ఆదేశించారు. కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలకు అనుగుణంగా పరిహారం అందించాలని సీఎం సూచించారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 40వేల హెక్టార్లలో పంట నష్టం వాటిల్లిందని ప్రాథమికంగా అంచనావేసినట్టు అధికారులు సీఎంకు వివరించారు. జనవరి 2021 నాటికి పరిహారం చెల్లించాలని సీఎం ఆదేశించారు. అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెట్టే వివిధ ముసాయిదా బిల్లులకు ఆమోదంపై కేబినెట్‌లో చర్చించినట్టు సమాచారం. మంత్రి మండలి సమావేశంలో పాల్గొనేందుకు సీఎం జగన్‌ సచివాలయానికి వెళ్తుండగా.. మందడంలో రైతులు జై అమరావతి అంటూ నినాదాలు చేశారు. మంత్రివర్గ సమావేశం నేపథ్యంలో మందడంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. దీక్షా శిబిరం నుంచి రైతులు బయటకు రాకుండా రెండంచెల భద్రత ఏర్పాటు చేశారు. భారీ భద్రత నడుమ సీఎం సచివాలయానికి చేరుకున్నారు. పోలీసుల తీరును నిరసిస్తూ రైతులు జై అమరావతి అంటూ నినాదాలు చేశారు. ఏ ముఖ్యమంత్రి రైతులకు భయపడి ఇంత భద్రత మధ్య సచివాలయానికి వెళ్లలేదని ఈ సందర్భంగా రైతులు ఆరోపించారు.

* నెల్లూరులోని మ్యూజిక్‌, డ్యాన్స్‌ ప్రభుత్వ పాఠశాలకు డాక్టర్‌ ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం పేరు పెట్టడం పట్ల ఆయన కుమారుడు ఎస్పీ చరణ్‌ హర్షం వ్యక్తం చేశారు. తన తండ్రికి దక్కిన గొప్ప గౌరవమని, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, ఏపీ ప్రభుత్వానికి ట్విటర్‌ వేదికగా ధన్యవాదాలు తెలిపారు. కాగా పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని ప్రభుత్వ సంగీత, నృత్య పాఠశాలకు గానగంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పేరును చేరుస్తూ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి ట్వీట్ చేశారు.

* ఉప్పాడ కొత్తపల్లి సముద్రతీరంలో బంగారం కోసం ప్రజలు వెతుకులాట…ఓ మహిళకు సముద్ర కెరటాల నుండి వచ్చిన బంగారం దొరకడంతో భారీగా తరలివస్తున్న ప్రజలు. సముద్ర తీరం వద్ద దేవాలయం తుఫాను తాకిడి కుప్పకూలడంతో ఆ బంగారం దొరికి వుండవచ్చునని, ప్రజలు సముద్ర తీరానికి ప్రజలు రావొద్దని హెచ్చరిస్తున్న అధికారులు.

* పాకిస్థాన్​ సైన్యం​ దురాగతాలు కొనసాగిస్తూనే ఉంది.రాజౌరీ జిల్లాలోని సుందర్బనీ సెక్టార్​లో నియంత్రణ రేఖ(ఎల్​ఓసీ) వెంబడి కాల్పులకు తెగబడి.. మరోసారి తన వక్రబుద్ధిని బయటపెట్టింది.శుక్రవారం జరిగిన ఈ ఘటనలో ఇద్దరు భారత సైనికులు అమరులయ్యారని రక్షణ శాఖ తెలిపింది.

* సీఎం జగన్‌కు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు లేఖ రాశారు.రైతులను ఆదుకోవాలంటూ లేఖలో సీఎంను కోరారు. నివర్ తుపాను రైతులను కోలుకోలేని దెబ్బతీసిందన్నారు.ఆగస్ట్ నుంచి అక్టోబర్ వరకు కురిసిన వర్షాలకు రూ.9,720 కోట్ల మేర నష్టం వాటిల్లిందన్నారు.వరుస విపత్తులతో నష్టపోయిన రైతులను ఆదుకోవాలని కోరారు.దెబ్బతిన్న పంటలను ప్రభుత్వమే మద్దతు ధరకు కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.రైతులకు త్వరితగతిన పంట నష్ట పరిహారం అందజేయాలని అచ్చెన్నాయుడు డిమాండ్ చేశారు.

