Agriculture

ధాన్యం నిల్వ కోసం సరికొత్త సంచులు

ధాన్యం నిల్వ కోసం సరికొత్త సంచులు

పూర్వం పండించిన ధాన్యాన్ని అనేక రోజులపాటు నిలువ ఉంచుకునేవారు. అందుకోసం పెద్దపెద్ద మట్టి పాత్రలు, వెదురు గుమ్మిలను వాడేవారు. ఆ తర్వాత కాలంలో గోనె సంచులూ ప్లాస్టిక్‌ డబ్బాలనూ ఆశ్రయించారు. కానీ, మారుతున్న వాతావరణ పరిస్థితుల వల్ల ధాన్యాన్ని నిలువ చేయడం సవాలుగా మారుతున్నది. కీటకాలు, తెగుళ్ల వల్ల విత్తనం బరువు కోల్పోతున్నది. అధిక ఉష్ణోగ్రత, తేమతో గింజల్లోని పోషక విలువలు కూడా తగ్గిపోతున్నాయి. ఈ సమస్యకు హైదరాబాద్‌ రాజేంద్రనగర్‌లోని గృహ విజ్ఞాన కేంద్రంవారు పరిష్కారం చూపారు. రెండు పొరలు ఉండే హెర్మెటిక్‌ సంచుల్లో ధాన్యం నిల్వ చేసే పద్ధతిని ఆవిష్కరించారు. ఈ సంచులు కీటకాలు, తెగుళ్లు, అధిక ఉష్ణోగ్రత, తేమ నుంచి ధాన్యాన్ని కాపాడుతాయి. ఈ పద్ధతిలో ఉపయోగించే సంచులు రెండు పొరలను కలిగి ఉంటాయి. 20 మైక్రాన్ల పాలిథిన్‌ షీట్‌తో తయారు చేసిన లోపలి పొరలో ధాన్యం నిల్వ ఉంటుంది. పాలీప్రొపైలిన్‌తో తయారైన మొదటి పొర.. వాతావరణంలో కలిగే మార్పుల నుంచి ధాన్యాన్ని రక్షిస్తుంది. బూజు పెరుగుదల, తేమ, ఇతర కలుషితాల నుంచి ధాన్యాన్ని కాపాడుతుంది.బ్యాక్టీరియా చర్యలు, క్రిమికీటకాలు ఆశించడాన్ని తగ్గిస్తుంది. వాయు మార్పిడిని తొలగిస్తుంది. ఈ సంచుల్లో బియ్యంతోపాటు పప్పు దినుసులు, రాగులు, జొన్నలు, గోధుమలను ఏడాది పాటు నిలువ ఉంచుకోవచ్చు.