Editorials

గన్నవరం నిండుగా స్తబ్దత

గన్నవరం నిండుగా స్తబ్దత

దిగ్గజ సంస్థలతో కూడిన మల్లవల్లి కారిడార్‌ ఓ వైపు. కొండల మధ్య వీరపనేనిగూడెం రూపు మార్చేసిన ఇండస్ట్రియల్‌ పార్క్‌ మరో వైపు. నవ్యాంధ్రను పరిశ్రమల ఏర్పాటు దిశగా…. గన్నవరం పరిసరాల్లో సాగిన మహాయజ్ఞం ఇది. కానీ ఇదంతా ఒకప్పటి మాట. ఇప్పుడు పరిస్థితి పూర్తి భిన్నం. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహం అందిస్తూ పరుగులు పెట్టిన సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల నిర్మాణ పనుల్లో…. కొన్ని నెలలుగా స్తబ్దత నెలకొంది.
**అభివృద్ధిలో వెనకబడ్డ గన్నవరంఅంతర్జాతీయ విమానాశ్రయానికి 27 కిలోమీటర్ల దూరంలో ఉన్న మల్లవల్లిలో 1200 ఎకరాల్లో… మోడల్‌ ఇండస్ట్రియల్‌ కారిడార్‌ ఏర్పాటు చేసింది గత ప్రభుత్వం. ఒక సెక్టార్‌లో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల ఏర్పాట్ల కోసం ప్రభుత్వం దాదాపు 700కు పైగా ప్లాట్లకు అవకాశం కల్పించింది. మరో సెక్టార్లో భారీ పరిశ్రమల ఏర్పాటుకు ప్రణాళికలు రచించారు. ఇందులో భాగంగానే దిగ్గజ సంస్థలైన అశోక్‌ లేల్యాండ్‌, మోహన్‌ స్పిన్‌టెక్స్‌ స్పిన్నింగ్‌ మిల్‌ కూడా ప్రారంభమయ్యాయి. జాతీయ రహదారుల సంస్థ ఇందులోనే లాజిస్టిక్‌ హబ్‌తో పాటు గోల్డ్‌ రిఫైనరీ ఇండస్ర్టీస్‌, వింటేజ్‌ ఇండియా వంటి దిగ్గజ సంస్థలు కూడా ఇక్కడ యూనిట్ల ఏర్పాటుకు చర్యలు చేపట్టాయి. సౌకర్యాల లేమి పారిశ్రామికవేత్తలను పునరాలోచనలో పడేశాయి. ఇదే సమయంలో… ఔట్‌ రేట్‌ సేల్‌ ప్రాతిపదికన ప్లాట్లను కేటాయించిన వివిధ అసోసియేషన్ల పరిధిలో అనేక సంస్థలపై… A.P.I.I.C వేటు వేసింది.
**వెనుకంజవేసేలా చేసింది..
స్థలాలు పొంది గడువులోగా డబ్బు చెల్లించకపోవటం.. ఏపీఐఐసీతో ఒప్పందాలు చేసుకోకపోవటం వల్ల.. ఆయా సంస్థల కేటాయింపులను రద్దు చేశారు. రెండు దశల్లో దాదాపు 200కు పైగా సంస్థలపై చర్యలు తీసుకోవటం.. పారిశ్రామికవేత్తలనూ వెనుకంజ వేసేలా చేసింది.
*పారిశ్రామికవేత్తలకు నోటీసులు జారీ..
ఇక్కడ పరిశ్రమలు ఏర్పాటు చేయాలనుకునే.. హైదరాబాద్‌ ఔత్సాహిక పారిశ్రామికవేత్తల కోసం.. రాష్ట్ర ప్రభుత్వం వీరపనేనిగూడెం ప్రాంతంలో 75 ఎకరాల విస్తీర్ణంలో ఇండస్ట్రియల్‌ పార్క్‌ను అభివృద్ధి చేసింది. వారంతా.. అమరావతి ఇండస్ట్రీస్‌ అసోసియేషన్‌ పేరుతో పరిశ్రమల ఏర్పాటుకు నిర్ణయించారు. ప్రస్తుతం ఇక్కడ 40కుపైగా పరిశ్రమల ఏర్పాటుకు ముందుకొచ్చాయి. యూనిట్ల ఏర్పాటు ఆలస్యం కావటంతో.. ఏపీఐఐసీ.. పారిశ్రామికవేత్తలకు నోటీసులు జారీ చేసింది.
**దాదాపు ఖాళీ..
అంతర్జాతీయ విమానాశ్రయానికి అభిముఖంగా.. సైబర్‌వాడగా రూపు మార్చుకుంటుందనుకున్న.. కేసరపల్లి ఆశలు కూడా ఫలించట్లేదు. దిగ్గజ సంస్థ HCL మినహా చెప్పుకోదగ్గ ఐటీ అభివృద్ధి లేదు. మేధ టవర్స్‌లో ఏర్పాటైన ఐటీ, ఐటీ అనుబంధ పరిశ్రమలు దాదాపు ఖాళీ అయ్యాయి.