DailyDose

ఏపీలో 7వేలు దాటిన కరోనా మరణాలు-తాజావార్తలు

ఏపీలో 7వేలు దాటిన కరోనా మరణాలు-తాజావార్తలు

* ఆంధ్రప్రదేశ్‌లో కరోనా మరణాలు 7వేలు దాటాయి. గడిచిన 24 గంటల్లో కొవిడ్‌ బారినపడి ఏడుగురు బాధితులు మరణించడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు మృతిచెందిన వారి సంఖ్య 7,003కి చేరింది. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ బులెటిన్‌ విడుదల చేసింది. గడిచిన 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్‌లో 56,988 నమూనాలను పరీక్షించగా 663 మందికి కరోనా నిర్ధారణ అయింది. దీంతో రాష్ట్రంలో కొవిడ్‌ కేసుల సంఖ్య 8,69,412కి చేరింది. ఒక్కరోజు వ్యవధిలో 1,159 మంది కొవిడ్‌ నుంచి పూర్తిగా కోలుకోగా.. ప్రస్తుతం రాష్ట్రంలో 6,924 యాక్టివ్‌ కేసులున్నాయి. ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా 1,01,66,696 నమూనాలను పరీక్షించినట్లు ప్రభుత్వం బులెటిన్‌లో పేర్కొంది.

* వ్యవసాయ చట్టాల రద్దు కోరుతూ దేశ రాజధాని సరిహద్దుల్లో చేపట్టిన ఆందోళనలను మరింత ఉద్ధృతం చేయాలని రైతు సంఘాలు నిర్ణయించాయి. వెంటనే వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని, అందుకోసం కేంద్ర ప్రభుత్వం వెంటనే ప్రత్యేక పార్లమెంట్‌ సమావేశాలు ఏర్పాటు చేయాలని కోరాయి. రేపటిలోగా చట్టాల రద్దుకు నిర్ణయం తీసుకోకుంటే ఆందోళనలు మరింత ఉద్ధృతం చేస్తామని హెచ్చరించాయి.

* వైకాపా పాలనలో రైతులందరికీ న్యాయం జరగడం లేదని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్ అన్నారు. నివర్‌ తుపాను బాధిత రైతులను వైకాపా నేతలు కనీసం పరామర్శించలేదని ఆరోపించారు. కృష్ణా జిల్లా మోపిదేవి మండలంలోని పెదప్రోలులో ఆయన నివర్‌ బాధిత రైతులను పరామర్శించారు. ఈ సందర్భంగా పలువురు రైతులు వారికి జరిగిన నష్టాన్ని జనసేనానికి వివరించారు. అనంతరం పవన్‌ అక్కడే మీడియాతో మాట్లాడారు. 48 గంటల్లోగా నష్టపోయిన రైతులు, కౌలు రైతులకు తక్షణ సాయం కింద రూ.10వేలు అందించాలని డిమాండ్‌ చేశారు. రైతులకు పరిహారం పెంచకుంటే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమం చేస్తామని హెచ్చరించారు.

* పోలవరంపై వైకాపా నేతలు నీచమైన రాజకీయం చేస్తున్నారని తెదేపా అధినేత చంద్రబాబు ఆరోపించారు. తమ హయాంలో అవినీతి జరిగిందని ఆరోపిస్తున్న వైకాపా ప్రభుత్వం.. ఎందుకు నిరూపించలేకపోయిందని నిలదీశారు. మంగళగిరిలోని తెదేపా కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో చంద్రబాబు మాట్లాడారు. తమ ప్రభుత్వం ఏడు ముంపు మండలాలను తీసుకురాకపోయుంటే పోలవరం నిర్మాణం సాధ్యమయ్యేదే కాదన్నారు. పోలవరం నిధులపై కేంద్రాన్ని ఒప్పించారా? అని వైకాపా నేతలను చంద్రబాబు ప్రశ్నించారు.

* గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌కు జరిగిన ఎన్నికల్లో 46.55శాతం పోలింగ్‌ నమోదైనట్లు జీహెచ్‌ఎంసీ ఎన్నికల అధికారి లోకేష్‌ కుమార్‌ తెలిపారు. గ్రేటర్‌లో 149 డివిజన్లకు జరిగిన ఎన్నికలకు సంబంధించి తుది పోలింగ్‌ శాతాన్ని ఆయన వెల్లడించారు. ఇందులో అత్యధికంగా ఆర్‌సీపురం డివిజన్‌లో 67.71 శాతం.. అత్యల్పంగా యూసఫ్‌గూడ డివిజన్‌లో 32.99 శాతం పోలింగ్‌ నమోదైనట్లు తెలిపారు. 2016లో జరిగిన జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో 45.27శాతం పోలింగ్‌ నమోదైంది. దీంతో పోల్చితే ప్రస్తుత ఎన్నికల్లో స్పల్పంగా ఓటింగ్‌ శాతం పెరిగింది.

