Editorials

కల్తీలో పరాకాష్ఠ. 77శాతం తేనే విషమే!

కల్తీలో పరాకాష్ఠ. 77శాతం తేనే విషమే!

భారత్‌లో వివిధ బ్రాండ్ల పేరిట విక్రమయమవుతున్న తేనెలు కల్తీ అవుతున్నట్లు సెంటర్‌ ఫర్‌ సైన్స్‌ అండ్‌ ఎన్విరాన్‌మెంట్‌(సీఎస్‌ఈ) తెలిపింది. భారత్‌లోని 13 ప్రముఖ, సాధారణ బ్రాండ్లకు సంబంధించిన తేనెల నాణ్యతను సీఎస్‌ఈ ఆహార పరిశోధకులు పరిశీలించారు. మొత్తం 22 శాంపిల్స్‌ను పరీక్షించగా 77 శాతం తేనెలు పంచదార పాకంతో కల్తీ చేస్తున్నట్లు వారు గమనించారు. కేవలం ఐదు బ్రాండ్లు మాత్రమే అన్ని నాణ్యతా ప్రమాణాలు పాటిస్తున్నాయని వారు వివరించారు. గుజరాత్‌లోని పశువుల ఆహార, అభ్యసన కేంద్రం (సీఏఎల్‌ఎఫ్‌), కర్ణాటకలోని నేషనల్‌ డెయిరీ డెవలప్‌మెంట్‌ బోర్డు (ఎన్‌డీడీబీ)లో ఈ శాంపిళ్లను ముందుగా పరీక్షించగా అన్నీ నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నట్లు ఫలితాలు వచ్చాయన్నారు. కానీ వాటిని జర్మనీలోని ఓ ప్రత్యేక ల్యాబరేటరీలో న్యూక్లియర్‌ మాగ్నటిక్‌ రెసొనెన్స్‌(ఎన్‌ఎమ్‌ఆర్‌) పరీక్ష చేయించగా అవన్నీ నాణ్యతా ప్రమాణాలు పాటించడంలో విఫలమైనట్లు ఆ ఫలితాల్లో వెల్లడైందని తెలిపారు. ‘‘ఈ విషయాలు తెలిశాక మేం ఆశ్చర్యపోయాం. కల్తీ వ్యాపారం దేశంలో ఇలా వేళ్లూనుకుపోయిందని తెలుసుకున్నాం. దేశంలో నిర్దేశించిన అన్ని పరీక్షలకు పట్టుబడకుండా కల్తీ చేస్తున్నారు. కల్తీ అయిన తేనెనే ప్రజలంతా తీసుకుంటున్నారు. అది బాధపడాల్సిన విషయం’’ అని సీఎస్‌ఈ ప్రోగ్రామ్‌ డైరక్టర్‌ అమిత్‌ ఖురానా తెలిపారు. అంతే కాకుండా చైనాకు చెందిన అనేక కల్తీ ఫ్రక్టోజ్‌ సిరప్‌లు భారత్‌కు ఎగుమతి అయినట్లు సీఎస్‌ఈ ప్రతినిధులు తెలిపారు. తేనెలో 50 నుంచి 80శాతం కల్తీ జరిగినా అది పరీక్షల్లో తెలియదని సీఎస్‌ఈ జనరల్‌ డైరక్టర్‌ సునితా నరైన్‌ తెలిపారు. ‘‘కరోనా కాలంలో ప్రజలు ఎక్కువగా తేనెను సేవించేందుకు అలవాటు పడ్డారు. కానీ ఇది ఆరోగ్యాన్నివ్వకపోగా, మరింత అనారోగ్యానికి గురి చేస్తోంది. దేశంలో నాణ్యతా ప్రమాణాలను కఠినతరం చేయాల్సిన అవసరం ఉంది. అధునాతన టెక్నాలజీలు ఉపయోగించడం ద్వారా మనం ఈ కల్తీ వ్యాపారాల్ని అదుపుచేయగలం. ప్రజల ఆరోగ్యాలకు వ్యాపారసంస్థలు బాధ్యత వహించాల్సి వస్తుంది. తేనెను విక్రయించే ప్రతి సంస్థనూ వారి మూలాల్నుంచి విచారించాలి’’ అని సునీతా నరైన్‌ తెలిపారు.