Business

అమెరికా ఎగుమతులపై చైనా ఆంక్షలు-వాణిజ్యం

అమెరికా ఎగుమతులపై చైనా ఆంక్షలు-వాణిజ్యం

* అమెరికాకు సంబంధించిన కీలక ఎగుమతులను చైనా నిలిపివేసే అవకాశం ఉంది. ఇప్పటికే చైనా కంపెనీలపై అమెరికా ఆంక్షలు విధించడంతో దానికి ప్రతిగా చైనా ఈ చర్యలను చేపట్టింది. రక్షణ రంగానికి సంబంధించిన వస్తువులు.. అంశాలు దీనిలో ఉండే అవకాశం ఉంది. టిక్‌టాక్‌, హువావే, టెన్సెంట్‌ వంటి కంపెనీలపై అమెరికా ఆంక్షలతో విరుచుకుపడిన విషయం తెలిసిందే. మంగళవారం నుంచి అమల్లోకి వచ్చే చైనా సరికొత్త ఆంక్షలతో వాణిజ్యపోరు మరోస్థాయికి చేరనుంది. దీంతో ట్రంప్‌ శ్వేతసౌధం వీడే వరకూ వేచి చూసి ఆ తర్వాత బైడెన్‌ నిర్ణయాలకు అనుగుణంగా స్పందించే వైఖరిని డ్రాగన్‌ ఎంచుకోలేదని తెలుస్తోంది.

* ఇతర దేశాలతో పోలిస్తే భారతీయ కంపెనీలు అత్యంత వేగంగా కొవిడ్‌-19 ముందునాటి లాభదాయక పరిస్థితికి చేరుకుంటాయని హెచ్‌ఎస్‌బీసీ వార్షిక నేవిగేటర్‌ సర్వే అంచనా వేసింది. రక్షణాత్మక విధానాలు అవలంబిస్తున్నప్పటికీ అంతర్జాతీయ వాణిజ్యం సానుకూలంగా ఉండనుందని తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా 39 అంతర్జాతీయ మార్కెట్లలో పదివేల కంపెనీలతో హెచ్‌సీబీసీ అధ్యయనం చేపట్టింది. భారత్‌ నుంచి 350 సంస్థలు పాల్గొన్నాయి. పెట్టుబడులు, వృద్ధిపట్ల ఇవి ఆశావహ దృక్పథంతో ఉన్నాయి.

* ప్రముఖ చెల్లింపుల సంస్థ పేటీఎం.. వ్యాపారులకు గుడ్‌ న్యూస్‌ చెప్పింది. వ్యాపారులు చేసే లావాదేవీలపై అన్ని రకాల ఛార్జీలను రద్దు చేసింది. ఇకపై పేటీఎం వ్యాలెట్‌, యూపీఐ యాప్స్‌, రూపే కార్డుల ద్వారా చేసే పేమెంట్స్‌పై ఎలాంటి ఛార్జీలూ వసూలు చేయబోమని పేర్కొంది. ఇది వ్యాపారులకు లాభం చేకూర్చి వారి వ్యాపారాభివృద్ధికి తోడ్పడుతుందని పేటీఎం ఓ ప్రకటనలో పేర్కొంది.

* వస్తు సేవల పన్ను (జీఎస్టీ) వసూళ్లు మరోసారి రూ.లక్ష కోట్లు దాటాయి. 2020-21 ఆర్థిక సంవత్సరం నవంబర్‌ నెలకు గానూ రూ.1,04,963 కోట్లు వసూలైనట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. అక్టోబర్‌తో పోలిస్తే వసూళ్లు స్వల్పంగా తగ్గగా.. గతేడాది నవంబర్‌తో పోలిస్తే 1.4 శాతం వసూళ్లు (₹1,03,491 కోట్లు) పెరగడం గమనార్హం.

* మనీలాండరింగ్‌ ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐసీఐసీఐ బ్యాంక్‌ మాజీ సీఈవో, ఎండీ చందాకొచ్చర్‌కు సర్వోన్నత న్యాయస్థానంలో చుక్కెదురైంది. తనను సీఈవో, ఎండీ పదవుల నుంచి తప్పించడాన్ని సవాల్‌ చేస్తూ కొచ్చర్‌ వేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. ‘సారీ.. హైకోర్టు ఇచ్చిన తీర్పులో మేం జోక్యం చేసుకోలేం. ఇది ప్రయివేటు బ్యాంకుకు.. ఉద్యోగిగి మధ్య జరిగిన ఒప్పందం పరిధిలోకి వస్తుంది’ అని జస్టిస్‌ సంజయ్‌ కిషన్‌ కౌల్‌ నేతృత్వంలోని ధర్మాసనం స్పష్టం చేసింది.