* రోజురోజుకీ కరోనా కేసులు పెరిగిపోతున్న వేళ ముంబయి రైల్వే అధికారులు కీలక చర్యలు చేపట్టారు. నగరంలో సేవలందించే లోకల్‌ ట్రైన్లలోకి పిల్లలకు అనుమతి లేదని ముంబయి సెంట్రల్‌ రైల్వే అధికారులు శుక్రవారం ప్రకటించారు. ‘ముంబయి మెట్రోపాలిటన్‌ ప్రాంతంలో లోకల్‌ ట్రైన్‌లలోకి కేవలం మహిళా ప్రయాణికులకు మాత్రమే ప్రవేశం ఉంటుంది. పిల్లలతో కలిసి ప్రయాణం చేసే మహిళలు ఈ నియమాలు పాటించాలి’ అని డీఆర్‌ఎం -ముంబయి సెంట్రల్‌ ట్వీట్ చేసింది. కరోనా సెకెండ్‌ వేవ్‌ నేపథ్యంలో రైళ్లలో ఎక్కువ సంఖ్యలో మహిళలు తమ పిల్లలతో ప్రయాణిస్తున్నారని గ్రహించి ఈ నిర్ణయం తీసుకున్నారు. దీంతో రైల్వే స్టేషన్‌ ప్రవేశ ద్వారాల వద్ద సిబ్బందిని ఏర్పాటు చేసి పిల్లలతో వచ్చే మహిళలను నిలిపివేయనున్నారు. ఈ క్రమంలో రైల్వే భద్రతా సిబ్బందికి అందరు సహకరించాలని డీఆర్‌ఎం ముంబయి ట్విటర్‌లో విజ్ఞప్తి చేసింది. మహారాష్ట్ర్ర ప్రభుత్వం ‘బిగిన్‌ అగైన్‌’మిషన్‌ ద్వారా మహిళలకు లోకల్‌ ట్రైన్‌లలో ప్రవేశం కల్పించింది. మహారాష్ట్రలో గురువారం 6,406 కరోనా కేసులు నమోదైన విషయం తెలిసిందే.

* తల్లి కష్టాలు తీర్చేందుకు అత్తారింట్లో కోడలు దొంగతనం చేసిన ఘటన సికింద్రాబాద్ పరిధిలో చోటుచేసుకుంది. జవహర్ నగర్ యాప్రాల్ కింది బస్తీలో… ఈ నెల 23న చోరీ జరిగింది. ఇంటి యజమాని ఫిర్యాదుతో దర్యాప్తు చేపట్టిన పోలీసులు అది ఇంటిదొంగల పనేనని తేల్చారు. అప్పులపాలైన తల్లికి సాయం చేసేందుకు అత్త ఇంట్లో కోడలే చోరీ చేసిందని నిర్ధరించారు. సీసీటీవీ దృశ్యాల ఆధారంగా కోడలే బంగారం అపహరించినట్టు తెలిపారు. తల్లి లీలావతి, కుమార్తె సోనీని అరెస్టు చేశారు. నిందితుల నుంచి 44 తులాల బంగారం, 15 తులాల వెండిని స్వాధీనం చేసుకున్నారు.

* ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల్లో 57,752 కరోనా పరీక్షలు నిర్వహించగా.. 733 మందికి పాజిటివ్‌ నిర్ధారణ కాగా..ఆరుగురు మృతి చెందారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన కేసుల సంఖ్య 8,66,438కి చేరింది. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ బులెటిన్‌ విడుదల చేసింది. తాజా మరణాలతో కలిపి రాష్ట్రంలో ఇప్పటివరకు 6,976 మంది కొవిడ్‌ బారినపడి ప్రాణాలు కోల్పోయారు. గడిచిన 24 గంటల్లో 1,205 మంది బాధితులు కోలుకోగా.. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు 8,47,325 మంది బాధితులు కోలుకొని ఇళ్లకు వెళ్లిపోయారు. ఇప్పటివరకు రాష్ట్రంలో 99,13,068 కరోనా సాంపుల్స్‌ని పరీక్షించినట్లు ఆరోగ్య శాఖ బులెటిన్‌లో తెలిపింది.