* నగర ప్రజల సౌకర్యార్థం హైదరాబాద్‌ మెట్రో రైల్‌ ప్రయాణ సమయాన్ని పొడిగించారు. రేపటి నుంచి ఉదయం 6.30 గంటల నుంచి రాత్రి 9.30 గంటల వరకు సర్వీసులు నడపనున్నట్లు మెట్రో ఎండీ ఎన్వీఎస్‌ రెడ్డి తెలిపారు. ఇప్పటివరకు ఉదయం 7 గంటలకు మెట్రో సర్వీసులు ప్రారంభమయ్యేవని.. ప్రయాణికుల విజ్ఞప్తి మేరకు 30 నిమిషాలు ముందుగా అందుబాటులోకి తీసుకొచ్చినట్లు తెలిపారు. ఇక రాత్రి సమయంలో ఎలాంటి మార్పుల్లేవని.. గతంలోలాగే చివరి ట్రైన్ రాత్రి 9.30 గంటలకు ఉంటుందని స్పష్టం చేశారు.

* తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి దివంగత జయలలిత నెచ్చెలి వీకే శశికళ ముందస్తు విడుదలకు దరఖాస్తు చేసుకున్నారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో నాలుగేళ్లుగా ఇక్కడి పరప్పణ అగ్రహార జైల్లో ఖైదు అనుభవిస్తున్న ఆమె.. తాజాగా ముందస్తు విడుదలకు జైలు అధికారులకు దరఖాస్తు చేసుకున్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. ప్రత్యేక కోర్టులో తనకు విధించిన జరిమానా చెల్లించిన అనంతరం ఆమె 2021 జనవరి 27న జైలు నుంచి విడుదల కావాల్సి ఉండగా.. అంతకంటే ముందుగానే జైలు నుంచి బయటకు వచ్చేందుకు ఆమె ఈ దరఖాస్తు చేసుకున్నట్లు సమాచారం.

* అభివృద్ధి ఒక్కటే తమ పార్టీ నినాదమని, ప్రధాని మోదీ శ్వాస, ధ్యాస కూడా అదేనని ఏపీ భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. తమది సకల జనుల పార్టీ అని.. ప్రాంతీయ పార్టీల మాదిరిగా రాగద్వేషాలు ఉండబోవని చెప్పారు. విజయవాడలో మీడియాతో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో జరుగుతున్న ప్రతి కార్యక్రమం వెనుకా కేంద్ర ప్రభుత్వం అందించిన నిధులే ఉన్నాయన్నారు. ఆ నిధులను రాష్ట్ర ప్రభుత్వం తమ పథకాలుగా ప్రచారం చేసుకుంటోందని సోమువీర్రాజు ఆరోపించారు. ప్రభుత్వం అప్పులు చేసి నవరత్నాలు అందిస్తోందని ఆక్షేపించారు.

* ప్రముఖ ఆన్‌లైన్‌ గ్రాసరీ సంస్థ బిగ్‌ బాస్కెట్‌లో దాదాపు 80 శాతం వాటా కొనుగోలుకు టాటా గ్రూప్‌ సిద్ధమైనట్లు తెలుస్తోంది. అలీబాబా గ్రూప్‌ లిమిటెడ్‌ వాటాలు కలిగి ఉన్న బిగ్‌ బాస్కెట్‌లో మెజార్టీ వాటా కొనుగోలుకు సుమారు 1.3 బిలియన్‌ డాలర్లను వెచ్చించేందుకు టాటా గ్రూప్‌ సిద్ధమైనట్లు సమాచారం. ఈ మేరకు చర్చలు జరుగుతున్నాయని ఈ డీల్‌తో సంబంధం ఉన్న వ్యక్తి ఓ ఆంగ్ల పత్రికకు వెల్లడించారు. అయితే, అటు టాటా గ్రూప్‌ గానీ, బిగ్‌బాస్కె‌ట్‌ గానీ ఎలాంటి స్పందనా తెలియజేయలేదు.

* ఎమ్మెల్సీ కవితపై అనర్హత వేటు వేయాలని కేంద్ర ఎన్నికల సంఘానికి భాజపా లేఖ రాసింది. నిజామాబాద్‌ స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిచిన కవిత.. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లోనూ ఓటు వేశారని లేఖలో వెల్లడించింది. గతంలో కవిత నిజామాబాద్‌ ఎంపీగా పోటీ చేసినప్పుడు బోధన్‌ అసెంబ్లీలోని నియోజకవర్గంలో తనకు ఓటు ఉన్నట్లు అఫడవిట్‌లో పేర్కొందని తెలిపింది. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బంజారాహిల్స్‌ చిరునామాతో మరోసారి ఓటు హక్కు వినియోగించుకున్నారని వివరించింది.

* దేశంలో కరోనా వైరస్‌ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో..తమ ప్రజలందరికీ ఉచితంగా కొవిడ్-19 టీకాను అందించాలని జపాన్‌ ప్రభుత్వం నిర్ణయించింది. బుధవారం దానికి సంబంధించిన బిల్లును కూడా పాస్‌ చేసింది. 12.6 కోట్ల జనాభా టీకా ఖర్చులను ప్రభుత్వమే భరిస్తుందని ఈ బిల్లు వెల్లడిచేస్తోంది. 8.5 కోట్ల మంది ప్రజలకు టీకాలు అందించే లక్ష్యంతో అమెరికన్ తయారీ సంస్థలైన ఫైజర్, మోడెర్నాలతో జపాన్ ఇదివరకే ఒప్పందం చేసుకుంది. అలాగే 12 కోట్ల డోసుల ఆస్ట్రాజెనెకా టీకాను పొందనున్నట్లు ఆ దేశం తెలిపింది.