Agriculture

గులాబీ మొక్కల పెంపకానికి ఇవి చిట్కాలు

Rose Farming In Winter-Telugu Agricultural News

రంగు రంగుల గులాబీల్ని చూస్తే మనసు మురిసిపోతుంది. వరండా, బాల్కనీ… ఇలా ఎక్కడ ఏ కాస్త చోటు ఉన్నా ఈ మొక్కల్ని సులువుగా పెంచుకోవచ్చు. అదే వీటిని సేంద్రియంగా పెంచుకోగలిగితే గులాబీ రేకలతో గులాబీ నీరు, బెల్లం, చక్కెరతో కలిపి గుల్కండ్‌ వంటివి తయారు చేసుకోవచ్చు. అసలు ఈ మొక్కల్ని ఎలా పెంచుకోవాలో తెలుసుకుందామా!
గులాబీల్లో ఎన్నో రకాలు ఉన్నా ఎరుపు, పసుపు, తెలుపు, గులాబీ రంగు పూల మొక్కలకు ఆదరణ ఎక్కువ. వీటిని నాటుకునే ముందు చీడపీడల్ని తట్టుకునే రకాల్ని ఎంచుకోవాలి. సంవత్సరంలో మూడు, నాలుగు దఫాలుగా వీటికి అంటుకట్టి కొత్త మొక్కల్ని పెంచుకోవచ్చు.
ఎత్తుని బట్టి… మొక్క ఎదిగే తీరుని బట్టి కుండీలను ఎంచుకోవాలి. పొట్టి గులాబీలకు పన్నెండు అంగుళాలు… ఫ్లోరిబండా, చిన్న హైబ్రీడ్‌, పెద్ద హైబ్రీడ్‌ రకాలకు పద్దెనిమిది అంగుళాల్లో కుండీలను వాడాలి. అవి లోతుగా, వేర్ల పెరుగుదలకు అనుగుణంగా ఉండేలా చూసుకోవాలి. గులాబీ మొక్కల్ని పెంచేందుకు అవసరమైన మట్టిని సిద్ధం చేసుకోవాలి. ఎర్రమట్టి, తేమని నిలిపే కొబ్బరిపీచు (కోకోపీట్‌), కొంత వర్మీ కంపోస్టు కలిపి కుండీలో నింపాలి. దానికి అడుగున రంధ్రం చేస్తే మిగులు నీరు బయటికి పోతుంది. ఈ మట్టి మొత్తం తడిసేలా దశల వారీగా నీటిని అందించాలి. మొక్కని నేరుగా కుండీల్లో నాటాలనుకున్నప్పుడు వేర్లు కుండీలో అన్ని వైపులకు సమానంగా వ్యాపించాలి. అవి రెండు అంగుళాల లోతులో ఉండేలా చూసుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ ద్రవ, ఘన రూప ఎరువులను కొత్త వేళ్లకు తగిలేలా ఉంచకూడదు. అలాచేస్తే మొక్కలు మొదట్లోనే చనిపోయే ప్రమాదం ఉంది.
***ఆధారం ఇవ్వాలి…
గులాబీ మొక్కల్ని గాలి సోకే ప్రాంతాల్లో, మిద్దెలమీద పెంచుతుంటారు. అవి పొడవుగా ఎదిగే మొక్కలైతే త్వరగా విరిగిపోవచ్చు. ఆ సమస్య ఎదురుకాకుండా మొక్కలకు తగిన ఊతమివ్వాలి. ఎప్పటికప్పుడు ఎండిన పూలను, కొమ్మల్ని కత్తిరించుకుంటే మొక్కలు చక్కగా పెరుగుతాయి. ఎక్కువ పూలు పూస్తాయి. పెంచే రకాన్ని బట్టి పోషణ అందించాలి. రెండు వారాలకోసారి ఎన్‌పీకే ఉండే ద్రవరూప ఎరువుల్ని అందించాలి. వర్మీకంపోస్టు, పశువుల పేడ వంటి సేంద్రియ ఎరువులను మొక్కలకు వినియోగించవచ్చు. వీటన్నింటివల్లా అన్ని పోషకాలు సమపాళ్లల్లో అందుతాయి. మూడు నుంచి ఐదు సంవత్సరాల వరకూ ఆ కుండీలు మార్చవలసిన అవసరం లేదు. గులాబీపూల సంఖ్య, నాణ్యత తగ్గితే కొత్త మొక్కల్ని పెట్టాల్సిందే. అలాంటి మొక్కలను పడేయకుండా పెరట్లో నాటితే మళ్లీ పూస్తాయి.
***పోషణ ఇలా…
గులాబీల మట్టి పొడిబారకుండా చూసుకోవాలి. కుండీల్లోని మట్టి మిశ్రమంపై మెత్తటి సేంద్రియ ఎరువును చల్లితే తేమ కోల్పోకుండా చేయవచ్చు. కుండీల్లో పెంచే గులాబీలకు సాధారణంగా పొలుసు పురుగులు, నల్లి, తామర, పిండి పురుగులు పడతాయి. దాంతో పూలు ఆకర్షణ కోల్పోతాయి. ఈ సమస్యకు రసాయన పురుగుమందులు కాకుండా వేపనూనె వాడొచ్చు. ఇది ఫంగస్‌ని అదుపులో ఉంచుతుంది.