* గ్రేటర్‌ ఎన్నికల నేపథ్యంలో ఓటర్లకు నగదు పంపిణీ చేస్తున్నారనే ఆరోపణల నెపంతో భాజపా, తెరాస కార్యకర్తల మధ్య రామంతాపూర్‌ డివిజన్‌లో ఘర్షణ చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్లితే..రామంతాపూర్‌ డివిజన్‌ తెరాస ఇన్‌ఛార్జి, పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అనుచరులు ఓటర్లకు నగదు పంపిణీ చేస్తున్నారంటూ భాజపా కార్యకర్తలు ఆరోపించారు. శారదానగర్‌లోని ఓ ఇంటిలో ఉన్న ఆయన అనుచరుల వద్దకు భాజపా కార్యకర్తలు చేరుకున్నారు. ఈ క్రమంలో అక్కడ ఇరువర్గాల మధ్య మాటామాటా పెరిగి ఘర్షణకు దారితీసింది. ఒకరినొకరు నెట్టుకోవడంతో స్వల్ప ఉద్రిక్తత చోటుచేసుకుంది. విషయం తెలుసుకున్న ఉప్పల్‌ పోలీసులు.. ఘటనాస్థలానికి చేరుకుని ఇరువర్గాలకు చెందినవారిని ఠాణాకు తీసుకెళ్లారు. కేసును దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.

* తన ప్రత్యర్థి జో బైడెన్‌ విజయాన్ని ససేమిరా అంగీకరించనంటూ మంకుపట్టు పట్టిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌.. కాస్త మెత్తబడ్డారు. అధికార నివాసం వైట్‌ హౌస్‌ను వదిలి వెళ్లేందుకు ఎట్టకేలకు అంగీకరించారు. అయితే అందుకు ఓ షరతు ఉందంటూ మెలిక పెట్టారు. బైడెన్‌ గెలిచినట్టు అధికారికంగా నిర్ధారణ అయితే అందుకు సిద్ధమని ప్రకటించారు.అగ్రరాజ్యం రాజకీయాల్లో ఇదివరకు ఎన్నడూ లేని విధంగా.. ఎన్నికల ఫలితాలను అంగీకరించనంటూ ట్రంప్ మొండికేసిన సంగతి తెలిసిందే. తన వాదనకు సమర్థింపుగా బ్యాలెట్లు ఎత్తుకెళ్లారని, ఓటింగ్‌ యంత్రాలు లక్షలాది ఓట్లను మాయం చేశాయని, పోస్టల్‌ ఓట్లు చెల్లవంటూ వింత కారణాలతో.. ఆధారంలేని కేసులతో న్యాయస్థానం తలుపుతట్టారు. అయితే వాటన్నింటినీ కోర్టులు కొట్టివేశాయి. ఈ నేపథ్యంలో ట్రంప్‌ కాస్త మెత్తబడినట్టే కనబడుతోంది. ఎలక్టోరల్ కాలేజీ గనక బైడెన్‌ విజయాన్ని ధ్రువీకరిస్తే.. శ్వేతసౌధాన్ని వదిలేందుకు సిద్ధమేనా? అంటూ విలేకరులు అడిగిన ప్రశ్నకు.. ‘‘తప్పకుండా అలాగే చేస్తాను.. ఆ సంగతి మీకు తెలుసు కదా’’ అంటూ ట్రంప్‌ సమాధానమిచ్చారు. నవంబర్‌ 3న జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రటిక్‌ అభ్యర్థి జో బైడెన్‌ 306, ట్రంప్‌ 232 ఎలక్టోరల్‌ ఓట్లు సాధించిన సంగతి తెలిసిందే. ఇక అమెరికా అధ్యక్ష పీఠం ఎవరిదనే విషయాన్ని ప్రతి రాష్ట్రం నుంచి వచ్చే ప్రతినిధులతో కూడిన ఎలక్టోరల్ కాలేజీ బృందం అధికారికంగా నిర్ణయిస్తుంది. కాగా ఇది డిసెంబర్‌ 14న సమావేశం కానుంది.అయితే, చట్టసభ సభ్యులు బైడెన్‌ విజయాన్ని ఆమోదిస్తే వారు పెద్ద తప్పు చేసినట్టే అవుతుందని ట్రంప్‌ అన్నారు. ఓటమిని ఒప్పుకోవటం చాలా కష్టంగా ఉందంటూ వాపోయారు. పూర్తిగా ఆశ వీడని ట్రంప్‌.. ప్రమాణ స్వీకారం చేయాల్సిన జనవరి 20కి మధ్య ఎన్నో సంఘటనలు జరగొచ్చంటూ సన్నాయి నొక్కులు నొక్కారు. అసలీ ఎన్నికలే పెద్ద మోసమని, ఇక్కడ నూటికి నూరుపాళ్లు రిగ్గింగ్‌ జరిగిందంటూ మరోసారి తనదైన శైలిలో వ్యాఖ్యలు చేశారు. అమెరికా ఎన్నికల విధానం వెనుకబడిన దేశాల్లో మాదిరిగా ఉందన్నారు.