Business

భారతీయ రైల్వే కీలక నిర్ణయం-వాణిజ్యం

Business News - Indian Railway New TimeTable To Clear Delays

* రైల్వేశాఖ సరకు రవాణా, ప్రయాణికుల రైళ్లలో ఆలస్యాలకు స్వస్తి చెప్పేందుకు సరికొత్త టైం టేబుల్‌ను తీసుకొస్తోంది. దీనిపై రైల్వే బోర్డు ఛైర్మన్‌ వీకే యాదవ్‌ మాట్లాడుతూ ‘‘రైల్వేలో అమల్లోకి రానున్న ‘జీరో బేస్డ్‌ టైం టేబుల్‌’తో ప్రయాణ సమయం గణనీయంగా తగ్గుతుంది. తగ్గే సమయం కనీసం 30 నిమిషాల నుంచి 6 గంటల వరకు వుంది. దీనిలో ప్రత్యేకమైన కారిడార్లు సరకు రవాణా రైళ్ల ప్రయాణాలను మరింత సులువు చేస్తాయి. దీంతో వ్యాపారం చేయడం సులభం అవుతుంది’’ అన్నారు.

* డిజిటల్‌ చెల్లింపుల విషయంలో రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా మరో కీలక నిర్ణయం తీసుకుంది. కొవిడ్‌ మహమ్మారి పరిస్థితుల్లో మరింత భద్రమైన, సురక్షితమైన డిజిటల్‌ లావాదేవీలను అందించడంలో భాగంగా కాంటాక్ట్‌లెస్‌ కార్డ్‌ లావాదేవీలు, ఇ-మాండేట్‌ల పరిమితిని పెంచింది. ప్రస్తుతం రూ. 2000 వరకు చెల్లింపులు, లావాదేవీలను పిన్‌ నంబరు అవసరం లేకుండా జరుపుకొనే అవకాశం ఉండగా.. ఇప్పుడు ఆ పరిమితిని రూ. 5000 వరకు పెంచుతూ ఆర్‌బీఐ నిర్ణయం తీసుకుంది. 2021 జనవరి 1 నుంచి ఇది అమల్లోకి వస్తుందని గవర్నర్‌ శక్తికాంతదాస్‌ వెల్లడించారు.

* బ్యాంకింగ్‌ రంగంలోకి కార్పొరేట్‌ సంస్థలకు అనుమతివ్వడం భారతీయ రిజర్వు బ్యాంకు అభిప్రాయం కాదని గవర్నర్‌ శక్తికాంతదాస్‌ అన్నారు. అది కేవలం కేంద్ర బ్యాంకు అంతర్గత కమిటీ అభిప్రాయమని స్పష్టం చేశారు. నిపుణులు, ప్రజల నుంచి అభిప్రాయాలు స్వీకరించాకే తుది నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు.

* దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు నేడు భారీ లాభాల్లో ట్రేడింగ్‌ను ముగించాయి. ట్రేడింగ్‌ ముగిసే సమయానికి సెన్సెక్స్‌ 446 పాయింట్ల లాభంతో 45,079 వద్ద, నిఫ్టీ 124 పాయింట్ల లాభంతో 13,258 వద్ద స్థిరపడ్డాయి. నేడు ఆర్‌బీఐ చేసిన పరపతి విధాన ప్రకటన ఉత్సాహం నింపింది. సెన్సెక్స్‌ తొలిసారి 45 వేల మార్కును దాటడం విశేషం. ఇండోస్టర్‌ క్యాపిటల్‌ ఫిన్‌, అదానీ పవర్‌, స్పైస్‌జెట్‌, సుభావ్‌ ఇంజినీరింగ్‌, బ్యాంక్‌ ఆఫ్‌ మహారాష్ట్ర షేర్లు భారీ లాభాలతో ముగించగా.. వాక్రెంజ్‌, ఎంఎంటీసీ, ఐఎఫ్‌సీఎల్‌,హెచ్‌ఎఫ్‌సీఎల్‌,దాల్మియా భారత్‌ షేర్లు నష్టాలను నమోదు చేశాయి.

* కరోనా మహమ్మారి కట్టడి కోసం వ్యాక్సిన్‌ అభివృద్ధి చేసి బ్రిటన్‌ అనుమతి కూడా పొందిన బయోఎన్‌టెక్‌ సంస్థ వ్యవస్థాపకుడు ఉగర్‌ సహిన్‌ తాజాగా మరో ఘనత సాధించారు. ప్రపంచవ్యాప్తంగా 500 మంది అత్యంత సంపన్నుల జాబితాలో ఉగర్‌ చోటు దక్కించుకున్నారు. టీకాకు ఆమోదం లభించడంతో ఆయన సంపద భారీగా పెరిగిందని బ్లూమ్‌బర్గ్‌ వెల్లడించింది.

* కొత్త సంవత్సరంలో (2021) పబ్లిక్‌ ఇష్యూల మోత మోగనుంది. 30కి పైగా కంపెనీలు పబ్లిక్‌ ఇష్యూల ద్వారా రూ.30,000 కోట్లకు పైగా సమీకరించేందుకు సిద్ధమవుతున్నాయి. కరోనా మహమ్మారి ప్రభావం ఉన్నప్పటికీ 2020లోనూ తొలి పబ్లిక్‌ ఆఫర్‌ (ఐపీఓలు)లు బాగానే సందడి చేశాయి. ఈ ఏడాదిలో ఇప్పటివరకు 13 ఐపీఓలు పూర్తవ్వగా.. సమీకరించిన నిధుల విలువ దాదాపు రూ.25,000 కోట్లు. బర్గర్‌ కింగ్‌ ఐపీఓ నేటితో ముగియనుంది. ఈ సంస్థ రూ.810 కోట్లు సమీకరిస్తోంది. ఈ ఏడాది రెండో అర్ధభాగం పబ్లిక్‌ ఇష్యూలకు బాగా కలిసొచ్చింది. స్టాక్‌ మార్కెట్లో అనుకూల పరిస్థితులు ఉండటం కలిసొచ్చింది. 2019తో పోలిస్తే 2020లోనే ఐపీఓల ద్వారా నిధుల సమీకరణ అధికంగా జరిగింది. గతేడాది రూ.12,369 కోట్లు మాత్రమే కంపెనీలు పబ్లిక్‌ ఇష్యూల ద్వారా నిధులు సమీకరించాయి.

* విశ్లేషకుల అంచనాలు నిజం చేస్తూ వరుసగా మూడోసారి కీలక వడ్డీరేట్లలో ఎలాంటి మార్పులు చేయలేదు భారతీయ రిజర్వ్‌ బ్యాంక్‌(ఆర్‌బీఐ). ద్రవ్యోల్బణం పెరగడం, జీడీపీ ఇంకా ప్రతికూల స్థాయిలోనే ఉన్న వేళ రెపో రేటును యథాతథంగా 4 శాతానికి పరిమితం చేసింది. రివర్స్‌ రెపో రేటు 3.35శాతంగా, బ్యాంక్‌ రేటు 4.25శాతంగా కొనసాగనుంది. ద్వైమాసిక ద్రవ్య పరపతి విధాన సమీక్ష నిర్ణయాలను ఆర్‌బీఐ శుక్రవారం ప్రకటించింది.