* దేశీయ స్టాక్‌ మార్కెట్లు నేడు భారీగా ర్యాలీ చేశాయి. మార్కెట్లు ముగిసే సమయానికి నిఫ్టీ 140 పాయింట్లు పెరిగి 13,109 వద్ద, సెన్సెక్స్‌ 505 పాయింట్లు పెరిగి 44,655 వద్ద స్థిరపడ్డాయి. టాటామెటాలిక్స్‌, ఐఐఎఫ్‌ఎల్‌ ఫినాన్స్‌, వాక్రెంజ్‌, మహీంద్రా లైఫ్‌ స్పేస్‌ షేర్లు భారీగా లాభపడగా.. ఫ్యూచర్‌ లైఫ్‌స్టైల్‌, ఫ్యూచర్‌ రీటైల్‌, శ్రీరామ్‌ ట్రాన్స్‌పోర్టు, వరుణు బేవరేజస్‌, మెట్రోపోలీస్‌ హెల్త్‌కేర్‌ భారీగా నష్టపోయాయి. బీఎస్‌ఈ కన్జ్యూమర్‌ డ్యూరబుల్స్‌ తప్ప మిగిలిన సూచీలు మొత్తం లాభాల్లోనే ఉండటం విశేషం.

* కొవిడ్‌-19 పరిణామాల కారణంగా దేశీయంగా వినియోగదారుల వ్యయాలు ఈ ఏడాది తగ్గగా, వచ్చే ఏడాది 6.6 శాతం మేర పెరొగొచ్చని ఫిచ్‌ సొల్యూషన్స్‌ అంచనా వేస్తోంది. 2019తో పోలిస్తే 2020లో ఈ వ్యయాలు 12.6 శాతం మేర క్షీణించవచ్చని అంచనా. నిత్యావసరాలు కాని వాటిపై ప్రజలు ఖర్చును తగ్గించుకోవడంతో ఇతర విభాగాల్లో వినియోగం గణనీయంగా క్షీణిస్తుందని అంచనా వేస్తున్నట్లు పేర్కొంది. ‘2021లో సానుకూల వృద్ధి నమోదైనా, ఇతర దేశాలతో పోలిస్తే పుంజుకోవడం నెమ్మదిగానే ఉంటుంద’ని తెలిపింది. నిరుద్యోగిత ఎక్కువగా ఉండటం, ప్రభుత్వ చర్యలు ఫలవంతం కావడంతో అనిశ్చితి కొనసాగుతాయని పేర్కొంది. 2021 రెండో అర్ధభాగం, 2022లోనే కొవిడ్‌-19 ముందున్న స్థాయికి వినియోగం చేరుతుందని ఫిచ్‌ సొల్యూషన్స్‌ అంచనా వేసింది. 2019లో వినియోగదారుల వ్యయాలు రూ.121.6 లక్షల కోట్లు కాగా.. 2021లో ఇది రూ.123 లక్షల కోట్లకు చేరొచ్చు.

* బిట్‌కాయిన్‌ సోమవారం 19864 డాలర్ల రికార్డు గరిష్ఠ స్థాయికి చేరింది. డిసెంబరు 2017 నాటి పాత రికార్డులను బద్దలు కొట్టింది. ఈ ఏడాది ఇప్పటిదాకా ఈ వర్చువల్‌ కరెన్సీ 170 శాతం లాభాలను పొందింది. నష్టభయం ఎక్కువగా ఉన్న ఆస్తులకు గిరాకీ పెరగడంతో పాటు.. త్వరలోనే క్రిప్టోకరెన్సీలను కూడా ఇతర కరెన్సీల్లా అంగీకరిస్తారన్న అంచనాలతో ఇది ముందుకెళ్లింది. 12 ఏళ్ల బిట్‌కాయిన్‌ చరిత్రలో అనూహ్య ఎత్తుపల్లాలు నమోదయ్యాయి. సంప్రదాయ ఆస్తులతో పోలిస్తే బిట్‌ కాయిన్‌ మార్కెట్‌ అధిక ఊగిసలాటను కలిగి ఉంటోంది.