Fashion

చీరకొంగుపై రాములోరి కొలువు

చీరకొంగుపై రాములోరి కొలువు

పట్టుచీర అంటేనే అపురూపం. అటువంటి పట్టు చీర కొంగుపై ఛత్తీస్‌గఢ్‌కు చెందిన చేనేత కళాకారులు తమ సృజనాత్మకతను ప్రదర్శించారు. జాలువారే ఆ పైట కొంగుపై శ్రీరామ దర్బార్‌ను డిజైన్‌గా తీర్చిదిద్ది తమ భక్తికి కళానైపుణ్యాన్ని అద్దారు.
కోసా పట్టుకు ఛత్తీస్‌గఢ్‌ ప్రసిద్ధి. జాంజిగిర్‌-చంపా జిల్లాలోని చంద్రాపూర్‌కు చెందిన ‘పరమేశ్వరి చేనేత కళాకారుల సహకార సంఘం’ ఆధ్వర్యంలో రూపొందించిన ఈ చీరకు ‘రామాయణ చీరలు’ అనే పేరు పెట్టారు. అయోధ్యలో సీతాదేవి, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు, హనుమంతుడు సమేతంగా శ్రీరాముడు దర్బారులో ఆసీనుడై ఉన్న దృశ్యాన్ని వర్ణభరితమైన దారాలతో చీర కొంగుపై ఇద్దరు చేనేత కళాకారులు అద్భుతంగా ఆవిష్కరించారు. 12 రోజులపాటు శ్రమించి నేసిన ఈ చీరకు ప్రముఖుల ప్రశంసలెన్నో దక్కాయి. శ్రీరామ దర్బార్‌ దృశ్యాన్ని చీరకొంగుపై మలచడానికి ముందుగా చీర నేతకు మాత్రం వీరికి 17 రోజులు పట్టింది. దర్బార్‌ డిజైన్‌ను దారాలతో సహజసిద్ధంగా అల్లిన ఈ రామాయణ చీరను రాయపూర్‌లోని బిలాసా ఎంపోరియంలో విక్రయానికి ఉంచారు.